Tuesday, 20 October 2026
Header1
BREAKING

రెండేళ్లలో చిలకలూరిపేట – నకరికల్లు జాతీయ రహదారి

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 25 Sep 2026, 07:19 PM
🔄 నవీకరణ: 30 Sep 2026, 03:13 AM
👁️ 522 views
Story Highlights
  • భూములిచ్చే రైతులకు రూ.385 కోట్ల పరిహారం
  • ఆంధ్రా, తెలంగాణాల‌లో నాలుగు జిల్లాలకు కనెక్టివిటీ
  • ఇంధ‌న‌శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

నరసరావుపేట.(పల్నాడు జిల్లా) సెప్టెంబర్ 25 రాజధాని వాయిస్ :

రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుంద‌ని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా కేసనపల్లిలో., చిలకలూరిపేట – నకరికల్లు రెండో దశ జాతీయ రహదారి ప్రాజెక్టుకు సంబంధించి శుక్ర‌వారం జ‌రిగిన‌ భూమిపూజ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. ప్రాజెక్టు కోసం భూములు ఇస్తున్న రైతులకు రూ.385 కోట్ల పరిహారం చెల్లిస్తున్నామని ఆయ‌న‌ వెల్లడించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ, ఈ జాతీయ ర‌హ‌దారి ప్రాజెక్టుకు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.
బాపట్ల నుంచి చిలకలూరిపేట వరకు మొదటి దశ జాతీయ రహదారి పనులు ఇప్పటికే పూర్తయ్యాయని ఆయ‌న‌ చెప్పారు. ప్రస్తుతం రెండో దశలో భాగంగా చిలకలూరిపేట నుంచి నకరికల్ వరకు చేపట్టనున్న జాతీయ రహదారి నిర్మాణానికి భూమిపూజ చేశామని, ఈ పనులను రెండేళ్లలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి గుత్తేదారు సంస్థ‌తో పాటు అధికారుల‌కు కూడా స్ప‌ష్టమైన ఆదేశాలు జారీ చేశామ‌న్నారు.

రెండు రాష్ట్రాల ఆర్థిక, వ్యాపార కార్య‌క‌లాపాల‌కు ఊతం...

WhatsApp Image 2026-09-25 at 7.02.58 PM.jpeg

చిలకలూరిపేట – నకరికల్ రెండో దశ జాతీయ రహదారి పూర్తయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని నాలుగు జిల్లాలకు మెరుగైన రహదారి కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని మంత్రి గొట్టిపాటి చెప్పారు. దీనివల్ల ప్రజా రవాణా, సరకు రవాణా మరింత సులభతరం కావడంతో పాటు ప్రాంతాల మధ్య ఆర్థిక, వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు ఊతం లభిస్తుందన్నారు. నకరికల్ వరకు జాతీయ రహదారి అనుసంధానం పూర్తయితే భవిష్యత్తులో బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

మెరుగైన రహదారి సౌకర్యాలతో పర్యాటకుల రాకపోకలు పెరగడంతో స్థానికంగా పర్యాటక రంగానికి, యువ‌త‌కు ఉపాధి అవకాశాలకు అద‌న‌పు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం భూములు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న రైతులందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. భూసేకరణకు సంబంధించి రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పరిష్కరిస్తారని చెప్పారు. భూములకు సంబంధించిన సమస్యలను ప్రత్యేక గ్రీవెన్స్ ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వారికి ఆర్థిక లాభం చేకూరేలా అధికారులు చర్యలు తీసుకుంటారని ఆయ‌న‌ తెలిపారు.

ట్రాఫిక్ ఇబ్బందులు, ప్ర‌మాదాల‌కు చెక్...

జాతీయ రహదారులకు అనుసంధానంగా బైపాస్ రోడ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. బైపాస్ రోడ్డు నిర్మాణంతో నరసరావుపేటలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయని చెప్పారు. పట్టణ ప్రాంతాల మీదుగా వెళ్లే వాహనాల ఒత్తిడి తగ్గడంతో జాతీయ రహదారులపై ట్రాఫిక్ నియంత్రణలోకి రావడంతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా గ‌ణ‌నీయంగా తగ్గే అవకాశం ఉంటుందని ఆయ‌న‌ పేర్కొన్నారు.

చిలకలూరిపేట – నకరికల్ రెండో దశ జాతీయ రహదారి ప్రాజెక్టును నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థతో పాటు సంబంధిత అధికారులను ఇప్ప‌టికే కోరినట్లు మంత్రి తెలిపారు. ప్రాజెక్టు పనుల్లో వేగంతో పాటు నాణ్యతకు అధిక‌ ప్రాధాన్యం ఇవ్వాలని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశామ‌న్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సంజన శ్రీహర్షతో పాటు పలువురు అధికారులు, కూటమి నేతలు, రైతులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X