విశాఖపట్నం, ఆగస్టు 31,రాజధాని వాయిస్:
రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా పాలసీని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించిందని, పాలసీ త్వరలోనే అమల్లోకి రానుందని మంత్రి వెల్లడించారు.
ఇటీవల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా విశాఖ జర్నలిస్టు ఫోరం ప్రెస్‌క్లబ్‌కు విచ్చేసిన మంత్రి కొలుసు పార్థసారథిని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై మంత్రితో చర్చించారు. ఇందుకు సంబంధించి మంత్రికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు..ముఖ్యంగా ప్రమాద బీమా పాలసీ పునరుద్ధరణతో పాటు జర్నలిస్టులకు నివాస స్థలాల కేటాయింపు అంశాలను ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన మంత్రి పార్థసారథి తాజాగా మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితమే జర్నలిస్టుల ప్రమాద బీమా పాలసీ పునరుద్ధరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతి లభించిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల మంది అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు ఈ పథకం ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
ప్రమాద బీమా పాలసీ పరిధిలో ఉన్న జర్నలిస్టు ప్రమాదవశాత్తూ మృతి చెందితే, కుటుంబానికి 10 లక్షల ఆర్థిక పరిహారం అందుతుందని మంత్రి వివరించారు. జర్నలిస్టులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గతంలో జర్నలిస్టుల ప్రమాద బీమా పాలసీని అప్పటి ప్రభుత్వము పట్టించుకోకపోవడంతో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి గుర్తు చేశారు. అర్హత కలిగిన జర్నలిస్టులకు నివాస స్థలాలు మంజూరు చేసేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
*జర్నలిస్టులకు ఎంతో ఉపయోగకరం*
జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రమాద బీమా పాలసీని పునరుద్ధరించేందుకు చొరవ చూపిన మంత్రి కొలుసు పార్థసారథికి గంట్ల శ్రీనుబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పాలసీ జర్నలిస్టులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
గతంలో విశాఖకు చెందిన ప్రజాశక్తి రిపోర్టర్ వల్లీ ఎలమంచిలి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సమయంలో, ఆయన కుటుంబానికి ప్రమాద బీమా పరిహారం అందేలా తాము కృషి చేశామని గంట్ల శ్రీనుబాబు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా పాలసీలు కొంతవరకు భరోసా కల్పిస్తాయని అన్నారు. జర్నలిస్టులందరూ ఈ పాలసీని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. నారాయణ, జి. శ్రీనివాసరావు, బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు, కింతాడ మదన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జగన్మోహన్, కే. శ్రీనివాసరావుతో పాటు పలువురు జర్నలిస్టులు మంత్రి కొలుసు పార్థసారథికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
0 Comments