Wednesday, 26 August 2026
Telugu Daily
Header
BREAKING

ఏడుగురు మత్స్యకారులు క్షేమం..

Story Highlights
  • పశ్చిమ బెంగాల్‌లో ఏడుగురూ సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారణ
  • బోటు ఎలా తప్పిపోయింది? ఏ మార్గంలో వెళ్లింది? అన్ని కోణాల్లో పరిశీలన
  • మత్స్యకారులు క్షేమంగా ఉన్నారన్న శుభవార్తతో కుటుంబాల్లో ఊరట
  • మత్స్యకారుల భద్రతకు ముఖ్యమంత్రి చంద్రబాబు అ
అమరావతి. ఆగస్టు 26  రాజధాని వాయిస్ :  కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయిన ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్‌లో సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారణ కావడం పట్ల వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. మత్స్యకారులు క్షేమంగా ఉన్నారన్న శుభవార్తతో వారి కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారని, వారిని త్వరగా స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ఈ నెల 3న ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి ఏడుగురు మత్స్యకారులు బోటులో సముద్ర వేటకు వెళ్లారని మంత్రి తెలిపారు. నిర్ణీత సమయంలో బోటు తిరిగి రాకపోవడంతో సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా స్పందించి, మత్స్యకారుల ఆచూకీ కోసం ఎలాంటి ఆలస్యం చేయకుండా అన్ని విధాలుగా గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారని చెప్పారు. మత్స్యకారుల భద్రత విషయంలో ముఖ్యమంత్రి చూపిన ప్రత్యేక చొరవ, శ్రద్ధ అభినందనీయమని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటూ, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని, నేవీ, కోస్ట్‌గార్డ్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ఆదేశించారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తాను కూడా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ కేంద్ర అధికారులు, నేవీ, కోస్ట్‌గార్డ్ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడినట్లు మంత్రి వెల్లడించారు.

మత్స్యకారుల ఆచూకీ కోసం సముద్రం, గగనతలం నుంచి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు, బోటు ఎలా తప్పిపోయింది, ఏ మార్గంలో ప్రయాణించి ఉండవచ్చు, ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉండే అవకాశం ఉందన్న అంశాలపై అన్ని కోణాల్లో పరిశీలన జరిపామని మంత్రి తెలిపారు. బోటులో సాంకేతిక సమస్య తలెత్తి ఉండే అవకాశం సహా ప్రతి అంశాన్ని నేవీ, కోస్ట్‌గార్డ్ అధికారులతో సమన్వయంతో పరిశీలించామని చెప్పారు. గాలి దిశ, వేగం, సముద్ర ప్రవాహాలు, బోటు డ్రిఫ్ట్ అయ్యే అవకాశం వంటి అంశాలను కూడా శాస్త్రీయంగా విశ్లేషించి, బోటు పశ్చిమ బెంగాల్ తీరం వైపు వెళ్లి ఉండవచ్చన్న అంచనాతో ఆ ప్రాంతంలోని కోస్ట్‌గార్డ్ యూనిట్లు, స్థానిక మత్స్యకారులను అప్రమత్తం చేశామని మంత్రి తెలిపారు. ఈ సమన్వయ కృషి ఫలితంగానే శంకర్‌పూర్ ఫిషింగ్ హార్బర్ సమీపంలో బోటును గుర్తించి, అందులోని ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా రక్షించగలిగామని చెప్పారు. బోటు యజమాని సోదరుడు భవానీ ప్రసాద్‌తో మాట్లాడి ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్‌లో క్షేమంగా ఉన్న విషయాన్ని నిర్ధారించుకున్నామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగా ఉన్నారని, వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించామని చెప్పారు. మత్స్యకారులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు మత్స్యశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు.

ఈ గాలింపు చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం, ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్, AP RTGS, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేశాయని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్‌, మత్స్యశాఖ కమిషనర్‌, జాయింట్ డైరెక్టర్‌, అల్లవరం FDOతో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది చేసిన కృషిని మంత్రి అభినందించారు. మత్స్యకారుల భద్రత విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపిన ప్రత్యేక శ్రద్ధకు ధన్యవాదాలు. మత్స్యకారుల ఆచూకీ కోసం మొదటి నుంచి చివరి వరకు ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించింది. ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారనే శుభవార్త రావడం ఎంతో సంతోషంగా ఉంది అని మంత్రి అన్నారు. మత్స్యకారుల భద్రత, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. మత్స్యకారులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
Share this Article:

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!