Tuesday, 20 October 2026
Header1
BREAKING

రాయలసీమను ప్రపంచ ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దుతాం

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 అమరావతి
📅 ప్రచురణ: 01 Oct 2026, 10:11 AM
🔄 నవీకరణ: 08 Oct 2026, 10:00 AM
👁️ 120 views

⭐ Key Highlights / ముఖ్యాంశాలు

- రూ.లక్ష కోట్లతో ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రాయలసీమ రైజింగ్’ - 10 జిల్లాలు.. 201 క్లస్టర్లు.. 14.41 లక్షల హెక్టార్లకు ఉద్యాన విస్తరణ లక్ష్యం - సాగునీరు, ఉద్యానవనం, గ్రామీణ రహదారులు, ప్రాసెసింగ్, ఎగుమతులు ఒకే వేదికపై - 9.6 లక్షల రైతుల ఆదాయ, జీవన ప్రమాణాల పెంపే అంతిమ లక్ష్యం - మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి, అక్టోబర్ 1: రాజధాని  వాయిస్ :

ఒకప్పుడు కరువుకు చిరునామాగా భావించిన రాయలసీమను దేశానికే కాకుండా ప్రపంచానికే ఉద్యానవన ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రాయలసీమ రైజింగ్’ కార్యక్రమానికి సమగ్ర కార్యాచరణ రూపొందించిందని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు సంప్రదాయంగా తక్కువ ఆదాయం ఇచ్చే వర్షాధార పంటలకే పరిమితం కాకుండా, తక్కువ నీటితో అధిక ఆదాయం ఇచ్చే ఉద్యాన పంటల వైపు అడుగులు వేయాలన్నదే ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతంలో వార్షిక వర్షపాతం పరిమితంగా ఉండటం, తరచూ కరువు పరిస్థితులు ఏర్పడటం, సాగునీటి కొరత, మార్కెట్ అనుసంధానం లోపించడం వంటి సమస్యలను ఒక్కొక్కటిగా కాకుండా నీరు నుంచి మార్కెట్ వరకు రైతుకు ఎదురయ్యే ప్రతి సమస్యకు ఒకేసారి పరిష్కారం చూపేలా సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక–IHDP రూపొందించినట్లు మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో వ్యవసాయంలో నీటి వినియోగ సామర్థ్యానికి మొదటి నుంచీ అత్యంత ప్రాధాన్యం లభించిందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 2003 నవంబరులో ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు–APMIP ప్రారంభమైందని, తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేయడం, ఉత్పాదకత పెంచడం దాని ప్రధాన లక్ష్యాలని ప్రభుత్వ జిల్లా పోర్టల్ కూడా పేర్కొంటోంది.

రూ.1 లక్ష కోట్లతో సమగ్ర ప్రణాళిక
రాయలసీమ సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళికలో సుమారు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు ప్రతిపాదించామని మంత్రి తెలిపారు. ఇందులో ప్రభుత్వ రంగంలో రూ.40,352 కోట్లు, ప్రైవేటు రంగం నుంచి సుమారు రూ.60 వేల కోట్ల పెట్టుబడులు సమీకరించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ప్రభుత్వ పెట్టుబడుల్లో సాగునీటి రంగానికి రూ.20,884 కోట్లు, ఉద్యానవన రంగానికి రూ.14,906 కోట్లు, గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.4,562 కోట్లు ప్రతిపాదించినట్లు వివరించారు. 2026 ఆగస్టు నుంచి 2029 జూలై వరకు మూడు దశల్లో కార్యక్రమాన్ని అమలు చేసి, 10 జిల్లాల్లోని 201 క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఉద్యాన విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచడం, ఉత్పత్తిని దాదాపు రెట్టింపు చేయడం, సుమారు 9.6 లక్షల రైతుల ఆదాయం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యమన్నారు.

మూడు దశల్లో ‘రాయలసీమ రైజింగ్’
మొదటి దశలో 2026–27లో రూ.12,066 కోట్లతో 72 క్లస్టర్లపై దృష్టి సారిస్తామని మంత్రి తెలిపారు. రిజర్వాయర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, చెరువులు, చివరి ఆయకట్టు వరకు నీరు చేరే వ్యవస్థలు, కీలక గ్రామీణ రహదారులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. రెండో దశలో 2027–28లో రూ.15,036 కోట్లతో మరో 67 క్లస్టర్లు, మూడో దశలో 2028–29లో రూ.13,250 కోట్లతో మిగిలిన 62 క్లస్టర్లను అభివృద్ధి చేసి మొత్తం 201 క్లస్టర్లను సమగ్ర ఉద్యాన ఉత్పత్తి–ప్రాసెసింగ్–మార్కెటింగ్ కేంద్రాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

నీటి భద్రతే మొదటి ప్రాధాన్యం
రాయలసీమ రైతుకు నీటి భద్రత కల్పించకుండా ఉద్యాన విప్లవం సాధ్యం కాదు. అందుకే నీరు–పంట–మార్కెట్ అనే మూడు అంశాలను ఒకే ప్రణాళికలో అనుసంధానిస్తున్నాం అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రణాళికలో భాగంగా సుమారు 9 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు, మరో 4.3 లక్షల ఎకరాల ప్రస్తుత ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులను అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. రైతుల ఉత్పత్తులను వేగంగా మార్కెట్లకు తరలించేందుకు 5,721 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల అభివృద్ధి కూడా ప్రతిపాదించబడిందన్నారు. డ్రిప్, స్ప్రింక్లర్, ఫర్టిగేషన్ వంటి సూక్ష్మ సాగునీటి విధానాలను పెద్దఎత్తున విస్తరించి, ప్రతి నీటి బొట్టుకూ ఎక్కువ పంట–ప్రతి ఎకరాకు ఎక్కువ ఆదాయం అనే విధానంతో ముందుకు వెళ్తామని చెప్పారు. నాణ్యమైన మొక్కలు, ధృవీకృత నర్సరీలు, గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, ఆధునిక సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు.

పంట పండించడం మాత్రమే కాదు.. రైతే విలువ జోడింపులో భాగస్వామి
ఉద్యాన పంటలను సాగు చేయించడం దగ్గరే ప్రభుత్వ బాధ్యత ముగియదని మంత్రి స్పష్టం చేశారు. పంట కోత, గ్రేడింగ్, సార్టింగ్, ప్యాకింగ్, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్, బ్రాండింగ్, రవాణా, దేశీయ, అంతర్జాతీయ మార్కెటింగ్ వరకు మొత్తం విలువ గొలుసును అభివృద్ధి చేయడమే IHDP ప్రత్యేకత అన్నారు. ప్రతి క్లస్టర్ పరిధిలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు–FPOలను బలోపేతం చేసి ప్రాసెసింగ్ సంస్థలు, ఎగుమతిదారులు, రిటైల్ మార్కెట్లతో నేరుగా అనుసంధానిస్తామని చెప్పారు. మామిడి పల్ప్, అరటి పౌడర్, చిప్స్, టమాటా ప్యూరీ, మిర్చి ఒలియోరెసిన్, డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తాజా పండ్ల మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల నుంచి రైతులను రక్షించే అవకాశం ఉంటుందన్నారు. కోల్డ్ చైన్లు, ప్యాక్‌హౌస్‌లు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రణాళికలో భాగం చేసినట్లు తాజా ప్రభుత్వ నోట్ ఆధారంగా నివేదికలు పేర్కొన్నాయి.

అరటి ఎగుమతుల విజయం మనకు మార్గదర్శకం
ఆంధ్రప్రదేశ్ ఉద్యాన రంగంలో ఇప్పటికే సాధించిన అరటి ఎగుమతుల పురోగతి ఈ విధానానికి మంచి ఉదాహరణ అని మంత్రి పేర్కొన్నారు. 2016–17లో కేవలం 246 టన్నులుగా ఉన్న అరటి ఎగుమతులు, క్లస్టర్ విధానం, ఎగుమతి సంస్థల భాగస్వామ్యం, నాణ్యతా ప్రమాణాలు, రవాణా సదుపాయాల అభివృద్ధితో అనంతపురం నుంచి ఇరాన్‌కు లక్ష టన్నులకు పైగా ఎగుమతి అయ్యే స్థాయికి చేరినట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి. పండించిన రైతు ధర కోసం ఎదురు చూడకూడదు. మార్కెట్ రైతు వద్దకు రావాలి. మన రైతు ఉత్పత్తి ప్రపంచ మార్కెట్‌లో బ్రాండ్‌గా నిలవాలి. అదే మా ప్రభుత్వ లక్ష్యం అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

రూ.81 వేల కోట్ల అదనపు GVA లక్ష్యం
ఈ సమగ్ర ప్రణాళిక ద్వారా మూడో సంవత్సరం నుంచి సుమారు రూ.81 వేల కోట్ల అదనపు స్థూల విలువ జోడింపు–GVA సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆధునిక సాగు పద్ధతులు, నాణ్యమైన మొక్కలు, సూక్ష్మ సాగునీరు ద్వారా ఉత్పాదకత పెంపు, గ్రేడింగ్–సార్టింగ్–బ్రాండింగ్ ద్వారా రైతుకు మెరుగైన ధర లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధి కల్పన, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కూడా ఈ ప్రణాళికలో కీలక లక్ష్యాలని పేర్కొన్నారు. తాజా నివేదికల్లో ఈ ప్రణాళిక ద్వారా సుమారు 19.7 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యం ప్రస్తావించబడింది.

‘కరువు సీమ’ నుంచి ‘ఫ్రూట్ బౌల్’ వైపు
మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, ఖర్జూరం, డ్రాగన్ ఫ్రూట్, పుచ్చకాయ, నిమ్మ, బత్తాయి, అవకాడోతో పాటు అధిక విలువ కలిగిన పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో రాయలసీమను దేశంలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టేందుకు అవసరమైన ప్రతి చర్య తీసుకుంటామని అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమ భవిష్యత్తును కరువు నిర్ణయించదు.. రైతు కష్టం, నీటి సమర్థ వినియోగం, ఆధునిక సాంకేతికత, ప్రపంచ మార్కెట్ అవకాశాలు నిర్ణయిస్తాయి. ఒకప్పుడు కరువుకు ప్రతీకగా ఉన్న రాయలసీమను ‘ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా’ గా, భవిష్యత్తులో ప్రపంచస్థాయి ఉద్యాన ఉత్పత్తి–ప్రాసెసింగ్–ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం. రైతు ఆదాయం పెరగాలి.. గ్రామాల్లో ఉపాధి పెరగాలి.. మన పంటకు ప్రపంచ మార్కెట్ దక్కాలి. ఆ లక్ష్య సాధనకు ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్–రాయలసీమ రైజింగ్’ ఒక సమగ్ర కార్యాచరణ అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X