రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు విస్తృత స్థాయిలో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.
గురువారం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ పర్యవేక్షణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందుతున్న మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పోలింగ్ దృశ్యాలను పరిశీలించి, మీడియాకు వెబ్‌కాస్టింగ్ నిర్వహణ, పోలింగ్ సరళి వివరాలను వారికి ప్రత్యక్షం గా వెల్లడించారు.
*ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మాట్లాడుతూ...*
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పర్యవేక్షించేందుకు 15,100 వేలకు పైగా కెమెరాలతో వెబ్‌కాస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం సుమారు 5,600 కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సుమారు 9,500 గ్రామ పంచాయతీల పరిధిలో వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించే ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలను (లైవ్ స్ట్రీమింగ్) రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలోని ప్రత్యేక పర్యవేక్షణ హాల్‌కు అనుసంధానం చేసినట్లు తెలిపారు.
వివిధ జిల్లాల్లోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల నుంచి అందుతున్న పోలింగ్ దృశ్యాలను ఈ హాల్‌లో నిరంతరం పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
కెమెరాల ద్వారా పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించడంతో పాటు, రికార్డింగ్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వెబ్‌కాస్టింగ్ కెమెరాలు నిరంతరాయంగా పనిచేసేలా సాంకేతిక ఏర్పాట్లు చేశామని, కెమెరాల ద్వారా అందుతున్న ప్రత్యక్ష దృశ్యాల ఆధారంగా పోలింగ్ నిర్వహణ తీరును పర్యవేక్షిస్తున్నామని వివరించారు.
ఏదైనా పోలింగ్ కేంద్రంలో సమస్యలు లేదా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నట్లయితే వెంటనే గుర్తించి సంబంధిత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారుల ద్వారా తగిన చర్యలు తీసుకునేందుకు ఈ వ్యవస్థ దోహదపడుతుందని తెలిపారు.
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు, పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు వెబ్‌కాస్టింగ్ కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.వివిధ జిల్లాల నుంచి అందుతున్న నివేదికలు, వెబ్‌కాస్టింగ్ దృశ్యాలను సమన్వయం చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు.ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పోలింగ్ పూర్తయ్యే వరకు ప్రతి కేంద్రంలోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
Be the first to share your thoughts on this story!