Tuesday, 20 October 2026
Header1
BREAKING

రైతుల సంక్షేమానికి, పేదల గృహ నిర్మాణానికి అదనపు నిధులు, అనుమతులివ్వండి..

కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు సీఎం చంద్రబాబు లేఖలు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 04 Oct 2026, 07:55 PM
🔄 నవీకరణ: 12 Oct 2026, 04:02 PM
👁️ 111 views

⭐ Key Highlights / ముఖ్యాంశాలు

ఖరీఫ్-2026 పంటల 100% సేకరణకు ముందస్తు ఆమోదం కోరిన ముఖ్యమంత్రి మరో 6 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని వినతి వ్యవసాయ, కిసాన్ డ్రోన్లకు చెందిన పెండింగ్ నిధులు వెంటనే విడుదలకు విజ్ఞప్తి

అమరావతి. రాజధాని వాయిస్ :

 రైతులకు మేలు చేకూర్చేలా, అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేసి లబ్ది కలిగించేలా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని సీఎం చంద్రబాబు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు రాసిన రెండు వేర్వేరు లేఖల్లో కోరారు. రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇళ్లు కల్పించేలా అదనపు ఇళ్లను మంజూరు చేయాలనే అంశాలను సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఖరీఫ్-2026కి సంబంధించి పీఎం-ఆశా పథకం కింద కందులు, పెసలు, మినుములు, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, కొర్ర, వేరుశనగ వంటి 9 రకాల పంటల అంచనా దిగుబడిని 100 శాతం ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడానికి ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించి, తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి తప్పుతుందని పేర్కొన్నారు. కృష్ణా, కాకినాడ జిల్లాల్లో నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ ఆధారంగా చేసిన మార్పులను FFS యాప్‌లో చేర్చాలని, దీనివల్ల 2026-27 రబీ సీజన్ నాటికి ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేయవచ్చని ముఖ్యమంత్రి లేఖలో వివరించారు. ఆర్‌కేవీవై కిసాన్ డ్రోన్ కార్యక్రమానికి ఆమోదించిన రూ.52.164 కోట్ల పెండింగ్ నిధులను త్వరగా విడుదల చేయాలని కోరారు. ఈ నిధులు అందితే రాష్ట్రంలోని 1,130 గ్రామాల్లో యంత్ర పరికరాల బ్యాంకుల ఏర్పాటు ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తవుతుందని సీఎం లేఖలో తెలిపారు. అలాగే 5.69 లక్షల మట్టి నమూనాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.10.24 కోట్ల కమిటెడ్ లయబిలిటీ నిధులను, 2026-27 సంవత్సరానికి రావలసిన రూ.61.97 లక్షల మిగులు కేటాయింపులను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు.

*హౌసింగ్ ఫర్ ఆల్‌కు సహకరించండి*

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న హౌసింగ్ ఫర్ ఆల్ లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ మరో లేఖ రాశారు. 3 లక్షల కొత్త ఇళ్లను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీంతోపాటు.. మరిన్ని ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత గృహ అవసరాలు తీరాలంటే మరో 6 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు. రాష్ట్రంలో మిగిలి ఉన్న గ్రామీణ గృహ అవసరాలను పూర్తిగా తీర్చి, 2029 నాటికి ప్రతి పేద కుటుంబానికి శాశ్వత ఇల్లు అందించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. 6 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే, ఆ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు ఆ లేఖలో హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈ అంశాలపై వ్యక్తిగత చొరవ తీసుకుని, నిధుల విడుదల, అవసరమైన అనుమతుల ప్రక్రియ వేగవంతం అయ్యేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని సీఎం చంద్రబాబు లేఖలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు విజ్ఞప్తి చేశారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X