రాజధాని వాయిస్ సాహిత్యం
సాహిత్యం ప్రత్యేకం
వర్తమాన సమాజంలో ప్రబలుతున్న అన్యాయం, అవినీతి, కులతత్వ చీకట్ల పట్ల చిత్తసంస్కారం కలిగిన కవిగా, సామాజిక వాస్తవాల చిత్రకారునిగా తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చిన కవి రావెల జోసెఫ్. సామాజిక వ్యత్యాసాలను ఎత్తిచూపుతూ, కులమత మౌడ్యాలను నిరసిస్తూ మనిషి అభ్యుదయానికి అడ్డంకులుగా ఉన్న అన్ని అంశాలను ప్రశ్నించిన కవి, శతక కర్త, రచయిత మరియు క్రైస్తవ వేదాంత బోధకులు ఆచార్య రావెల జోసఫ్ కవి.
*బాల్యం- జీవితం*
రావెల జోసెఫ్ సెప్టెంబర్ ఒకటి 1937 గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామంలో రెవరెండ్ పాల్ మరియు సంతోషమ్మలకు 5వ సంతానం జన్మించారు. వీరి తండ్రి సంఘ కాపరిగా పనిచేయడం వల్ల బాల్యం నుండే క్రీస్తు బోధలను వింటూ, ఆచరిస్తూ జీవించారు. వీరు ఉపాధ్యాయ శిక్షణ విద్యను అభ్యసించి పల్నాడు ప్రాంతంలో ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. సుశీలమ్మను వివాహం చేసుకొని ఐదుగురు నలుగురు కుమారులు, ఒక కుమార్తెను సంతానంగా పొందారు.1967లో B.D. పట్టభద్రులై రామయపట్టణంలోని బాప్టిస్ట్ వేదాంత కళాశాలలో అధ్యాపకులుగా నియమించబడ్డారు.1973లో అమెరికాలో STM డిగ్రీ, 1980లో UTC నుండిM.Th పట్టాను పొంది, 1987లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేశారు.
వీరు రామయపట్నంలో ఆరు సంవత్సరాలు బోధించి హైదరాబాదులోని (ఏ సి టి సి) ఆంధ్ర క్రైస్తవ దైవ జ్ఞాన కళాశాలలో అధ్యాపకులుగాను, 1976- 78లో డీన్ ఆఫ్ ది బాప్టిస్ట్ హాల్ గా వ్యవహరించారు. వివిధ క్రైస్తవ కళాశాలల్లో ఉన్నతమైన సేవలు అందించారు. వీరి క్రైస్తవ భక్తి గీతాలు, దేశభక్తి గీతాలు రేడియో మరియు దూరదర్శన్ లో ప్రసారమయ్యాయి. తెలుగు క్రైస్తవ సాహిత్యానికి, కీర్తనలకు వీరు చేసిన కృషికి కేంద్ర సాహిత్య అకాడమీ గుర్తింపు లభించింది. 1977 సెప్టెంబర్ లో మీరు షష్టిపూర్తి సందర్భంగా "క్రైస్తవ సాహితీ విహారము" వారు వీరికి క్రైస్తవ కళా ప్రపూర్ణ బిరుదు ఇచ్చి సత్కరించారు. వీరి సాహిత్య, సంగీత సేవలకు గుర్తింపుగా *కళా రాజ్యం* వారు 2007 ఫిబ్రవరి 13న రవీంద్ర భారతిలో ఘనంగా సత్కరించారు.
*రచనలు*
వీరు అభ్యుదయం, ఆకాంక్ష, ప్రగతి కోసం అను గేయ, వచన కవితా సంపుటాలను మరియు నీతి సుధల శతకము అను ద్వి శతకాన్ని రచించారు. ఆరని జ్యోతి, ఆదిమ క్రైస్తవ సంఘ చరిత్ర, తెలుగు బాప్టిస్ట్ సంఘముల చరిత్ర, పురుషోత్తమ చౌదరి భక్తి వేదాంతం, క్రైస్తవ భక్తి గీతాలు, విశ్వశాంతి, తెలుగు సాహిత్య గ్రంథమాల, సంఘ జ్యోతులు, 16వ శతాబ్దపు క్రైస్తవ సంఘసంస్కరణం, క్రీస్తు జనన నాటకము, క్రీస్తు శ్రమలు అను తెలుగు రచనలతో పాటు,Anabaptist, Evangelism and theology, India, Bhakti theology of purushothama Chowdhary అను ఆంగ్ల గ్రంధాలను రచించారు. అనేక జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో వ్యాసాలను రచించారు.
*అభ్యుదయం*
సామాజిక పరివర్తనను ఆశించి 1981లో అభ్యుదయం అను గేయ, వచన కవితా సంపుటిని రచించారు. ఆచార్య కొలకలూరి ఇనాక్ ఉన్న మాట పేరుతోనూ, బి ఏ ప్రతాప్ కుమార్ చిన్న మాట పేరుతో ముందు మాటలు రాశారు. శుభసందేశ ప్రచురణలు వారు ఈ కవితా సంపుటిని ప్రచురించారు.
" ఎదుటివాడ్ని వేధించడం
పొరుగు వాడ్ని బాధించడం
పగవాడి పరువు దీయడం
ఇకనైనా మానేద్దాం" అని యికనైనా అను కవితలో క్రైస్తవ సమాజంలో అక్కడక్కడ కనిపించే ద్వేష, అసూయలను ఎత్తిచూపారు. ఇది కేవలం క్రైస్తవ సమాజానికి మాత్రమే కాదు సమస్త మానవాళికి వర్తిస్తుంది.
ఒక్కొక్క పద్దెo గద్దెల నెదిరింప
ఒక్కొక్క గీతం ఎదలను కదిలింప
ఒక్కొక్క కావ్యం కథనాన్ని నడుప
ఒక్కొక్క గేయం గాయాన్ని మాన్ప సాగించాలి సాహితీ విహారాన్ని నేడు, విహరించాలి సాహితీ సదనంలో నీవు అని ఎందుకు రాయాలి అను కవితలో సమాజంలో మార్పు కోసం కవి సాహిత్యాన్ని రాయాలని తెలిపారు. ధనాశ పిశాచిగా మారింది, హుండీలు గుండాలుగా మారాయి అని ధనాపేక్షతో హుండీలను సృష్టించి చందాల పేరుతో పేదలను దోచుకునే వారిని ప్రశ్నించారు జోసఫ్ కవి.
*ఆకాంక్ష*
కులతత్వాన్ని నిర్మూలించాలంటే ప్రేమ, కరుణలు మాత్రమే ఆయుధాలని, ప్రేమను ఔషధంగా ఉపయోగించి రాచపుండు లాంటి వర్ణ వ్యవస్థను మార్చాలని ఆకాంక్షించి మనిషిలో మానవతా దృక్పథాన్ని, ప్రేమ తత్వాన్ని బోధించి ఆకాంక్ష అను వచన కవితా సంపుటిని 1997లో రచించి వారి అర్ధాంగి సుశీలమ్మకు అంకితమిచ్చారు జోసఫ్ కవి.
ఒక నాణానికి బొమ్మ మరియు బొరుసు ఉన్నట్లే జీవితం ఒకవైపు ఆధ్యాత్మిక చింతన తోను సామాజిక బాధ్యతతో ముడిపడి సాగింది. సామాజిక దృక్పథంతో వచన రచన చేయుటకు వీరిపై సి.నారాయణరెడ్డి ప్రభావం ఉందని, వారి చేతుల మీదుగా ఆకాంక్ష గ్రంథం ఆవిష్కరించబడిందని, ఆచార్య ఎన్ గోపి సభాధ్యక్షుత వహింపగా డాక్టర్ ఎండ్లూరి సుధాకర్, మున్నంగి క్రీస్తు దాసు వంటి వారు పుస్తక పరిచయం చేశారని, సాధన నరసింహాచార్య ముందుమాట రాశారని, జోసఫ్ దంపతుల షష్టిపూర్తి సమయంలో ఘనంగా ఆకాంక్ష ఆవిష్కరించబడిందని తన మాటలో తెలియజేశారు.
కవి, కర్షకుడు సమాజానికి రెండు కళ్ళు అని, నవ్య సమాజ ప్రగతికి, సమసమాజ నిర్మాణానికి ఇరువురు అవసరమని తెలుపుతూ
“బండ గుండెల్ని బద్దలు గొట్టి, పదును చేస్తుంది కవి అక్షరం
బండ భూముల్ని పగులగొట్టి చదును చేస్తుంది రైతు పనితనం “అని ఉభయ కవి మిత్రులు అను కవితా శీర్షికలో తెలియజేశారు. పూలమాలలో వివిధ రకాల పూలు చక్కగా ఇమిడిపోతాయి కానీ మనుషుల్లో ఈ ఐక్యత లేదని పుష్ప వికాసం అను కవితా శీర్షికలో
“లేదు మా జాతికి మీ తీరు, రాదు నరజాతికి మీ పేరు
మాలలో మీరుండు తీరు, మాకుంటే మాకెంతో పేరు” అని సమస్త మానవాళి కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా ఐక్యతగా ఉండాలని జోసఫ్ కవి ఆకాంక్షించారు. భారతదేశంలో పుట్టి పెరిగి విదేశాలకు వెళ్లి స్థిరపడిన ప్రవాస భారతీయులు స్వదేశం కోసం పాటుపడాలని, జన్మనిచ్చిన తల్లిని మరువరాదని హితవు పలికారు. సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నించేలా కవి తన గళాన్ని విప్పాలని కవులకు పిలుపునిచ్చారు. అస్పృశ్యత మరియు అంటరానితనానికి గురవుతున్న దళితులకు మరియు మహిళలకు అభ్యుదయ గీతాన్ని వినిపించాలని “ఎందుకీ సన్మానం” అను కవిత లో కవికి కర్తవ్య బోధ చేశారు.
“అతనిలోని అస్పృశ్యతా పుండు పగలాలని
కులమనే చీము కారిపోవాలని,
ప్రేమ మందుతో పుండు మానాలని,
పరిశుద్ధ మనిషిగ అతడు మారాలని” అంటరాని మంట అను కవితలో తాను చిన్నప్పుడు ఎదుర్కొన్న వివక్షతను తెలుపుతూ సమాజంలోని కుల దురహంకారాన్ని తూర్పుర పట్టారు జోసఫ్ కవి. తన తండ్రి పేరు తెలుసుకున్న తర్వాత అగ్రకులానికి చెందిన వ్యక్తిలో రేగిన కుల దురహంకారానికి తనలో ఆవేదన, ఆక్రోషాలు పెళ్లు బిక్కాయని వాటిని చల్లార్చుకుని అతనిలో పరివర్తన రావాలని, ప్రేమను అతనిపై సంధించానని స్వానుభవాన్ని పంచుకున్నారు కవి.
50 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మనిషిని మనిషిగా చూడడం మరిచారని, మానవత్వాన్ని మంటగలిపారని, అధికారం, ధన దాహం మరియు హోదా పట్ల ఆకాంక్ష పెరిగిందని, పార్టీ ఫిరాయింపులు, మత కలహాలు పెరిగాయని నీతిలేని నాయకులను చూసి భరతమాత కన్నీరు మున్నీరుగా విలపిస్తుందని నేటి భారతీయ సమాజ దుస్థితిని “భారతాశ్రువులు" అను కవితలో ఎత్తి చూపారు.
“కులమనే నిచ్చెన, నేలమట్టమైనప్పుడు
కులమనే “కాలం” తొలగించబడినప్పుడు
ఆశించిన సమతను అందుకోగలుగుతాం
స్వేచ్ఛాయుత జీవితం తిరిగి చిగురిస్తుంది
సమత, సౌబ్రాతృత్వం సంతరించుకుంటుంది” అని కులం నిచ్చెన కూలితే! అను కవితలో భారతదేశంలోని నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను నిరసించారు జోసఫ్ కవి. పైకి శాంతిని కోరుతూ మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని, దళారీల మోసాన్ని రాజకీయాలలోని కల్మషాన్ని కడిగి వేయాలని, తద్వారా ఈ సమాజం బాగుపడాలని కవి కాంక్షించారు. భూమిని దుక్కి దున్ని తమ చెమటతో సేద్యం చేసే కార్మిక కర్షకుల కష్టాన్ని కర్షకా! లెమ్ము రా!! కవితలో ఆవిష్కరించారు. పట్టణాలలో అసంఘటిత భవన నిర్మాణ కూలీలు ఎదుర్కొనే శ్రమదోపిడిని సౌధ సమాధులు అను కవిత లో వివరించారు. పనిచేస్తేనే ప్రగతి అని, అదే సమాజానికి పురోగతి అని శ్రమైక గీతాన్ని పాడారు.
ఆకాంక్ష అను కవితలో కుల తత్వాన్ని, మతమౌడ్యాన్ని ప్రదర్శించే వారిని శిక్షించే తత్వాన్ని కాకుండా వారిలో పరివర్తనను ఆకాంక్షించారు జోసఫ్ కవి. కుటిల స్వభావాన్ని చూపే వారిని కాల్చి చంపే వారిలా కాకుండా, పతనమైపోతున్న మానవాళిని మేలుకొలిపే చిన్న కాంతి కిరణం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు కవి తెలిపారు. భూతాలతో నిండిన ప్రకృతికి ఇచ్చే తత్వమే ఉందని, వెలుగు, చీకటి, ఫలము మరియు ఫలితములు అందరికీ సమానంగా ఇస్తుందని ప్రకృతి ప్రవృత్తిని ఆవిష్కరించారు కవి.
“కళ్ళు లేవు స్వార్థానికి, దీని కాళ్ల క్రింద పడి
నలిగి కన్నీరు కార్చే, నిస్వార్ధాన్ని చూడటానికి” అని చారిత్రక సత్యం అను కవితలో స్వార్థానికి అవధులు లేవని, స్వార్థపరుల ఆలోచనలు మరియు ఆశలు అనంతాలని, తనకు చాలినంత కంటే మించి కోట్లకు కోట్లు కావాలని, కోట్లకు పడగెత్తాలని ఆకాంక్షిస్తారని, న్యాయబద్ధులను తొక్కి అన్యాయంగా ఎదుగుతుంటారని స్వార్థపరుల స్వభావాన్ని ఆవిష్కరించారు కవి. ధర్మంపై అధర్మం ఎగిరెగిరిపడినా ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని, అధర్మం స్మశానంలో కపెట్టబడుతుందని, మేకపోతు గాంభీర్యం ఎంత ప్రదర్శించినా ధర్మమే గెలుస్తుందని కవి తెలిపారు. మద్యపానం ఒక దుర్వ్యసనమని, అది ఇంటిని ఒంటిని నాశనం చేస్తుందని, పరపతిని పోగోడుతుందని, ఆస్తిపాస్తులు హరించుకుపోతాయని, బంధువులు దూరమౌతారని, ఇన్ని నష్టాలు జరిగినా అజ్ఞానంతో మద్యాన్ని వదలరని *మధుపానాందుడు* అను కవితలో మద్యానికి బానిసలయిన వారిలో పరివర్తనను ఆకాంక్షించారు కవి.
"రాజకీయ స్నేహం, మిస్టరీ ఓ నేస్తం!
పంపకాలలో తేడా వస్తే, తారస్థాయిలో
తగవులు మళ్లీమళ్లీ విరోధం” అని రాజకీయ నాయకుల్లో తాత్కాలిక స్నేహాన్ని ఎడతెరిపిలేని వైరుధ్యాన్ని బట్ట బయలు చేశారు కవి.
కులమనే కొలిమిని ఆర్పే సీసాలు, కుల కట్టడాలను కూల్చే కందాలు, పేద హృదయం నుండి ప్రేలే వృత్తాలు, పొగరు తగరుల కొమ్ము విరచే గీతాలు, మత్తెక్కిన మనుషుల నెత్తుల మొత్తే, మతిలేని మ్లేచ్ఛుల మలిచే మత్తేభాలు వ్రాసి సాగించండి సాహితీ సమరం. నడిపించండి సాహిత్య కథనం అని సాహితీ సమరం అను కవితలో కవులకు కర్తవ్య బోధ చేశారు.
*నీతి సుధల శతకం*
బైబిల్ గ్రంధంలోని అంశాలను గ్రహించి, తన వ్యక్తిగత అనుభవాలను రంగరించి ఆటవెలది చందస్సులో జోసఫ్ కవి రచించిన శతకం నీతి సుధల శతకం. విభుడు యేసు నందు విన్నవింతు అను మకుటంతో 232 పద్యాలతో రచించబడింది. ఆంధ్ర క్రైస్తవ వేదాంత సాహితీ సమితి అధ్యక్షులు జెట్టి ఆలీవర్, డాక్టర్ ఎన్ గోపి, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, డాక్టర్ శిఖామణి మరియు డాక్టర్ కొండే పోగు బి లివింగ్స్టన్ వంటివారు ఈ శతకానికి ముందు మాట రాశారు. పద్యాల పద పొందికకు జోసఫ్ కవి అర్ధాంగి సుశీలమ్మ సహాయం చేసినట్లు తన మాటలో తెలిపారు.
సంస్తుతి పేరుతో యెహోవా దేవునిణ్ణి మరియు ఏసుక్రీస్తును పద్య స్తుతి చేశారు.
భూమి, ఆకాశం, గాలి, నీరు మరియు వెలుగులను సృష్టించి సకల సంపదలను అందించి, విలువలను బోధించిన క్రీస్తు ప్రభువు లేమిని పోగోడతారని, క్రీస్తు రాకకై నిరీక్షించాలని, ఆయన దుఃఖపడువారిని ఓదార్చుతాడని, నీతి కొరకు హింసింపబడిన వారికి పరలోక రాజ్యమిస్తాడని, సాత్వికులను భూలోకంలో ఉన్నతులుగా ఉంచుతాడని, నీతిమంతుల కోర్కెలను తీర్చుతాడని, నీతి కొరకు హింస పొందే వారికి పరలోక రాజ్యం ఇస్తాడని, హృదయ శుద్ధి కలిగి క్రీస్తు బాటలో నడుచు వారు దేవుణ్ణి చూస్తారని జోసఫ్ కవి తెలిపారు.
“పొరుగు కంటి నున్న పొట్టి నలుసు జూడ
కుండ నీదు కంటి నిండ నున్న
దూల మెరిగి పెరికి దూరపర్చుకొనుము” అని ఎదుటి వానిలో చిన్నచిన్న తప్పులను ఎత్తి చూపే ముందు మన తప్పులను గమనించాలని తెలిపారు కవి. బండ మీద కట్టబడిన ఇల్లు గాలి వానలకు చెదరదని, ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోతుందని, కోపదారి మనిషి కోరి కష్టాలు తెచ్చుకుంటాడని, శాంత స్వభావులు సంతోషంగా ఉంటారని, వారు శాంతిని కోరుకుంటారని, పేదలకు సహాయం చేయు వారిని దేవుడు కరుణిస్తాడని పలికారు కవి.
పెద్దల పట్ల పిల్లలు గౌరవ భావాన్ని కలిగి ఉండాలని అలాగే పిల్లలను పెద్దలు తక్కువగా హీనంగా చూడరాదని
“చిన్న వారి యెడల చిన్న చూపు వలదు
చిట్టి చీమ చంపు నెట్టి పెద్ద
పాము నైన తోటి చీమల పొందుతో” అని పలుకుతూ ఎంతో చిన్న జంతువైనా ఎలుకల సమూహం కొండను తొలిచి కొంగ దీస్తాయని, చేతి వేళ్ళన్నీ కలిస్తేనే పని జరుగుతుందని, చిన్న లోపం ఉన్న ఆ పని సఫలం కాదని, ఒక కన్ను పోతే కొంత బాధ కలుగుతుందని, అదే ఆత్మ నేత్రం పోగొట్టుకుంటే మనిషి జీవితం వ్యర్థమని జోసెఫ్ కవి తెలిపారు.
జ్ఞానవంతుడు దైవ బలం కలిగి ఎప్పుడూ కొండవలె దృఢంగా ఉంటాడని, నీతిమంతులు నిర్మలమైన ఆకాశం వలె ఉంటారని, దేవుని ఆజ్ఞలు పాటించు వారు హెచ్చించబడతారని, గర్విష్టులు అణచివేయబడతారని, నీతి మంతుడు ఎప్పుడు శత్రువులకు సైతం సహాయపడతాడని, నీతి మార్గంలో నిలకడగా ఉన్న వారిని దేవుడు హెచ్చిస్తాడని, నీతిపరుని జీవితం నిలకడగా ఉంటుందని, చెడుతలంపు గల వారి జీవితం దుర్భరంగా ఉంటుందని, యదార్ధవంతులు దైవ ప్రతినిధులుగా ఉంటారని జోసఫ్ కవి ఈ శతకంలో తెలియజేశారు.
“బుధులు చెప్పు మాట బుద్ధిమంతుడు విను
దాని తోసి వేయ దానవుండు
బుద్ధి బలం చేత పొందలేనిది లేదు" అని క్షమా, శాంత గుణాలు కలిగినవారు భూలోకంలో ధన్యులని, వారు దేవుని కరుణను పొందుతారని, దేవుని నమ్మి ఆయనపై భారం వేసి నడుచుకొనువారు దేవుని వరములు పొందుతారని, తన శాయశక్తుల ఇతరులకు మేలు చేయువారు రెట్టింపు ఆశీస్సులు పొందుతారని, తనను తాను తగ్గించుకోను వారు హెచ్చించబడతారని, ధర్మం తెలిసి మసలు కొనువారు భూమిపై మకుటంగా ఉంటారని, మనిషి సత్ప్రవర్తనతో మంచి క్రియలను చేయాలని, చెడ్డ పనులు చేస్తే దుర్గతి సిద్ధిస్తుందని కవి పలికారు.
“ఎద్దు అరకదున్ను ప్రొద్దు నెరుగకుండ
సుకవి మతులు జదువు సుహితముగను
పంట గూర్చు నెద్దు ప్రగతిని పంచును కవి” అని ఎద్దు నిరంతరం పొలాన్ని దుక్కి దున్నుతుందని, కవి సమాజ ప్రగతి కోసం నిరంతరం సాహిత్య సేద్యం చేస్తాడని తెలిపారు. సంఘంలో పెద్ద మనిషిగా వ్యవహరించే వ్యక్తి స్వార్థంతో ఆస్తిని కూడబెట్టి ఎవరికి సహాయం చేయడని, అట్టివారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని, మోసం చేసి ఎదిగేవాడు చెరపాలవుతాడని, జనుల మధ్య జగడాలు పెట్టేవాడిని గురించి జాగ్రత్త వహించాలని, కొండెములు చెప్పు వాని మాటలు రుచికరంగా ఉంటాయని అట్టివారిని దరిచేరనీయరాదని, అధిక ధనము అగచాట్లను కలిగిస్తుందని, సరిపడిన ధనం ఉంటే సంతోషం కలుగుతుందని, ఆడంబరాలకు పోయి అప్పు చేయరాదని, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవల వల్ల తల్లిదండ్రులకు క్షోభ తప్ప మరే ఫలితం ఉండదని కవి తెలిపారు.
“తల్లి దండ్రుల నిల దరిమివేయు కొడుకు
తెగులు గొట్టివాడు తగలబడును
కారు చీకటందు కడగండ్ల పాలగు” అని తెలుపుతూ ప్రేమ కలిగిన తండ్రి కుమారుని సత్ప్రవర్తనకై బెత్తం వాడతాడని, అట్టి కుమారుని జీవితం చక్కబడుతుందని బుద్ధిగా ప్రవర్తించు కుమారుడు తండ్రికి మకుటంగా ఉంటాడని, వినయ విధేయత తో మెలిగే కుమారుడు తండ్రికి ఘనత తెస్తాడని, తల్లిదండ్రులను దూషించి ఇబ్బందులు పెట్టు వారి జీవితం అంధకారమయమౌతుందని, బాలునిగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు బిడ్డలను సరిచేయాలని పెద్దవారైనను వారు సన్మార్గంలో నడుస్తారని, గోరుముద్దలు పెట్టి తల్లి పిల్లల్ని పెద్ద చేస్తుందని, చిన్నచిన్న కథలు చెప్పి ప్రేమగా పెంచుతుందని, పిల్లల ఆకలి తెలుసుకొని తల్లి ఆకలి తీర్చుతోందని తల్లి ప్రేమను వర్ణించారు కవి.
“పరుల బూడ్చ నొకడు పాతర తవ్వగా
పరులు బడరు యందు బడును వాడె
పాప ఫలిత మిదియె పరికించి జూడంగా" అని ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారని, పొరుగు వాని పట్ల, శత్రువుని పట్ల కూడా సంపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలని, ఎదుటివారి ఆస్తిపాస్తుల కొరకు ప్రాకులాడరాదని ఉన్నదాంట్లో తృప్తి చెందాలని, పగవాని ఇంట్లో పంచభక్ష పరమాణాలు తినుటకంటే ప్రేమ చూపించు వాని ఇంట్లో పిడికెడు అన్నం తినుట మేలని శ్రమకు తగిన వేతనం ఇస్తున్నప్పుడు తగినట్టుగా శ్రమ చేయాలని, అలాగే శ్రమించి కష్టపడే కూలీల కడుపు కొట్టి సంపాదించిన ఆస్తి ఏదో ఒక రూపంలో నష్టపోతారని తెలియజేశారు కవి.
ఈ భూమి మీద దేవుడిచ్చిన జీవితాన్ని చక్కగా బతికి మోక్షాన్ని సాధించాలని, దిక్కు మొక్కు లేని వారిని మోసం చేయరాదని, వారి పక్షాన దేవుడు ఉంటాడని, చంచలాత్ముల మనసు నిలకడగా ఉండదని, నీతి నియమాన్ని పాటించినప్పుడే మనిషి నిగ్రహంగా నడుచుకుంటాడని కవి తెలియజేశారు. శ్రమ కలిగినప్పుడు ధైర్యంగా నిలబడాలని, ఇబ్బందులు కలిగినప్పుడు సైతం ఇతరులకు మేలు చేయాలని, ప్రహరీ గోడ లేకపోతే నిర్మాణం పాడవుతుందన్న రీతిగా నిగ్రహం లేకపోతే మనసు చెడిపోతుందని ఫలితంగా మనిషి పతనమవుతాడని, మట్టి నుండి పుట్టిన మనిషి తిరిగి మరణించి మట్టిలోనికి చేరతాడని, నీటి మీద బుడగ వంటిది మనిషి జీవితం ఎప్పుడు మరణం సంభవిస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి మనిషి గర్వాన్ని విడనాడాలని, మనిషిలో జీవం ఉన్నప్పుడే ఈ లోకంలో మంచి చేయాలని కవి పలికారు.
" ఒకడు తనదు తప్పు లొప్పకొనిన యెడ
ఎట్టి వాడు అయిన యెదుగ లేడు
ఒప్పుకొనిన తప్పు నొప్పుగా వర్ధిల్లు" అని తన తప్పులను ఒప్పుకొననివాడు ఉన్నతునిగా ఎదగలేడని, చేసిన తప్పుని ఒప్పుకుంటే అది ఒప్పుగా మారుతుందని, హృదయంతో అకుంఠిత దీక్షతో లక్ష్యాన్ని సాధించవచ్చని, ఎదుటివారిని మోసగించాలనే ఆలోచనను మనసులోనే తుంచి వేయాలని, పరుల సొమ్ము ఆశించరాదని అది ప్రాణానికే ముప్పని, పాముకు పాలు పోసి పెంచితే తిరిగి అది మనిషిని కాటు వేసినట్లు, క్రూర స్వభావం కలవాడు కూడా నమ్మకంగా ప్రాణాలను హరిస్తాడని, పొరుగు వానికి కీడు చేయకుండా మేలు చేయాలని, కక్షపూరిత మనసు తగువులను తెస్తుందని, ప్రేమ తప్పులను క్షమిస్తుందని, మోసం చేసేవారు ఏదో ఒక రోజు మోసపోతారని, కష్టపడేవారు వృద్ధి చెందుతారని, వినయ మనస్కులు కీర్తించబడతారని, గర్విష్టులు నశిస్తారని పలికారు కవి. పందికి బురద పన్నీటితో సమానమని, దుష్ట స్వభావం కలిగిన వారికి మంచి రుచించదని, ఊరికే వాగుతున్న వారికి కష్ట నష్టాలే సంభవిస్తాయని, నోటిని అదుపులో పెట్టుకున్న వారికి మేలు జరుగుతుందని, అబద్దీకులతో చెలిమి చేయకుండా మంచి వారితో స్నేహం చేయాలని, అప్పుడే మనిషికి మేలు చేకూరుతుందని, మూర్ఖునికి ముక్కు పైనే కోపం ఉంటుందని ఫలితంగా నిత్యం గొడవలు పడుతుంటాడని, సాధు స్వభావి శాంతిని కోరతాడని కవి పలికారు.
“మధురమైన మాట వె వ్యధలను బోగొట్టు
మొరటు మాట మనకు ముప్పు దెచ్చు
మాటలాడు విధము మరువక నేర్పుము
విభుడు యేసు నందు విన్నవింతు అని జోసఫ్ కవి తన అనుభవంతో, పరిశుద్ధ గ్రంథంలోని దేవుని మాటలను నీతి సుధల శతకముగా పద్య సాహిత్య ప్రియులకు అందించారు. వెల లేని రావెల సూక్తులు, లోకసత్యాలని ఆచార్య ఎన్ గోపి ఈ శతకాన్ని కొనియాడారు. డాక్టర్ శిఖామణి ఈ శతకాన్ని సకల నీతి సారం పొగిడారు. డాక్టర్ కొండెపోగు బి లివింగ్స్టన్ " రావెల నీతి సుధల కోవెల" అని జోసఫ్ కవిని ప్రశంసించారు.
*ముగింపు*
ఆధ్యాత్మిక చింతనతో క్రైస్తవ సమాజానికి అవిరాళ కృషిచేసి, అలుపెరగక సామాజిక అసమానతలను ప్రశ్నిస్తూ సాహిత్య సేద్యం చేసిన రావెల జోసఫ్ కవి సికింద్రాబాద్ లో ఏప్రియల్ 12 వ తేది 2024 వ సంవత్సరంలో పరమపదించారు. విలువైన ఆధ్యాత్మిక, సామాజిక సాహిత్యాన్ని సాహితీ ప్రియులకు అందించిన రావెల జోసెఫ్ కవి సాహిత్యం సాహితీ ప్రియులకు అత్యంత చేరువ కావాలని కోరుకుంటూ.......
*అనిల్ కుమార్ దారివేముల*
*మాచర్ల, పల్నాడు జిల్లా*
*9951244718*
Be the first to share your thoughts on this story!