పర్యావరణ పరిరక్షణ, సూర్యలంక బీచ్, సఫారీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని ఏపి గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ కొణిదల నాగేంద్రరావు(నాగబాబు) తెలిపారు.
సూర్యలంక అటవీశాఖ నగర వనంలో చైర్మన్ నాగేంద్రరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ చలపతిరావు, బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ కలిసి గురువారం మొక్కలు నాటారు. ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన తిలకించారు. తీర ప్రాంతంలో సహజ వనరులపై అవగాహన కల్పిస్తూ నివేదిక సమర్పించారు. అనంతరం సూర్యలంక నగర వనం నుంచి పొగురు దిబ్బ వరకు బోటులో ప్రయాణించారు. బోటులో వెళ్తూ మడ అడవులను ఆయన తిలకించారు. పొగురు దిబ్బ వద్ద తాటి విత్తనాలు నాటారు. విద్యార్థులను దగ్గరకు చేర్చుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నాగబాబుతో ఆసక్తిగా ఫోటోలు తీయించుకున్నారు.
గ్రీన్ వాల్, గ్రీన్ బెల్ట్ నిర్మాణ పనులు పరిశీలించడానికే బాపట్లకు వచ్చానని ఏపి గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ కొణిదల నాగేంద్రరావు(నాగబాబు) తెలిపారు. తీర ప్రాంతాలలో బీచ్ ల అభివృద్ధి, మడ అడవుల అభివృద్ధి కొరకు ప్రభుత్వం ప్రణాళికతో పనిచేస్తుందన్నారు. తీర ప్రాంతాలలో అడవులు అభివృద్ధి చెందితే వరదలు, సునామి లాంటి విపత్తుల నుంచి తాటి చెట్లు, మడ అడవులు, జీడి మామిడి చెట్లు ప్రజలకు సంరక్షణగా నిలుస్తాయన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. ఇక్కడ పక్షులు ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఆలివ్ తాబేలు ఉత్పత్తి కేంద్రాలు బాపట్ల జిల్లాలో జయప్రదంగా నిర్వహించడాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మనకు అందుబాటులో ఉన్న వనరులను సమకూర్చుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. తద్వారా జంతువుల నివాసానికి ఇలాంటి ప్రాంతాలు ఉపకరిస్తాయన్నారు. జంతువుల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సఫారీ అభివృద్ధికి ప్రణాళికలో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సూర్యలంక బీచ్ అభివృద్ధితో తీర ప్రాంతాలలో వన సంరక్షణకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మరింత అభివృద్ధికి సాధ్యాసాధ్యాలపై క్షేత్ర పరిశీలన చాలా ముఖ్యమైన గుర్తించి పర్యటిస్తున్నామన్నారు. ఎన్నో వనరులు ఉన్న ప్రాంతంగా బాపట్ల జిల్లాను గుర్తించామన్నారు. భవిష్యత్తులో బాపట్ల జిల్లా పర్యాటక ప్రాంతంగాను, పర్యావరణ పరిరక్షణ తీర ప్రాంతంగానూ అభివృద్ధి చెందుతుందని తెలిపారు.పర్యావరణ పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి,తెలిపారు. సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను ఏపి గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ కొణిదల నాగేంద్రరావు(నాగబాబు), ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ చలపతిరావు కు వివరించారు. అభివృద్ధిపై నివేదిక అందజేశారు. విద్యార్థులతో మొక్కలు నాటడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఏ.హరి కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారిని సౌజన్య జాస్తి, అటవీ శాఖ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!