గుంటూరు. ఆగస్టు 29
నగర పరిధిలోని శిల్పారామం - పెదపలకలూరు వరకు చేపడుతున్న మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్–3 రహదారి అభివృద్ధి పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, స్థానిక నాయకులతో కలిసి పనుల పురోగతిని శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, శిల్పారామం నుంచి పెదపలకలూరు వరకు సుమారు 4.25 కిలోమీటర్ల మేర ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ – 3 పనులను చేపడుతున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టును గతంలోనే ప్రారంభించాలనే ఆలోచన ఉన్నప్పటికీ, వైసీపీ హయాంలో పనులు ముందుకు సాగలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, స్థానిక నాయకుల సహకారంతో రహదారి పరిధిలోని ఆక్యుపెంట్లను రిహాబిలిటేట్ చేసి, సమస్యలను పరిష్కరించి పనులకు మార్గం సుగమం చేశామని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో ఈ పనులకు రూ.48 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించేందుకు వచ్చామని, పనుల్లో ఎదురవుతున్న సమస్యలను కూడా సంబంధిత అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. రహదారి నిర్మాణంలో కొన్ని ప్రాంతాల్లో హైట్ పెరగడంతో High Tension Wiresను మార్చాల్సిన అవసరం ఏర్పడిందని, ఇందుకు అదనంగా సుమారు రూ. 2 - 3 కోట్ల వ్యయం అయ్యే అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా NSP Canal క్రాసింగ్స్ వద్ద భవిష్యత్తులో నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా అదనపు కల్వర్టులు నిర్మించాల్సిన అవసరం ఉందని, ఒక్కో కల్వర్టుకు సుమారు రూ.10 - 15 లక్షల అదనపు వ్యయం అవుతుందని తెలిపారు.
భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రస్తుత ప్రాజెక్టులోనే వీలైనంత వరకు ఈ అదనపు పనులు చేపట్టాలని కాంట్రాక్టర్‌ను కోరినట్లు తెలిపారు.
*పేరేచర్ల జంక్షన్ వరకు విస్తరణకు ప్రతిపాదన*
ప్రస్తుత ఇన్నర్ రింగ్ రోడ్‌ను భవిష్యత్తులో కొత్తగా నిర్మించనున్న Railway Over Bridge మీదుగా పేరేచర్ల జంక్షన్ వరకు విస్తరించాల్సిన అవసరం ఉందని డా. పెమ్మసాని తెలిపారు. ఈ విస్తరణ పూర్తయితే పల్నాడు ప్రాంతం నుంచి వచ్చే ప్రజలకు ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా నేరుగా అమరావతికి మెరుగైన కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
ఈ అదనపు విస్తరణకు సుమారు రూ.15 - 20 కోట్ల అదనపు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నామని, ఇందుకు ముఖ్యమంత్రి కి ఇప్పటికే లేఖ రాసినట్లు తెలిపారు. అయితే ఈ అదనపు పనులకు ఇంకా ఆమోదం లభించలేదని స్పష్టం చేశారు. రహదారికి అవసరమైన డ్రైనేజ్ కవర్లు, సెంటర్ లైటింగ్ వంటి అదనపు సదుపాయాలకు కూడా అదనపు అంచనాలు అవసరమవుతున్నాయని పేర్కొన్నారు.
*ఇన్నర్ రింగ్ రోడ్డుతో ప్రాంతీయ అభివృద్ధికి ఊతం*
ఇన్నర్ రింగ్ రోడ్ అభివృద్ధి పూర్తయిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని తెలిపారు. ఇప్పటికే గత ఐదు - ఆరు నెలల్లో కొత్త అపార్ట్‌మెంట్లు, ఇతర నిర్మాణాలు రావడం ప్రారంభమయ్యాయని, దీంతో ఈ ప్రాంతంలోని భూముల విలువలు కూడా పెరుగుతున్నాయని చెప్పారు.రాబోయే రెండు - మూడు సంవత్సరాల్లో అభివృద్ధి కార్యకలాపాలు మరింత పెరిగితే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఆదాయం పెరగడంతో పాటు CRDA ద్వారా కూడా మరిన్ని అభివృద్ధి అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో, కార్పొరేషన్ మరియు CRDA వనరులను సమన్వయం చేసుకుంటూ ఇన్నర్ రింగ్ రోడ్‌ను సాధ్యమైనంత అద్భుతంగా పూర్తి చేసి, గుంటూరు నగరంతో పాటు అమరావతి, పల్నాడు ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ కల్పించేందుకు కృషి చేస్తామని డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
0 Comments