Saturday, 29 August 2026
Telugu Daily
Header
BREAKING

పి.జి పరీక్ష ఏర్పాట్లను సమీక్షించిన డి.ఆర్.ఓ

 గుంటూరు, ఆగస్టు 29 

 జిల్లాలో NEET-PG–2026 పరీక్షను  ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి అన్నారు. నీట్ పరీక్షలకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షకు అభ్యర్థులు ఆరు కేంద్రాల్లో హాజరుకానున్నారని చెప్పారు. 
ఈ నెల 30వ  తేదీన ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారని, అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు ఉదయం 7.00 గంటల నుంచి అనుమతించడం జరుగుతుందని తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద తగినంత పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అన్నారు. మినియేచర్ స్పై కెమెరాలు, కెమెరా కలిగిన కళ్లద్దాలు, ఇయర్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరికరాలు, చిట్స్, నోట్స్, పేపర్లు తదితర నిషేధిత వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురాకుండా కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టాలని సూచించారు.ఆన్‌లైన్ పరీక్షల సమగ్రత, గోప్యతను కాపాడేందుకు సైబర్ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, పరీక్షా కేంద్రాలకు సమీపంలోని సైబర్ పోలీస్ స్టేషన్ల ద్వారా సైబర్ ముప్పులను పర్యవేక్షించాలని తెలిపారు.
పరీక్షా కేంద్రాల్లో పరీక్ష ప్రారంభానికి రెండు గంటల ముందుగానే నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల పరిసరాలు, ప్రవేశ ద్వారాలు, పరీక్షా గదులు, టేబుళ్లు, కుర్చీలు, మరుగుదొడ్లు, వాష్‌బేసిన్లు, నీటి ప్రదేశాలు, పరికరాలు, లిఫ్టులు తదితర ప్రాంతాలను పూర్తిగా శానిటైజ్ చేయాలని సూచించారు.
అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకునేలా APSRTC బస్సులను అవసరమైన మేరకు నడపాలని, పరీక్ష అనంతరం అభ్యర్థులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు తిరుగు ప్రయాణానికి కూడా తగిన బస్సు సౌకర్యం కల్పించాలని తెలిపారు.అన్ని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన వైద్య అత్యవసర సేవలతో పాటు తగిన సంఖ్యలో ANMలను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు భంగం కలగకుండా భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023లోని సెక్షన్ 163ను అమలు చేయడంతో పాటు, పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలోని జిరాక్స్ కేంద్రాలు, నెట్ సెంటర్లను పరీక్ష సమయంలో మూసివేయించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత తహసీల్దార్లను ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ (LAN) సక్రమంగా ఉండేలా కళాశాలల చీఫ్ సూపరింటెండెంట్లు ముందస్తు ఏర్పాట్లు చేయాలని, సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు పరీక్షా కేంద్రాలను ముందుగానే పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
Share this Article:

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!