గుంటూరు, సెప్టెంబర్ 21: రాజధాని వాయిస్ :
నవయుగ వైతాళికుడు, మహాకవి గురజాడ వెంకట అప్పారావు అని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అన్నారు. గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఘనంగా జరిగాయి. గురజాడ చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాకవి గురజాడ వెంకట అప్పారావు తెలుగు సాహిత్యానికి, సామాజిక సంస్కరణలకు అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. గురజాడ రచనలు సమాజంలో మార్పుకు, ప్రజల్లో చైతన్యానికి మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు.
‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అంటూ గురజాడ అందించిన సందేశం నేటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. బాల్యవివాహాలు, సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాల నిర్మూలనకు గురజాడ చేసిన కృషి సమాజానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. వ్యవహారిక భాషా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. గురజాడ ఆశయాలను భావితరాలకు అందించేందుకు, ఆయన సాహిత్యాన్ని, సామాజిక సందేశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గురజాడ రచనలు సమాజంలో చైతన్యాన్ని నింపి, ప్రజల్లో సామాజిక మార్పుకు బాటలు వేశాయని అన్నారు. సామాజిక సమానత్వం, మూఢనమ్మకాల నిర్మూలన వంటి అంశాలపై గురజాడ అందించిన సందేశాలు ముఖ్యంగా కన్యాశుల్కం నాటకం ఇప్పటి సమాజానికి కూడా ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్టెప్ సి.ఇ.ఓ పి.వి.వి సత్యనారాయణ, పర్యాటక శాఖ అధికారి రమ్య, జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!