బుక్కరాయసముద్రం/అనంతపురం: రాజధాని వాయిస్ :
విజయవాడలోని శాప్ కార్యాలయంలో ఉపాధ్యాయులపై దాడి చేసిన వారిలో డీఎస్సీ అభ్యర్థులు ఎవరూ లేరని, దీని వెనుక ప్రతిపక్ష పార్టీకి చెందిన వారి ప్రమేయం ఉందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆరోపించారు. దాడికి పాల్పడిన ఏ ఒక్కరినీ చట్టం ముందు విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు. శుక్రవారం బుక్కరాయసముద్రం మండలం జంతులూరులోని 14వ బెటాలియన్‌లో నిర్వహించిన ఏపీఎస్పీ ఎస్సీటీపీసీ పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణితో కలిసి మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మెగా డీఎస్సీ ప్రక్రియలో ఎటువంటి అక్రమాలు జరగలేదని న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చినప్పటికీ, వైఎస్సార్సీపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో పోలీసులు తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వహించారని, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసుల విధి నిర్వహణకు, శాంతిభద్రతల పరిరక్షణకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని మంత్రి పేర్కొన్నారు. నిరుద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ పోలీసు శాఖతో సహా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ పూర్తి కావడంతో పాటు, ఇటీవల మరో 2,050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే యత్నాలు చేస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి హెచ్చరించారు.
Be the first to share your thoughts on this story!