*అమరావతి, నవంబర్ 27:*రాజధాని వాయిస్మ :త్స్యకారుల ప్రాణరక్షణ, వారి కుటుంబాల భద్రత, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడూ ప్రభుత్వం నిర్దేశించిన భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మత్స్యకారుల భద్రత, ట్రాన్స్‌పాండర్ల ఏర్పాటు, బోట్ల ఫిట్‌నెస్, బీమా సౌకర్యం తదితర అంశాలపై మంత్రి శుక్రవారం విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫానులు, విపత్కర పరిస్థితుల్లో మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, ఆర్టీజీఎస్ జారీ చేస్తున్న హెచ్చరికలను పట్టించుకోకుండా కొందరు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్తుండటం ఆందోళనకరమన్నారు. సముద్రంపై ఎంత అనుభవం ఉన్నప్పటికీ ప్రకృతి విపత్తులను తేలిగ్గా తీసుకోవద్దని హితవు పలికారు. ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యం కూడా విలువైన ప్రాణాలను బలితీసుకుంటుందని, కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెడుతుందని పేర్కొన్నారు. తుఫానుల సమయంలోనే కాకుండా సాధారణ వేటకు వెళ్లేటప్పుడు కూడా ప్రభుత్వం రూపొందించిన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (SOP) కచ్చితంగా అనుసరించాలని సూచించారు. భద్రతా ప్రమాణాలపై మత్స్యకారులకు ముందుగా పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, ఆ తర్వాత కూడా నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించడం మత్స్యకారుల ప్రాణాలను కాపాడటానికేనని స్పష్టం చేశారు.
*ట్రాన్స్‌పాండర్ల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ*
రాష్ట్రంలోని సుమారు 80 శాతం మత్స్యకార బోట్లకు ఇప్పటికే ట్రాన్స్‌పాండర్లు అమర్చినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మిగిలిన బోట్లకు కూడా వీలైనంత త్వరగా వీటిని ఏర్పాటు చేసేందుకు మత్స్యశాఖ కమిషనర్ రామ శంకర్ నాయక్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సముద్రంలో అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ట్రాన్స్‌పాండర్లను ఎలా వినియోగించాలి, వాటి ద్వారా సహాయం ఎలా పొందాలనే అంశాలపై మత్స్యకారులకు ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు. పరికరాలను అమర్చడంతోనే బాధ్యత పూర్తయినట్లు భావించకుండా అవి సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. సాంకేతిక లోపాలున్న వాటికి తక్షణమే మరమ్మతులు చేయించాలని, సాధ్యంకాని పక్షంలో కొత్తవి అందించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ట్రాన్స్‌పాండర్ల ఏర్పాటు, నిర్వహణ, వినియోగంపై అవగాహన కల్పించడంలో అధికారుల అలసత్వాన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు.
*ప్రతి బోటు ఫిట్‌నెస్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి*
రాష్ట్రవ్యాప్తంగా తీరప్రాంతాల్లోని మత్స్యకార బోట్ల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలపై మరోసారి సమగ్ర తనిఖీలు నిర్వహించాలని మత్స్యశాఖ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. ఎన్ని బోట్లకు ట్రాన్స్‌పాండర్లు అమర్చారు, ఇంకా ఎన్నింటికి ఏర్పాటు చేయాల్సి ఉంది, అమర్చిన వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయి, మిగిలిన బోట్లలో ఏర్పాటు చేయకపోవడానికి కారణాలేమిటనే వివరాలతో పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. సాంకేతిక సమస్యలతో పాటు అధికారుల స్థాయిలో ఏవైనా లోపాలు ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించాలన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందే బోట్ల ఫిట్‌నెస్, అవసరమైన రక్షణ పరికరాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలని స్పష్టం చేశారు. ట్రాన్స్‌పాండర్లు పాడైనా, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినా మత్స్యకారులు వెంటనే సంబంధిత ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (FDO), ఫిషరీస్ ఇన్‌స్పెక్టర్ లేదా గ్రామస్థాయిలోని విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ (VFA)ను సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదులు అందిన వెంటనే అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు. సంబంధిత సిబ్బంది నుంచి సరైన స్పందన లేకపోతే నేరుగా తన దృష్టికి సందేశం ద్వారా తీసుకురావచ్చని, అటువంటి విషయాలపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామని మత్స్యకారులకు మంత్రి భరోసా ఇచ్చారు.
*బీమా పరిధిలోకి అర్హులైన ప్రతి మత్స్యకారుడిని తీసుకురావాలి*
మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంలో బీమా అత్యంత కీలకమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అర్హులైన ఏ ఒక్క మత్స్యకారుడూ బీమా రక్షణకు దూరం కాకూడదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు (NFDB) ద్వారా అమలవుతున్న బీమా పథకం పరిధిలోకి అర్హులందరినీ తీసుకురావాలని మత్స్యశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. సముద్రంలో చేపల వేట సాగించేవారితో పాటు చేపలు, రొయ్యల చెరువుల్లో పనిచేసే కార్మికులు, ఫీడ్ రంగం సహా మత్స్య అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడిన వారికి కూడా ఆయా పథకాల అర్హత నిబంధనల మేరకు బీమా ప్రయోజనాలు అందేలా చూడాలన్నారు. ఇందుకోసం అర్హుల వివరాలను సమగ్రంగా పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అర్హులైన మత్స్యకారులు బీమా ప్రయోజనాలను కోల్పోయే పరిస్థితి తలెత్తకూడదని మంత్రి హెచ్చరించారు. అటువంటి ఘటనలు జరిగితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు నిబంధనల ప్రకారం నష్టపోయిన మొత్తాన్ని సంబంధిత అధికారుల నుంచి రికవరీ చేసే పరిస్థితి కూడా రావచ్చని స్పష్టం చేశారు. అధికారుల చిన్నపాటి అలసత్వం కూడా ఒక మత్స్యకార కుటుంబానికి జీవితాంతం తీరని నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని సూచించారు.
*మత్స్యకారుల భద్రతపై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సమీక్ష*
అనుకోకుండా జరిగే కొన్ని ప్రమాదాలను నివారించడం సాధ్యం కాకపోవచ్చని, అయితే మానవ తప్పిదాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రాణనష్టాన్ని ఎంతమాత్రం సహించబోమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించకపోవడం, అవసరమైన రక్షణ పరికరాలు అందించకపోవడం, సాంకేతిక లోపాలను సకాలంలో పరిష్కరించకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా మత్స్యశాఖ అధికారులతో తక్షణమే ప్రత్యేక సమీక్ష నిర్వహించి, భద్రతా ప్రమాణాల అమలుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కమిషనర్‌కు సూచించారు. క్షేత్రస్థాయిలో చేపట్టిన చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని, ప్రతి అధికారి అప్రమత్తంగా వ్యవహరించేలా చూడాలని ఆదేశించారు. మత్స్యకారుల ప్రతి ప్రాణం ప్రభుత్వానికి అత్యంత విలువైనదని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వారి భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదన్నారు. మత్స్యకారులు ప్రభుత్వ హెచ్చరికలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అధికారులు తమ విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. మత్స్యకారుల ప్రాణరక్షణతో పాటు వారి కుటుంబాల సంక్షేమం, ఆర్థిక భద్రతకు కూటమి ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో ఉందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
Be the first to share your thoughts on this story!