నక్కపల్లి, అక్టోబర్ 27:- రాజధాని వాయిస్ :
అర్నబ్ తుపాను నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత జోరువానలో పాయకరావుపేట నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాల్లో పర్యటించారు. యస్.రాయవరం మండలం రేవుపోలవరం, నక్కపల్లి మండలం బోయపాడు గ్రామాల్లో తుపాను ముందస్తు చర్యలను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి, అక్కడి ఏర్పాట్లు, ప్రజలకు కల్పిస్తున్న వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
*పునరావాస కేంద్రాల్లో వసతులపై ఆరా*
రేవుపోలవరం గ్రామంలోని పునరావాస కేంద్రంలో స్థానికులతో మాట్లాడిన హోంమంత్రి అనిత.. తుపాను నేపథ్యంలో వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా లేదా అని అధికారులను ఆరా తీశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అనంతరం రేవుపోలవరం తీరానికి చేరుకున్న మంత్రి మత్స్యకారులతో మాట్లాడారు. తుపాను తీవ్రత, బలమైన గాలుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరారు.
*బోయపాడు తుపాను రక్షణ భవనంలో పునరావాస కేంద్రం పరిశీలన*
నక్కపల్లి మండలం బోయపాడు గ్రామంలో తుపాను రక్షణ భవనంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని హోంమంత్రి పరిశీలించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల భద్రత కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, తుపాను సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తుపాను తీరాన్ని దాటే సమయంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
*కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన మంత్రి*
నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను హోంమంత్రి అనిత సందర్శించారు. తుపాను పరిస్థితులు, అధికార యంత్రాంగం చేపడుతున్న ముందస్తు చర్యలను పరిశీలించి, అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు. తీర ప్రాంత గ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. తుపాను ప్రభావం తగ్గే వరకు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజలంతా అధికారుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, అనవసరంగా బయటకు రావద్దని హోంమంత్రి అనిత విజ్ఞప్తి చేశారు.
Be the first to share your thoughts on this story!