మాచర్ల సెప్టెంబర్ 13 రాజధాని వాయిస్ :
పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రమైన మాచర్ల నిర్మాణమే లక్ష్యంగా శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మాచర్ల గుంటూరు రోడ్డులోని కోర్టు సమీపం నుంచి మార్కెట్ యార్డు వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కల చుట్టూ పెరిగిన కలుపు మొక్కలను తొలగించారు. అనంతరం మున్సిపల్ వాటర్ ట్యాంక్ ద్వారా మొక్కలకు నీటిని అందించారు.
ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ, “మానవ సేవయే మాధవ సేవ” అన్న స్వామి వివేకానంద స్ఫూర్తితో, “పరిశుభ్రతలోనే పరమాత్ముడు ఉన్నాడు” అన్న మహాత్మా గాంధీ సందేశంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ప్రతి ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
గ్రీన్ మాచర్ల–స్వచ్ఛ మాచర్ల సంకల్పంతో పట్టణంలో మొక్కలను నాటి, వాటి సంరక్షణ బాధ్యతను చేపడుతున్నామని గోవిందరెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ తమ వంతు సహకారం అందించాలని, ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహానుభావులు కలలు కన్న నవభారత నిర్మాణానికి ఇటువంటి సేవా కార్యక్రమాలు నాంది పలుకుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో పి. హరిబాబు, ఉప్పుతోళ్ల వెంకట్ నారాయణ, ఎం. పాపిరెడ్డి, ఎర్రబోతుల నాగశంకర్‌రెడ్డి, ఆర్టీసీ రాయప్ప తదితరులు పాల్గొని మొక్కల చుట్టూ కలుపు మొక్కలను తొలగించి, పరిసరాలను శుభ్రపరిచారు.
Be the first to share your thoughts on this story!