అమరావతి అక్టోబర్ 09 రాజధాని వాయిస్ :
బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీయేనని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి స్వర్గీయ నందమూరి తారక రామారావు పునాదులు వేయగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ కార్యక్రమాలను కొనసాగించారని తెలిపారు. గతంలో జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు కుట్రలు పన్ని బీసీలకు అమలవుతున్న 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారని ఆరోపించారు. 1987లో నందమూరి తారక రామారావు బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో దేశంలోనే తొలిసారిగా 20 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారని గుర్తుచేశారు. 1996లో సీఎం చంద్రబాబు ఆ రిజర్వేషన్లను దాదాపు 34 శాతానికి పెంచి బీసీలకు ఆత్మస్థైర్యం కల్పించారని పేర్కొన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కూడా 34 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ వచ్చాయని తెలిపారు. 2019లో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా బీసీ రిజర్వేషన్లలో కోత విధించేందుకు జీవో విడుదల చేశారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఆ జీవోపై తనకు అనుకూలమైన వ్యక్తుల చేత కోర్టులో పిటిషన్లు వేయించి, ప్రభుత్వం తరఫున సరైన వాదనలు వినిపించకుండా, సమర్థులైన న్యాయవాదులను నియమించకుండా వ్యవహరించారని విమర్శించారు. తద్వారా బీసీలకు 24 శాతం రిజర్వేషన్లే మిగిలేలా చేసి వారి హక్కులను హరించారని అన్నారు.
34 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం :
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేశామని మంత్రి తెలిపారు. గతంలో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ చర్చించామని చెప్పారు. ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న సమయంలో జగరెడ్డి మళ్లీ కుట్ర పన్ని తనకు అనుకూలమైన వ్యక్తుల చేత కోర్టులో పిటిషన్లు వేయించారని ఆరోపించారు. రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలనే అంశంపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ప్రత్యేక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి సర్వే చేయించామని, ఆ కమిషన్ నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుందని చెప్పారు. నివేదికపై ప్రస్తుతం చర్చ జరుగుతోందని వివరించారు. ఇదిలా ఉండగా, స్థానిక సంస్థల పదవీకాలం ముగిసిందని, పదహారవ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి రావాలంటే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని కొల్లు రవీంద్ర తెలిపారు. దాదాపు రూ.12,500 కోట్ల ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి రావాలనే ఉద్దేశంతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే, మళ్లీ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.
ఎన్నికలు జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు :
హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసి అసలు ఎన్నికలే జరగకుండా చేయాలని ప్రయత్నించారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. రాష్ట్రానికి పదహారవ ఆర్థిక సంఘం నిధులు రాకూడదని, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని, బీసీల రిజర్వేషన్ హక్కులు అణగదొక్కాలనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు కోర్టును ఆశ్రయించారని విమర్శించారు. ఒకవైపు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో అవకతవకలు జరిగాయని మాట్లాడుతున్న వైసీపీ నాయకులు, మరోవైపు ‘సర్’ నివేదిక వచ్చే వరకు ఎన్నికలు నిర్వహించకూడదంటూ కోర్టులను ఆశ్రయిస్తున్నారని అన్నారు. వైసీపీ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనించాలని కోరారు. రాష్ట్రానికి రూ.12,500 కోట్ల నిధులు వస్తే ప్రజలకు మౌలిక వసతులు కల్పించవచ్చని, తద్వారా రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అదే సమయంలో బీసీల రిజర్వేషన్ హక్కులను అణగదొక్కేందుకు ప్రయత్నించడం, ఆ పేరుతో ఎన్నికలు జరగకుండా అడ్డుకోవాలని చూడటం జరుగుతోందని విమర్శించారు. రోజురోజుకీ వైసీపీ రాజకీయంగా దిగజారిపోతోందని, పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉందని ఆ పార్టీ సర్వేలు సూచిస్తున్నాయని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. అభ్యర్థులు దొరకరనే భయంతోనే ఎన్నికలను ఆపేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లను అణగదొక్కడం, ఆర్థిక సంఘం నిధులు రాకుండా చేయడమే వారి ప్రయత్నమని అన్నారు.
గ్రామీణ వ్యవస్థను వైసీపీ నాశనం చేసింది :
గత ఐదేళ్లలో రాష్ట్ర గ్రామీణ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా సర్వనాశనం చేసిందని కొల్లు రవీంద్ర విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండున్నర సంవత్సరాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, సస్కి నిధులతోనూ పనులు చేపడుతున్నామని తెలిపారు. ఇటీవల ఉపాధి హామీకి సంబంధించిన పనులతో పాటు జీరాంజీ పనుల కింద రూ.11,500 కోట్లను తీసుకురావడం జరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూ.5,500 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.5,500 కోట్లు అందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొందని వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జగన్ రెడ్డికి ఇష్టం లేదని, ప్రజలు ఆనందంగా ఉండటాన్ని ఆయన చూడలేకపోతున్నారని విమర్శించారు. గత ఐదేళ్లలో కుట్రలతో రాష్ట్రాన్ని నాశనం చేశారని, ఇప్పుడు కూడా ఏదో ఒక రూపంలో రాష్ట్రాన్ని పట్టిపీడించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
బీసీల ఎదుగుదలను అడ్డుకున్నారని ఆరోపణ :
రాజశేఖర్ రెడ్డి, రాజా రెడ్డి కాలం నుంచి బీసీల పట్ల ఒకరకమైన వ్యతిరేక ఆలోచనా ధోరణి ఉందని కొల్లు రవీంద్ర ఆరోపించారు. బీసీలు ఎదిగితే తమకు రాజకీయంగా అడ్డంకి అవుతారనే భావనతోనో, బీసీలు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారనే కక్షతోనో వ్యవహరించారని విమర్శించారు. గతంలో జింకా వెంకట నరసయ్యకు సంబంధించిన గనిని ఆక్రమించుకుని, ఆయనను హత్య చేశారని ఆరోపించారు. ఆయన పునాదుల మీద నుంచి ఎదిగిన బీసీ నాయకుడి కుటుంబమే రాజశేఖర్ రెడ్డి కుటుంబమని వ్యాఖ్యానించారు. ఆ కుటుంబం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రంలో బీసీలను అణగదొక్కే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. రిజర్వేషన్ల నుంచి మొదలుకొని, అప్పట్లో బీసీ నాయకులుగా ఉన్నవారిపై కేసులు పెట్టి జైళ్లకు పంపించడం, అనేక మందిని హత్య చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. తోట చంద్రయ్యను నడిరోడ్డుపై గొంతు కోసి హత్య చేయడం, నందం సుబ్బయ్య, అమర్నాథ్ గౌడ్లపై పెట్రోల్ పోసి తగలబెట్టడం వంటి ఘటనలను రాష్ట్ర ప్రజలు మర్చిపోతారని అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. ఆస్తులను దౌర్జన్యంగా లాక్కోవడం వంటి ఘటనలు కూడా జరిగాయని అన్నారు. ఇన్ని కుట్రలకు పాల్పడ్డారని తాము ఆరోపిస్తున్న వ్యక్తులు, వైసీపీ నాయకులు ఈరోజు కల్లబొల్లి మాటలు చెబుతూ రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తే బీసీ సోదరులు నమ్మరని కొల్లు రవీంద్ర అన్నారు.
బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తున్నాం :
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లను పేరుకే ఏర్పాటు చేసి, కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేకుండా చేసిందని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అన్ని కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తోందని తెలిపారు. వాటిని సమర్థవంతంగా నడిపించడం, బీసీలను ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం అవసరమైన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఇటీవల నాయీ బ్రాహ్మణ సోదరులకు ఉచిత విద్యుత్ అందించామని, చేనేత కార్మికులకు నేతన్నల సేవలో, మత్స్యకారులకు మత్స్యకార సేవ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించామని, మైనింగ్‌లో వడ్డెర సోదరులకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. ఈ విధంగా అన్ని బలహీన వర్గాలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైసీపీ చేసిన కుట్రల కారణంగా 16,800 మంది బీసీలు రాజ్యాంగబద్ధమైన పదవులకు అవకాశాలను కోల్పోయారు.
చట్టపరంగా రిజర్వేషన్ల అమలుకు చర్యలు :
బీసీ కమిషన్ ఇచ్చే నివేదికను చట్టపరంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నామని కొల్లు రవీంద్ర తెలిపారు. రాబోయే కాలంలో స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు 34 శాతం కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారిని నిలబెట్టుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో చట్టపరంగా ఈ రిజర్వేషన్లను అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేశారు. గతంలో అవకాశం ఉన్నప్పటికీ కేంద్రంలో బీసీల కోసం మీ తండ్రి గారు గానీ, మీరు గానీ ఏమీ చేయలేదని వైసీపీ నాయకులను ఉద్దేశించి విమర్శించారు. ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వారు చేసిన కుట్రలను రాష్ట్ర ప్రజలు మర్చిపోరని వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం, బలహీన వర్గాల కోసం, అభివృద్ధి కోసం నిబద్ధతతో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు.
ఎన్నికలను వాయిదా వేయించేందుకు అన్ని ప్రయత్నాలు :
వైసీపీ ఎన్నికలు జరగకుండా చేయాలని ప్రయత్నిస్తోందని కొల్లు రవీంద్ర ఆరోపించారు. రిజర్వేషన్ల పేరుతో రిజర్వేషన్లు రాకుండా చేయడం, ఎన్నికల ప్రక్రియను సాగదీయడం వారి ఉద్దేశమని విమర్శించారు. హైకోర్టు నిర్ణయం ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టులోనూ ఈ వ్యవహారాన్ని వాయిదా వేయాలని కోరుకున్నారని, ఎన్నికలు జరగకుండా ఉండాలన్నదే వారి లక్ష్యమని అన్నారు. ‘‘సర్’’ కార్యక్రమానికి, బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, ఒకవైపు ఆ కార్యక్రమంపై విమర్శలు చేస్తూ, మరోవైపు దానికి సంబంధించిన ఓటరు జాబితాలు వచ్చే వరకు ఎన్నికలను ఆపాలని కోరుతున్నారని అన్నారు. దీని వెనుక రాష్ట్రానికి రావాల్సిన రూ.12,500 కోట్ల పదహారవ ఆర్థిక సంఘం నిధులను అడ్డుకోవాలనే కుట్ర ఉందని ఆరోపించారు. ఎన్నికలు జరగకుండా చేయడం ద్వారా వైసీపీ నాయకులను కాపాడుకోవచ్చని ఆ పార్టీ భావిస్తోందని విమర్శించారు. ఆ పార్టీ నుంచి చాలామంది బయటకు వస్తున్నారని, రాజకీయంగా దూరమవుతున్నారని తెలిపారు. జగన్ రెడ్డి పోకడ, విధానం నచ్చక చాలామంది బహిరంగంగానే మాట్లాడుతున్నారని అన్నారు. ఈ పరిణామాలను తప్పించుకోవడానికి, ఎన్నికలను వాయిదా వేయించడానికి అన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ వైసీపీ విఫలమైందని పేర్కొన్నారు.
బీసీలకు 50 శాతం పదవులు ఇచ్చామన్న వాదనపై విమర్శ :
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు 50 శాతం పదవులు ఇచ్చామని వారు చెబుతున్నారని పేర్కొన్నారు. బీసీలకు హక్కుగా రావాల్సిన పదవులను ఇచ్చి, తామే 50 శాతం పదవులు ఇచ్చామని చెప్పడాన్ని ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. బీసీ కార్పొరేషన్లలో సంబంధిత సామాజిక వర్గాలకు చెందినవారికే పదవులు ఇస్తారని, వాటిని ఇచ్చి బీసీలకు 50 శాతానికి పైగా పదవులు ఇచ్చామని చెప్పడం సరికాదన్నారు. రాష్ట్రంలోని బీసీ వర్గాలు ఈ వాదనను నమ్మే పరిస్థితిలో లేవని వ్యాఖ్యానించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క కార్పొరేషన్‌కు కూడా నిధులు ఇవ్వలేదని, ఒక్క బీసీ సోదరుడు కూడా ఆర్థికంగా పైకి వచ్చిన పరిస్థితి లేదని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కులను ఏర్పాటు చేస్తూ యువతకు, బలహీన వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. బీసీలు ఆర్థిక అభివృద్ధిని కోరుకుంటారని, ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తుంటే వారు చూస్తూ ఊరుకోరని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
Be the first to share your thoughts on this story!