ఒంగోలు: ఆగస్టు 28 రాజధాని వాయిస్ :
సమాజానికి విశిష్ట సేవలందించిన మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఒంగోలు నగరంలోని కిమ్స్ ఆసుపత్రి ఫ్లై ఓవర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన 20 మంది ప్రముఖుల విగ్రహాలను, అలాగే జిల్లా సంస్కృతికి ప్రతీకగా నిలిచే ‘ఒంగోలు గిత్త’ విగ్రహాన్ని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి లోకేష్ మాట్లాడుతూ, వివిధ రంగాల్లో సేవలందించిన మహనీయులను నిత్యం స్మరించుకునేలా, వారి జీవితాలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలిచేలా ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒంగోలు జాతి పశుసంపద విశిష్టతను చాటేలా ఏర్పాటు చేసిన ఒంగోలు గిత్త ప్రతిమ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ ప్రాంగణంలో క్విట్ ఇండియా ఉద్యమకారులు రొండా నారపరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు దర్శి చెంచయ్య, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మాదాల నారాయణ స్వామి (MNS), ప్రముఖ పాత్రికేయులు నీలంరాజు వెంకట శేషయ్య, ప్రకాశం జిల్లా తొలి కలెక్టర్ కత్తి చంద్రయ్య, ఒంగోలు తొలి మున్సిపల్ చైర్మన్ వరదా శ్రీరాముల నాయుడు, పేదల వైద్యులు ‘పావలా డాక్టర్’ బి.వి.ఎల్. నారాయణ, సామాజిక సేవకులు క్లౌ జాన్ ఎవరెట్, మహాదాత గోరంట్ల వెంకన్న, ద్రావిడ భాషాశాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి విగ్రహాలను ఆవిష్కరించారు.
వీరితో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి రామకృష్ణ, ప్రముఖ నటి గరికపాటి వరలక్ష్మి, సినీ దర్శకులు టి. కృష్ణ, నాదస్వర విద్వాంసులు పద్మశ్రీ షేక్ చినమౌలానా, నాట్యావధాని ధారా రామనాథ శాస్త్రి, కవి నాగభైరవ కోటేశ్వరరావు, దళిత విప్లవ కవి కలేకూరి ప్రసాద్, కళాకారుడు పైడి తెరేష్ బాబు, సాహితీవేత్త మల్లవరపు జాన్, నాటక సమాజ నిర్వాహకులు బండారు రామారావు విగ్రహాలను కూడా లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆనం రాంనారాయణ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్ రావు, ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
0 Comments