Wednesday, 04 November 2026
Header1
BREAKING

తుపాను బాధిత రైతులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 04 Nov 2026, 07:59 PM
👁️ 14 views

⭐ Key Highlights / ముఖ్యాంశాలు

పంట నష్టాన్ని అంచనా వేసి ఆర్థిక సాయం అందిస్తాం: మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ పునరుద్ధరణకు బుధవారం సాయంత్రం వరకు గడువు కర్ణాటక, తమిళనాడు నుంచి 2 వేల మందికి పైగా విద్యుత్ సిబ్బంది రాక


చిలకలూరిపేట / అద్దంకి / బాపట్ల, నవంబర్ 4:రాజధాని వాయిస్ 
మురసు తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ ఇచ్చారు. తుపాను ప్రభావంతో పంటలు, ఆస్తులు, విద్యుత్ వ్యవస్థకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు బుధవారం పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రాంతంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి తో కలిసి పర్యటించిన మంత్రి తుపాను కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పంట నష్టాన్ని అంచనా వేయాలని, అర్హులైన ప్రతి రైతును గుర్తించాలని ఆదేశించారు. నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు.
ముందస్తు చర్యలతో ప్రాణనష్టం నివారణ
అనంతరం అద్దంకిలో పర్యటించిన మంత్రి తుపాను ప్రభావం, విద్యుత్ పునరుద్ధరణ పనుల పురోగతిని సమీక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ముందస్తుగా చేపట్టిన చర్యలు, వివిధ శాఖల సమన్వయంతో ప్రాణనష్టం జరగకుండా నివారించగలిగామని తెలిపారు.
తుపాను రాకకు రెండు రోజుల ముందుగానే విద్యుత్ సిబ్బంది, అవసరమైన సామగ్రి, అత్యవసర పునరుద్ధరణ పరికరాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లిందని, గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు.
విద్యుత్ పునరుద్ధరణకు 3 వేల మందికి పైగా సిబ్బంది
విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 2 వేల మందికి పైగా విద్యుత్ సిబ్బందిని రప్పించినట్లు మంత్రి తెలిపారు. వీరితో పాటు ఏపీఎస్పీడీసీఎల్‌కు చెందిన మరో వెయ్యి మంది సిబ్బందిని ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పనుల కోసం నియమించినట్లు వెల్లడించారు.
చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసే లైన్‌మెన్ల వరకు అందరూ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారని తెలిపారు. తెగిపోయిన విద్యుత్ తీగలు, దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర కీలక విద్యుత్ పరికరాల మరమ్మతులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
బుధవారం సాయంత్రం నాటికి విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని అధికారులకు గడువు విధించారు. మరమ్మతుల్లో పాల్గొంటున్న సిబ్బంది భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన చోట అదనపు సిబ్బంది, సామగ్రిని సమకూర్చాలని సూచించారు.
కర్ణాటక, తమిళనాడు సిబ్బందికి మంత్రి అభినందనలు
తదుపరి బాపట్ల జిల్లా పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో మంత్రి పర్యటించి విద్యుత్ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. పర్చూరులో కర్ణాటకలోని గుల్బర్గా నుంచి వచ్చిన విద్యుత్ సిబ్బందితో మాట్లాడి వారి సేవలను అభినందించారు.
చీరాలలో తమిళనాడు నుంచి వచ్చిన విద్యుత్ సిబ్బంది చేపడుతున్న పనులను పరిశీలించి వారితో మాట్లాడారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి క్లిష్ట పరిస్థితుల్లో సేవలందిస్తున్న సిబ్బంది అంకితభావం అభినందనీయమని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో రాష్ట్రాల మధ్య సహకారం, ప్రజాసేవా స్ఫూర్తికి వారి సేవలు నిదర్శనమని కొనియాడారు.
తుపాను బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
మురసు తుపాను కారణంగా నష్టపోయిన రైతులు, ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. నష్టాల అంచనా అనంతరం అర్హులైన రైతులు, బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సహాయక చర్యలు, విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య తదితరులు మంత్రితో పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X