Wednesday, 26 August 2026
Telugu Daily
Header
BREAKING

ఉపాధ్యాయుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి

మాచర్ల.ఆగస్టు 26

రాజధాని వాయిస్ :

పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మాచర్ల పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలుప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది నిరసన ర్యాలీ నిర్వహించారు. రింగ్‌రోడ్డులోని సెయింట్‌ జేవియర్‌ స్కూల్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇటీవల చోటుచేసుకున్న పాఠశాల సంబంధిత ఘటనలు ఉపాధ్యాయులు, విద్యార్థుల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. నల్గొండ జిల్లా మల్లేపల్లిలో ప్రిన్సిపాల్‌ రూపారెడ్డి హత్య ఘటన, విశాఖపట్నంలో ఎల్‌కేజీ విద్యార్థి మృతి ఘటనలను ప్రస్తావిస్తూ పాఠశాలల్లో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులకు రక్షణ కల్పించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ర్యాలీ అనంతరం మాచర్ల మండల రెవెన్యూ అధికారి బి. కిరణ్‌కుమార్‌కు మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించడంతో పాటు ఉపాధ్యాయుల భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల ప్రవర్తనపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం దృష్టి సారించాలని కోరారు.ఎంఈఓ కోటేశ్వరరావు మాట్లాడుతూ,విద్యార్థులను క్రమశిక్షణతో తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. విద్యార్థుల ప్రవర్తనలో వచ్చే మార్పులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించి, సమస్యలను ప్రారంభ దశలోనే పరిష్కరించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ శేషిరెడ్డి మాట్లాడుతూ,విద్యార్థుల రవాణా విషయంలో పాఠశాల యాజమాన్యాలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. పాఠశాల బస్సుల ఫిట్‌నెస్‌, డ్రైవర్ల అర్హత, వాహనాల భద్రతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదన్నారు. పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇటీవల జరుగుతున్న ఘటనలతో ఉపాధ్యాయుల్లో భయాందోళనలు నెలకొన్నాయని తెలిపారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులకు రక్షణ కల్పించేలా ప్రత్యేక చట్టం తీసుకురావడంతో పాటు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల ప్రవర్తన, స్నేహితుల పరిచయాలు, సోషల్‌ మీడియా ప్రభావంపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.మాచర్ల పట్టణంలో 48 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయని, వాటిలో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన వాతావరణం కల్పించడం పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో డి. జయరాం, కె. శ్రీనివాసరావు, APUSHMA అధ్యక్షుడు కె.వి. రమణ, నరసింహ, ఎన్. శ్రీనివాస్‌, జైస్వాల్‌ శాస్త్రి, బి. వెంకటరెడ్డి, ఎస్‌.కె. జాని, మండాది రాజు, హారిక, దుర్గా శ్రీనివాస్‌, చైతన్య ప్రిన్సిపల్‌, KTS హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Share this Article:

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!