నరసరావుపేట.
నవంబర్ 4
పల్నాడు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నవంబర్ 5వ తేదీన నిర్వహించనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది.
జిల్లాలో మొత్తం 10 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా, వీటికి 31 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే 419 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, 382 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి; మిగిలిన 37 స్థానాలకు 88 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల పరిధిలో మొత్తం 4,60,775 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 576 పోలింగ్ కేంద్రాలను గుర్తించగా, వీటిలో 176 సున్నిత, 273 అతి సున్నిత కేంద్రాలుగా తేల్చారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు, మొత్తం 288 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం కల్పించారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ పెట్టెలు, పోలింగ్ సామగ్రిని పూర్తిగా సిద్ధం చేశారు. పోలింగ్ విధుల నిర్వహణకు 29 మంది రిటర్నింగ్ అధికారులు, 31 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు, 691 మంది ప్రిసైడింగ్ అధికారులు, 2935 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. వీరితో పాటు 22 మంది జోనల్ అధికారులు, 176 మంది సూక్ష్మ పరిశీలకులను కేటాయించి, ఇప్పటికే వారికి శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బంది, సామగ్రి తరలింపునకు 153 వాహనాలను ఏర్పాటు చేయగా, జిల్లాలోని 11 పంపిణీ కేంద్రాల ద్వారా సామగ్రిని సిబ్బందికి అందజేస్తున్నారు.
పోలింగ్ అనంతరం బ్యాలెట్ పెట్టెలను భద్రపరిచేందుకు, ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు స్థానిక పెట్లూరివారిపాలెంలోని ఏఎం రెడ్డి కాలేజీ వద్ద కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ 153 కౌంటింగ్ టేబుల్స్, 87 మంది సూపర్ వైజర్లు, 213 మంది కౌంటింగ్ సిబ్బందిని కేటాయించి కౌంటింగ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోరారు. ప్రజలందరూ పెద్దఎత్తున ముందుకు వచ్చి తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా విజ్ఞప్తి చేశారు.
Be the first to share your thoughts on this story!