ఎన్నికల భద్రతకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు – పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ అదహళ్లి
నరసరావుపేట.
పల్నాడు జిల్లాలో నవంబర్ 26వ తేదీ(గురువారం) జరగనున్న నరసరావుపేట మున్సిపల్, మొదటి విడత పంచాయతీ 7 మండలాలలో ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి, సూచించారు.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీస్ శాఖ తరఫున పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ప్రజలు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఓటర్లను బెదిరించడం, భయపెట్టడం, ప్రలోభాలకు గురిచేయడం లేదా ఓటు వేయకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే వారిపై నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
// నరసరావు పేట మున్సిపాలిటీ నందు
పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు //
పల్నాడు జిల్లా నరసరావు పేట మున్సిపాలిటీ పరిధి నందు జరుగనున్న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, ప్రత్యేక బలగాలను మోహరించినట్లు ఎస్పీ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా ఏర్పాట్లను ప్రత్యేకంగా పరిశీలించి, విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
మద్యం విక్రయాలపై ఆంక్షలు
ఎన్నికలు జరిగే నరసరావు పేట మున్సిపాలిటీ, మొదటి విడత పంచాయతీ 7 మండలాలు,72 పంచాయతీల పరిధిలో నవంబర్ 24వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 27వ తేదీ ఉదయం వరకు మద్యం దుకాణాలు తెరవడం, మద్యం విక్రయించడం నిషేధమని ఎస్పీ గారు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి మద్యం విక్రయాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
*లాడ్జిల యజమానులు అప్రమత్తంగా ఉండాలి*
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున లాడ్జిల యజమానులు తమ వద్దకు వచ్చే కొత్త వ్యక్తుల వివరాలను సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
*ఫిర్యాదులు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి*
ఎన్నికల సమయంలో ఓటర్లకు బెదిరింపులు ఎదురైనా,ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు లేదా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ కోరారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసేలా పోలీస్ శాఖ అన్ని అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటుందని ఎస్పీ స్పష్టం చేశారు.
Be the first to share your thoughts on this story!