Saturday, 29 August 2026
Telugu Daily
Header
BREAKING

విజన్ ప్లాన్ అమలు పనితీరుకు ప్రామాణికం..

విజన్ ప్లాన్ పై ప్రజా ప్రతినిధులు నిరంతరం సమీక్షించాలి..

 ప్రజల భాగస్వామ్యం తోనే మెరుగైన ఫలితాలు

అన్ని స్థాయిల్లోనూ పొలిటికల్ గవర్నెన్స్ ఉండాల్సిందే.

నియోజకవర్గ విజన్ ప్లాన్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు

నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లపై ముఖ్యమంత్రి సమీక్ష

ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

గుంటూరు.ఆగస్టు 28 

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచేందుకు  నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పేదరిక నిర్మూలన, ప్రజా సమస్యల త్వరిత పరిష్కారం, సుపరిపాలనే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్వర్ణ నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ అమలుపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్సు లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వీడియో కాన్పరెన్స్ ద్వారా ఎంపీలు, ఎమ్మెల్యేలు, యంగ్ ప్రొఫెషనల్స్, నాలెడ్జ్ పార్టనర్స్ తో సీఎం మాట్లాడారు. నియోజక వర్గాల వారీగా విజన్ ప్లాన్ రూపొందించుకుని పని చేయడం దేశంలోనే ప్రధమంగా ఏపీలోనే అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. దీనికి జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చిందని చెప్పారు. ఈ క్రమంలో నియోజకవర్గాల విజన్ ను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నియోజకవర్గాల విజన్ ప్లాన్ అమలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలది కీలక పాత్ర అని చెప్పారు. రూపొందించుకున్న కీ-పెర్ఫామెన్స్ ఇండికేటర్లకు అనుగుణంగా ఆయా రంగాల్లో వృద్ధి నమోదు చేసేలా పని చేయాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గాల విజన్ ప్లానులో యంగ్ ప్రొఫెషనల్స్, నాలెడ్జ్ పార్టనర్లు, స్వర్ణ కార్యాలయాల సిబ్బంది కీలక పాత్ర పోషిస్తారని... ఆ మేరకు వీళ్లంతా వినూత్నంగా ఆలోచించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం... ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేయడం వంటి అంశాలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. స్థానికంగా ఉండే వనరుల లభ్యతను ఆధారంగా చేసుకుని ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి ప్రణాళికలను సిద్దం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నియోజక వర్గాల విజన్ ను అందించామని, ఆయా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విజన్ ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు డేటా లేక్ సిద్దం చేశామని... అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించుకోవడంతోపాటు.. పూర్తి స్థాయిలో టెక్నాలజీని వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. నియోజకవర్గాల యాక్షన్ ప్లాన్ అమలుపై ఎమ్మెల్యేలు ఎప్పటి కప్పుడు సమీక్షలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. క్షేత్ర స్థాయిలో సమీక్షలు మొక్కుబడిగా కాకుండా, ప్రజలకు పూర్తిగా జవాబుదారీగా ఉండేలా నిర్వహించాలని సూచించారు. లబ్ధిదారులకు కేవలం నగదు సాయం అందించడమే కాకుండా, వారిని ఆర్థికంగా నిలబెట్టి సాధికారత వైపు నడిపించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి-సంక్షేమం చేపడుతోందని..వాటిని ప్రజలకు వివరించే బాధ్యతను  ప్రజా ప్రతినిధులే తీసుకోవాలని అన్నారు. పీ4 ప్రాజెక్టు ద్వారా పేదలకు అవసరమైన చేయూత అందిస్తున్నట్లు చెప్పారు. పేదరిక నిర్మూలనకు పారిశ్రామికవేత్తలను సైతం ప్రోత్సహిస్తూ, సమాజంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటామనే నమ్మకాన్ని కలిగించాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గాల్లోనూ తలసరి ఆదాయం పెంచడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. అలాగే అనుమతులు పొందుతున్న పరిశ్రమలు ఆయా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో గ్రౌండ్ అయ్యే విధంగా ప్రజా ప్రతినిధులు, క్షేత్ర స్థాయి అధికారులు..సిబ్బంది పూర్తి స్థాయిలో సహకరించాలని సీఎం ఆదేశించారు.  ఉద్యోగుల సామర్థ్యం పెరిగేలా ఇప్పటికే 1.50 కోట్ల ఆన్లైన్ కోర్సులు కూడా పూర్తి చేసుకున్నారని సీఎం తెలిపారు. నియోజకవర్గాల విజన్ ప్లాన్ యూనిట్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని సీఎం అన్నారు.

*వినూత్నంగా ఆలోచించాలి... మెరుగైన సేవలు అందించాలి*

ప్రస్తుత పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు విద్య, వైద్యం భారంగా మారుతున్నాయని, ఈ ఇబ్బందుల నుంచి వారిని గట్టెక్కించేందుకే సంజీవని, తల్లికి వందనం వంటి వినూత్న పథకాలను తెచ్చామని సీఎం వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, నైపుణ్యాలు పెంచడం వల్ల అదనంగా లక్ష మంది విద్యార్థులు చేరారని, ఇది వారి కుటుంబాలపై విద్యా భారాన్ని తగ్గించిందని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులు, ప్రజా ప్రతినిధులు సాంప్రదాయ ధోరణి వీడి వినూత్నంగా ఆలోచించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విజన్ ప్లాన్‌ను వర్తింపజేస్తూ సమస్యలకు తగిన పరిష్కారాలు చూపాలని కోరారు. పరిపాలనలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం అత్యంత కీలకమని, అన్ని స్థాయిల్లో పొలిటికల్ గవర్నెన్స్ సమర్థవంతంగా అమలు కావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాల్లోనూ, అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ప్రజలను భాగస్వాములను చేసినప్పుడే అద్భుత ఫలితాలు వస్తాయని సీఎం అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కలల సాకారంగా చేపట్టిన భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని గుర్తుచేశారు. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు పేరుతో కార్యక్రమం నిర్వహిస్తే.. ప్రజలే స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి ప్రచారం చేపట్టారని గుర్తు చేశారు. అదే విధంగా యువతకు, నిరుద్యోగులకు మేలు చేసేలా చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియకు అనేక అడ్డంకులు కల్పించే ప్రయత్నం జరిగినా సమర్ధవంతంగా నిర్వహించి రిక్రూట్మెంట్ పూర్తి చేశామన్నారు. పారదర్శకంగా చేపట్టిన మెగా డీఎస్సీపై విమర్శలు చేస్తుంటే టీచర్లే స్వయంగా ఉద్యమించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలను మెప్పించగలిగితే... ప్రజల నుంచి సహకారం కూడా అదే స్థాయిలో ఉంటుందని సీఎం చెప్పారు. 
జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు, ముఖ్యమంత్రి సూచనలు, మార్గదేశాలకు అనుగుణంగా నిజమైన స్ఫూర్తికి దర్పం పట్టే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, ముఖ్య ప్రణాళిక అధికారి పి.శేష శ్రీ , ఇతర అధికారులు పాల్గొన్నారు.
Share this Article:

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!