మాచర్ల, నవంబర్ 19 రాజధాని వాయిస్
మాచర్ల న్యాయస్థానంలో ఈ నెల 21వ తేదీ శనివారం లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు మాచర్ల ప్రధాన సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఎస్. శ్రీనివాస కల్యాణ్, సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పి. ప్రశాంత్ తెలిపారు.ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ కోర్టుల్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వివిధ రకాల కేసులను లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా చెక్కు బౌన్స్ కేసులు, సివిల్ కేసులు తదితర రాజీకి అర్హమైన కేసులను ఇరు పక్షాల పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు.సాధారణ న్యాయ ప్రక్రియలో కేసుల పరిష్కారానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందని, అయితే లోక్ అదాలత్ ద్వారా ఇరు పక్షాలు అంగీకరించిన కేసులను సులభంగా, సత్వరమే పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. దీనివల్ల కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా అవుతాయని తెలిపారు.కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉన్న కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తులు సూచించారు. తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలనుకునే అర్జిదారులు, సంబంధిత కక్షిదారులు నవంబర్ 21వ తేదీన మాచర్ల కోర్టుకు హాజరుకావాలని కోరారు.కక్షిదారులు పరస్పర అవగాహనతో ముందుకు వచ్చి తమ వివాదాలకు స్నేహపూర్వకంగా పరిష్కారం పొందాలని, లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాచర్ల కోర్టు న్యాయమూర్తులు ఎస్. శ్రీనివాస కల్యాణ్, పి. ప్రశాంత్ విజ్ఞప్తి చేశారు.
Be the first to share your thoughts on this story!