మన గ్రామాభివృద్ధి, ఓటు - మన కనీస భాద్యత
- మాగులూరి భానుప్రకాష్ (USA)
మన గ్రామం.. మన ఊరు.. అన్న భావన ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. పుట్టి పెరిగిన ఊరు, తల్లిదండ్రులు, బంధువులు , బాల్యం, ఎన్నో అనుభవాల సమాహారం. కాల మాన పరిస్థితులను బట్టి ప్రపంచ వేదికపై వృత్తి, ఉపాధి రీత్యా పట్టణాలలో ఉంటున్నా, విదేశాలలో ఉన్నా మన గ్రామాభివృద్ధి మనందరి భాద్యత. రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, స్థానిక ప్రభుత్వ సదుపాయాలూ.. ఇలా ఎన్నో అంశాల పట్ల కనీస అవగాహన గల మన గ్రామ నాయకత్వాన్ని మనమే నిర్ణయించే సమయం ఇది. గ్రామ సభలు, పంచాయితీ నిధులు, పారదర్శకతతో కూడిన నిర్ణయాలు చాలా కీలకం. వందలాది మంది గ్రాడ్యుయేట్లు ఉన్న గ్రామాలు, మండల కేంద్రాలలో కూడా ఘర్షణలు, సెటిల్ మెంట్లు, అక్రమ సంపాదన తో నలుగురు సన్నాసులను వెంటేసుకొని, ఇదే నాయకత్వ అర్హత అనుకునే అవివేకుల చేతుల్లో గ్రామ స్వరాజ్యం అన్న మాటే కనుమరుగైపోయింది. వీళ్లా మన గ్రామాలను ఉద్దరించేది? ఇదా మనకు కావాల్సింది? ఇలాగా మన గ్రామం ఉండాలని మనమంతా కోరుకుంటుంది? కాదు. చదువుకున్న విద్యావంతులు, యువత, మహిళలు, వ్యాపారులు , అనుభవం గల పెద్దలు, ఎన్నారైలూ ఆలోచించాలి. మనం గ్రామాలలో ఉన్నా, లేకపోయినా అది మన జన్మభూమి. మన తల్లిదండ్రులు, బంధువులు ఇప్పటికీ అక్కడే ఉంటున్నారు. వారి భద్రత తో పాటు మన గ్రామం మన భాద్యత అన్న కనీస స్పృహ, చైతన్యం దిశగా మనం ఆలోచిద్దాం. మరో రెండు మూడు వారాలలో జరగబోయే పంచాయితీ ఎన్నికల్లో మన ఓటుతో క్రమశిక్షణ, వ్యక్తిత్వం, అభివృద్ధి కాంక్షించే నాయకత్వాన్ని ఎన్నుకుందాం. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే కదా అంతిమం, అవసరం.. జైహింద్.
Be the first to share your thoughts on this story!