పిడుగురాళ్ల, నవంబర్ 23
జానపాడు గ్రామ పంచాయతీ 15వ వార్డు సభ్యునిగా నామినేషన్ వేసిన అభ్యర్థి పత్రాలను బలవంతంగా లాక్కెళ్లారంటూ స్థానిక ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశాయి.
జానపాడు 15వ వార్డుకు కోడిరెక్క శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఎన్నికల అధికారి నామినేషన్ స్వీకరించి రసీదు ఇచ్చిన అనంతరం, ఒక వ్యక్తి అధికారి చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కొని బయటకు తీసుకెళ్లారని బాధితులు ఆరోపించినట్లు వారు పేర్కొన్నారు. ఎన్నికల అధికారుల సమక్షంలోనే ఈ ఘటన జరిగినప్పటికీ, స్థానిక సిబ్బంది పట్టించుకోలేదని వారు ఆరోపించారు.
రాజ్యాంగం కల్పించిన ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాలరాయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ప్రజా సంఘాలు ఖండించాయి. ఒక సామాన్య వ్యక్తి పోటీ చేయకుండా అడ్డుకోవడం అన్యాయమని పేర్కొన్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకొని బాధితుడికి న్యాయం చేయాలని ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
Be the first to share your thoughts on this story!