నరసరావుపేట: పల్నాడు జిల్లాలో వినాయక మండపాలు, విగ్రహాల ఏర్పాటుకు నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి స్పష్టం చేశారు. అనుమతుల ప్రక్రియను సులభతరం చేసేందుకు ఆన్‌లైన్ ‘సింగిల్ విండో’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చామని, దీనిద్వారా పోలీస్, ఫైర్, మున్సిపల్/పంచాయతీ, విద్యుత్, రెవెన్యూ శాఖల ఎన్వోసీలను https://ganeshutsav.net/ పోర్టల్ ద్వారా ఉచితంగా పొందవచ్చని తెలిపారు. మొబైల్ నంబర్ ఓటీపీతో దరఖాస్తు చేసుకుని, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం లభించే క్యూఆర్ కోడ్ డిజిటల్ ఎన్వోసీని మండపం వద్ద తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. దరఖాస్తు సమయంలో నిర్వాహకుని ఆధార్, కమిటీలోని ఐదుగురు సభ్యుల వివరాలు, స్థల యజమాని లేదా స్థానిక సంస్థల అనుమతి పత్రం, విద్యుత్ అనుమతితో పాటు నిమజ్జనం తేదీ, సమయం, వాహనం, ఊరేగింపు మార్గం వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
మండపాల ఏర్పాటు వల్ల ప్రజల రాకపోకలకు, అంబులెన్స్, ఫైర్ సర్వీస్ వంటి అత్యవసర సేవలకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆటంకం కలగకూడదని, తగిన విద్యుత్ భద్రత, అగ్నిమాపక పరికరాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా, వాలంటీర్ల సేవలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లౌడ్‌స్పీకర్లు, డీజేలకు ముందస్తు అనుమతి తప్పనిసరని, రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మైకుల వినియోగంపై నిషేధం ఉంటుందని గుర్తుచేశారు. పోలీసు శాఖ నిర్దేశించిన మార్గాల్లోనే ఊరేగింపులు సాగాలని, అధికారికంగా గుర్తించిన ప్రదేశాల్లోనే నిమజ్జనాలు జరపాలని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, పర్యావరణ హితం కోసం మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అదనపు ఎస్పీ పిలుపునిచ్చారు.