Tuesday, 20 October 2026
Header1
BREAKING

పంట నష్టాలపై తక్షణ సర్వే.. దెబ్బతిన్న రోడ్లకు అత్యవసర మరమ్మతులు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 అమరావతి
📅 ప్రచురణ: 25 Sep 2026, 11:59 AM
🔄 నవీకరణ: 25 Sep 2026, 08:57 PM
👁️ 120 views

⭐ Key Highlights / ముఖ్యాంశాలు

- నీరు నిలిచిన పొలాల్లో పంటల రక్షణకు చర్యలు చేపట్టాలి - వర్షపు నీటిని సంరక్షించి.. సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించాలి - ఉన్నతాధికారులు, మూడు జిల్లాల కలెక్టర్లతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్ష

అమరావతి, సెప్టెంబర్‌ 25: రాజధాని వాయిస్: 

తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల నష్ట వివరాలను సేకరించి, అత్యవసర పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. భారీ వర్షాల ప్రభావం, తక్షణం చేపట్టాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బూడితి రాజశేఖర్‌, వ్యవసాయ శాఖ కమిషనర్‌ జిలానీ, ఉద్యాన శాఖ కమిషనర్‌ శ్రీనివాసులు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌, మత్స్యశాఖ కమిషనర్‌ తదితర ఉన్నతాధికారులతో మంత్రి ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అలాగే పార్వతీపురం మన్యం, డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌లో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించి, సహాయక చర్యలు, మౌలిక సదుపాయాల పునరుద్ధరణపై దిశానిర్దేశం చేశారు.

WhatsApp Image 2026-09-25 at 11.55.34 AM (1).jpeg

వ్యవసాయ, ఉద్యాన పంటలకు జరిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో వెంటనే సర్వే చేపట్టి, నష్ట వివరాల నమోదు (ఎన్యూమరేషన్‌) ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పొలాల్లో నీరు నిలిచిన ప్రాంతాలను సంబంధిత అధికారులు సందర్శించి, పంటల పరిస్థితిని పరిశీలించాలన్నారు. నిల్వ నీటిని తొలగించడం, అధిక తేమ వల్ల మరింత నష్టం వాటిల్లకుండా నివారించడం వంటి అంశాలపై రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు అందించాలని సూచించారు. పంటల రక్షణకు అనుసరించాల్సిన పద్ధతులపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

WhatsApp Image 2026-09-25 at 11.55.35 AM.jpeg
వర్షాలు, గాలులకు దెబ్బతిన్న రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల వివరాలను వెంటనే నమోదు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించే ముఖ్యమైన రహదారులను గుర్తించి, అత్యవసర మరమ్మతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన సహాయక, పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, ప్రస్తుతం కురుస్తున్న వర్షాల ద్వారా లభిస్తున్న నీటిని సాధ్యమైనంత మేర సంరక్షించుకోవాలని మంత్రి సూచించారు.
WhatsApp Image 2026-09-25 at 11.55.35 AM (1).jpeg
చెరువులు, జలాశయాలు, ఇతర నీటి వనరుల్లో నీటిని నిల్వ చేసి, భవిష్యత్తు సాగు, తాగునీటి అవసరాలకు సమర్థంగా వినియోగించుకునేలా పక్కా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు. పంటలకు హాని కలిగించే నిల్వ నీటిని తొలగిస్తూనే, అనువైన ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. నీటిని పొదుపుగా వినియోగించుకునే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన చర్యలను ఆలస్యం లేకుండా చేపట్టాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు. రైతులకు క్షేత్రస్థాయిలో మార్గదర్శనం అందించడం, ప్రజలకు అవసరమైన సహాయం చేరవేయడం, దెబ్బతిన్న సదుపాయాలను పునరుద్ధరించడం వంటి పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X