పాయకరావుపేట, నవంబర్ 27 : రాజధాని వాయిస్:
పాయకరావుపేట పట్టణ అభివృద్ధికి తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఈ నెల 29న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి జురెడ్డి ప్రసాద్‌తో పాటు వార్డు అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఆమె ప్రజలను కోరారు. పట్టణంలోని పలు వార్డుల్లో హోంమంత్రి అనిత విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడుగడుగునా పట్టణ ప్రజలు ఆమెకు స్వాగతం పలికారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతుగా కరపత్రాలను పంపిణీ చేశారు. పాయకరావుపేట పట్టణ అభివృద్ధే ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో పాయకరావుపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అనిత తెలిపారు. పట్టణ ప్రధాన రహదారి అభివృద్ధితో పాటు డ్రైనేజీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. సుమారు రూ.18 కోట్లతో పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. పాయకరావుపేట పంచాయతీకి నూతన భవన నిర్మాణం కోసం గతంలో రూ.90 లక్షలు మంజూరు చేయించినా,గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ భవన నిర్మాణంపై కూడా దృష్టి పెట్టలేదని విమర్శించారు. పట్టణంలో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, చెత్త నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తరలించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. అంబేద్కర్ భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పాయకరావుపేట నియోజకవర్గానికి స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్ వంటి పరిశ్రమలు రాకతో,స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి జురెడ్డి ప్రసాద్ మంచి నాయకుడని, ఆయనతో పాటు వార్డు అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి గెలిపించాలని హోం మంత్రి అనిత కోరారు. పంచాయతీ బాధ్యతను తాను తీసుకుంటానని, పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ఆమె స్పష్టం చేశారు.
Be the first to share your thoughts on this story!