Saturday, 21 November 2026
Header1
BREAKING

అభ్యుదయ సమాజాన్ని ఆకాంక్షించిన రావెల జోసఫ్ కవి

సాహిత్యం ప్రత్యేకం

ప్రచురణకర్త / Publisher: Rajadhani Voice. Desk
📅 ప్రచురణ: 19 Nov 2026, 04:34 PM
🔄 నవీకరణ: 21 Nov 2026, 08:04 AM
👁️ 5 views
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):

వర్తమాన సమాజంలో ప్రబలుతున్న అన్యాయం, అవినీతి, కులతత్వ చీకట్ల పట్ల చిత్తసంస్కారం కలిగిన కవిగా, సామాజిక వాస్తవాల చిత్రకారునిగా తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చిన కవి రావెల జోసెఫ్. సామాజిక వ్యత్యాసాలను ఎత్తిచూపుతూ, కులమత మౌడ్యాలను నిరసిస్తూ మనిషి అభ్యుదయానికి అడ్డంకులుగా ఉన్న అన్ని అంశాలను ప్రశ్నించిన కవి, శతక కర్త, రచయిత మరియు క్రైస్తవ వేదాంత బోధకులు ఆచార్య రావెల జోసఫ్ కవి.

*బాల్యం- జీవితం*

రావెల జోసెఫ్ సెప్టెంబర్ ఒకటి 1937 గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామంలో రెవరెండ్ పాల్ మరియు సంతోషమ్మలకు 5వ సంతానం జన్మించారు. వీరి తండ్రి సంఘ కాపరిగా పనిచేయడం వల్ల బాల్యం నుండే క్రీస్తు బోధలను వింటూ, ఆచరిస్తూ జీవించారు. వీరు ఉపాధ్యాయ శిక్షణ విద్యను అభ్యసించి పల్నాడు ప్రాంతంలో ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. సుశీలమ్మను వివాహం చేసుకొని నలుగురు కుమారులు, ఒక కుమార్తెను సంతానంగా పొందారు.1967లో B.D. పట్టభద్రులై రామయపట్టణంలోని బాప్టిస్ట్ వేదాంత కళాశాలలో అధ్యాపకులుగా నియమించబడ్డారు.1973లో అమెరికాలో STM డిగ్రీ, 1980లో UTC నుండిM.Th పట్టాను పొంది, 1987లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేశారు.
వీరు రామయపట్నంలో ఆరు సంవత్సరాలు బోధించి హైదరాబాదులోని (ఏ సి టి సి) ఆంధ్ర క్రైస్తవ దైవ జ్ఞాన కళాశాలలో అధ్యాపకులుగాను, 1976- 78లో డీన్ ఆఫ్ ది బాప్టిస్ట్ హాల్ గా వ్యవహరించారు. వివిధ క్రైస్తవ కళాశాలల్లో ఉన్నతమైన సేవలు అందించారు. వీరి క్రైస్తవ భక్తి గీతాలు, దేశభక్తి గీతాలు రేడియో మరియు దూరదర్శన్ లో ప్రసారమయ్యాయి. తెలుగు క్రైస్తవ సాహిత్యానికి, కీర్తనలకు వీరు చేసిన కృషికి కేంద్ర సాహిత్య అకాడమీ గుర్తింపు లభించింది. 1977 సెప్టెంబర్ లో మీరు షష్టిపూర్తి సందర్భంగా "క్రైస్తవ సాహితీ విహారము" వారు వీరికి క్రైస్తవ కళా ప్రపూర్ణ బిరుదు ఇచ్చి సత్కరించారు. వీరి సాహిత్య, సంగీత సేవలకు గుర్తింపుగా *కళా రాజ్యం* వారు 2007 ఫిబ్రవరి 13న రవీంద్ర భారతిలో ఘనంగా సత్కరించారు.

1004477680.jpg
Type image caption here...



*రచనలు*

వీరు అభ్యుదయం, ఆకాంక్ష, ప్రగతి కోసం అను గేయ, వచన కవితా సంపుటాలను మరియు నీతి సుధల శతకము అను ద్వి శతకాన్ని రచించారు. ఆరని జ్యోతి, ఆదిమ క్రైస్తవ సంఘ చరిత్ర, తెలుగు బాప్టిస్ట్ సంఘముల చరిత్ర, పురుషోత్తమ చౌదరి భక్తి వేదాంతం, క్రైస్తవ భక్తి గీతాలు, విశ్వశాంతి, తెలుగు సాహిత్య గ్రంథమాల, సంఘ జ్యోతులు, 16వ శతాబ్దపు క్రైస్తవ సంఘసంస్కరణం, క్రీస్తు జనన నాటకము, క్రీస్తు శ్రమలు అను తెలుగు రచనలతో పాటు,Anabaptist, Evangelism and theology, India, Bhakti theology of purushothama Chowdhary అను ఆంగ్ల గ్రంధాలను రచించారు. అనేక జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో వ్యాసాలను రచించారు.

*అభ్యుదయం*

సామాజిక పరివర్తనను ఆశించి 1981లో అభ్యుదయం అను గేయ, వచన కవితా సంపుటిని రచించారు. ఆచార్య కొలకలూరి ఇనాక్ ఉన్న మాట పేరుతోనూ, బి ఏ ప్రతాప్ కుమార్ చిన్న మాట పేరుతో ముందు మాటలు రాశారు. శుభసందేశ ప్రచురణలు వారు ఈ కవితా సంపుటిని ప్రచురించారు.

" ఎదుటివాడ్ని వేధించడం
పొరుగు వాడ్ని బాధించడం
పగవాడి పరువు దీయడం
ఇకనైనా మానేద్దాం" అని యికనైనా అను కవితలో క్రైస్తవ సమాజంలో అక్కడక్కడ కనిపించే ద్వేష, అసూయలను ఎత్తిచూపారు. ఇది కేవలం క్రైస్తవ సమాజానికి మాత్రమే కాదు సమస్త మానవాళికి వర్తిస్తుంది.
ఒక్కొక్క పద్దెo గద్దెల నెదిరింప
ఒక్కొక్క గీతం ఎదలను కదిలింప
ఒక్కొక్క కావ్యం కథనాన్ని నడుప
ఒక్కొక్క గేయం గాయాన్ని మాన్ప సాగించాలి సాహితీ విహారాన్ని నేడు, విహరించాలి సాహితీ సదనంలో నీవు అని ఎందుకు రాయాలి అను కవితలో సమాజంలో మార్పు కోసం కవి సాహిత్యాన్ని రాయాలని తెలిపారు. ధనాశ పిశాచిగా మారింది, హుండీలు గుండాలుగా మారాయి అని ధనాపేక్షతో హుండీలను సృష్టించి చందాల పేరుతో పేదలను దోచుకునే వారిని ప్రశ్నించారు జోసఫ్ కవి.

*ఆకాంక్ష*

కులతత్వాన్ని నిర్మూలించాలంటే ప్రేమ, కరుణలు మాత్రమే ఆయుధాలని, ప్రేమను ఔషధంగా ఉపయోగించి రాచపుండు లాంటి వర్ణ వ్యవస్థను మార్చాలని ఆకాంక్షించి మనిషిలో మానవతా దృక్పథాన్ని, ప్రేమ తత్వాన్ని బోధించి ఆకాంక్ష అను వచన కవితా సంపుటిని 1997లో రచించి వారి అర్ధాంగి సుశీలమ్మకు అంకితమిచ్చారు జోసఫ్ కవి.
ఒక నాణానికి బొమ్మ మరియు బొరుసు ఉన్నట్లే జీవితం ఒకవైపు ఆధ్యాత్మిక చింతన తోను సామాజిక బాధ్యతతో ముడిపడి సాగింది. సామాజిక దృక్పథంతో వచన రచన చేయుటకు వీరిపై సి.నారాయణరెడ్డి ప్రభావం ఉందని, వారి చేతుల మీదుగా ఆకాంక్ష గ్రంథం ఆవిష్కరించబడిందని, ఆచార్య ఎన్ గోపి సభాధ్యక్షుత వహింపగా డాక్టర్ ఎండ్లూరి సుధాకర్, మున్నంగి క్రీస్తు దాసు వంటి వారు పుస్తక పరిచయం చేశారని, సాధన నరసింహాచార్య ముందుమాట రాశారని, జోసఫ్ దంపతుల షష్టిపూర్తి సమయంలో ఘనంగా ఆకాంక్ష ఆవిష్కరించబడిందని తన మాటలో తెలియజేశారు.
కవి, కర్షకుడు సమాజానికి రెండు కళ్ళు అని, నవ్య సమాజ ప్రగతికి, సమసమాజ నిర్మాణానికి ఇరువురు అవసరమని తెలుపుతూ

“బండ గుండెల్ని బద్దలు గొట్టి, పదును చేస్తుంది కవి అక్షరం
బండ భూముల్ని పగులగొట్టి చదును చేస్తుంది రైతు పనితనం “అని ఉభయ కవి మిత్రులు అను కవితా శీర్షికలో తెలియజేశారు. పూలమాలలో వివిధ రకాల పూలు చక్కగా ఇమిడిపోతాయి కానీ మనుషుల్లో ఈ ఐక్యత లేదని పుష్ప వికాసం అను కవితా శీర్షికలో

“లేదు మా జాతికి మీ తీరు,
రాదు నరజాతికి మీ పేరు
మాలలో మీరుండు తీరు, మాకుంటే మాకెంతో పేరు” అని సమస్త మానవాళి కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా ఐక్యతగా ఉండాలని జోసఫ్ కవి ఆకాంక్షించారు. భారతదేశంలో పుట్టి పెరిగి విదేశాలకు వెళ్లి స్థిరపడిన ప్రవాస భారతీయులు స్వదేశం కోసం పాటుపడాలని, జన్మనిచ్చిన తల్లిని మరువరాదని హితవు పలికారు. సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నించేలా కవి తన గళాన్ని విప్పాలని కవులకు పిలుపునిచ్చారు. అస్పృశ్యత మరియు అంటరానితనానికి గురవుతున్న దళితులకు మరియు మహిళలకు అభ్యుదయ గీతాన్ని వినిపించాలని “ఎందుకీ సన్మానం” అను కవిత లో కవికి కర్తవ్య బోధ చేశారు.

“అతనిలోని అస్పృశ్యతా పుండు పగలాలని
కులమనే చీము కారిపోవాలని,
ప్రేమ మందుతో పుండు మానాలని,
పరిశుద్ధ మనిషిగ అతడు మారాలని” అంటరాని మంట అను కవితలో తాను చిన్నప్పుడు ఎదుర్కొన్న వివక్షతను తెలుపుతూ సమాజంలోని కుల దురహంకారాన్ని తూర్పుర పట్టారు జోసఫ్ కవి. తన తండ్రి పేరు తెలుసుకున్న తర్వాత అగ్రకులానికి చెందిన వ్యక్తిలో రేగిన కుల దురహంకారానికి తనలో ఆవేదన, ఆక్రోషాలు పెళ్లు బిక్కాయని వాటిని చల్లార్చుకుని అతనిలో పరివర్తన రావాలని, ప్రేమను అతనిపై సంధించానని స్వానుభవాన్ని పంచుకున్నారు కవి.
50 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మనిషిని మనిషిగా చూడడం మరిచారని, మానవత్వాన్ని మంటగలిపారని, అధికారం, ధన దాహం మరియు హోదా పట్ల ఆకాంక్ష పెరిగిందని, పార్టీ ఫిరాయింపులు, మత కలహాలు పెరిగాయని నీతిలేని నాయకులను చూసి భరతమాత కన్నీరు మున్నీరుగా విలపిస్తుందని నేటి భారతీయ సమాజ దుస్థితిని “భారతాశ్రువులు" అను కవితలో ఎత్తి చూపారు.

“కులమనే నిచ్చెన, నేలమట్టమైనప్పుడు
కులమనే “కాలం” తొలగించబడినప్పుడు
ఆశించిన సమతను అందుకోగలుగుతాం
స్వేచ్ఛాయుత జీవితం తిరిగి చిగురిస్తుంది
సమత, సౌబ్రాతృత్వం సంతరించుకుంటుంది” అని కులం నిచ్చెన కూలితే! అను కవితలో భారతదేశంలోని నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను నిరసించారు జోసఫ్ కవి. పైకి శాంతిని కోరుతూ మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని, దళారీల మోసాన్ని రాజకీయాలలోని కల్మషాన్ని కడిగి వేయాలని, తద్వారా ఈ సమాజం బాగుపడాలని కవి కాంక్షించారు. భూమిని దుక్కి దున్ని తమ చెమటతో సేద్యం చేసే కార్మిక కర్షకుల కష్టాన్ని కర్షకా! లెమ్ము రా!! కవితలో ఆవిష్కరించారు. పట్టణాలలో అసంఘటిత భవన నిర్మాణ కూలీలు ఎదుర్కొనే శ్రమదోపిడిని సౌధ సమాధులు అను కవిత లో వివరించారు. పనిచేస్తేనే ప్రగతి అని, అదే సమాజానికి పురోగతి అని శ్రమైక గీతాన్ని పాడారు.
ఆకాంక్ష అను కవితలో కుల తత్వాన్ని, మతమౌడ్యాన్ని ప్రదర్శించే వారిని శిక్షించే తత్వాన్ని కాకుండా వారిలో పరివర్తనను ఆకాంక్షించారు జోసఫ్ కవి. కుటిల స్వభావాన్ని చూపే వారిని కాల్చి చంపే వారిలా కాకుండా, పతనమైపోతున్న మానవాళిని మేలుకొలిపే చిన్న కాంతి కిరణం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు కవి తెలిపారు. భూతాలతో నిండిన ప్రకృతికి ఇచ్చే తత్వమే ఉందని, వెలుగు, చీకటి, ఫలము మరియు ఫలితములు అందరికీ సమానంగా ఇస్తుందని ప్రకృతి ప్రవృత్తిని ఆవిష్కరించారు కవి.

“కళ్ళు లేవు స్వార్థానికి, దీని కాళ్ల క్రింద పడి
నలిగి కన్నీరు కార్చే, నిస్వార్ధాన్ని చూడటానికి” అని చారిత్రక సత్యం అను కవితలో స్వార్థానికి అవధులు లేవని, స్వార్థపరుల ఆలోచనలు మరియు ఆశలు అనంతాలని, తనకు చాలినంత కంటే మించి కోట్లకు కోట్లు కావాలని, కోట్లకు పడగెత్తాలని ఆకాంక్షిస్తారని, న్యాయబద్ధులను తొక్కి అన్యాయంగా ఎదుగుతుంటారని స్వార్థపరుల స్వభావాన్ని ఆవిష్కరించారు కవి. ధర్మంపై అధర్మం ఎగిరెగిరిపడినా ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని, అధర్మం స్మశానంలో కపెట్టబడుతుందని, మేకపోతు గాంభీర్యం ఎంత ప్రదర్శించినా ధర్మమే గెలుస్తుందని కవి తెలిపారు. మద్యపానం ఒక దుర్వ్యసనమని, అది ఇంటిని ఒంటిని నాశనం చేస్తుందని, పరపతిని పోగోడుతుందని, ఆస్తిపాస్తులు హరించుకుపోతాయని, బంధువులు దూరమౌతారని, ఇన్ని నష్టాలు జరిగినా అజ్ఞానంతో మద్యాన్ని వదలరని *మధుపానాందుడు* అను కవితలో మద్యానికి బానిసలయిన వారిలో పరివర్తనను ఆకాంక్షించారు కవి.
"రాజకీయ స్నేహం, మిస్టరీ ఓ నేస్తం!
పంపకాలలో తేడా వస్తే, తారస్థాయిలో
తగవులు మళ్లీమళ్లీ విరోధం” అని రాజకీయ నాయకుల్లో తాత్కాలిక స్నేహాన్ని ఎడతెరిపిలేని వైరుధ్యాన్ని బట్ట బయలు చేశారు కవి.
కులమనే కొలిమిని ఆర్పే సీసాలు, కుల కట్టడాలను కూల్చే కందాలు, పేద హృదయం నుండి ప్రేలే వృత్తాలు, పొగరు తగరుల కొమ్ము విరచే గీతాలు, మత్తెక్కిన మనుషుల నెత్తుల మొత్తే, మతిలేని మ్లేచ్ఛుల మలిచే మత్తేభాలు వ్రాసి సాగించండి సాహితీ సమరం. నడిపించండి సాహిత్య కథనం అని సాహితీ సమరం అను కవితలో కవులకు కర్తవ్య బోధ చేశారు.

*ముగింపు*
ఆధ్యాత్మిక చింతనతో క్రైస్తవ సమాజానికి అవిరాళ కృషిచేసి, అలుపెరగక సామాజిక అసమానతలను ప్రశ్నిస్తూ సాహిత్య సేద్యం చేసిన రావెల జోసఫ్ కవి సికింద్రాబాద్ లో ఏప్రియల్ 12 వ తేది 2024 వ సంవత్సరంలో పరమపదించారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X
Header1