గుంటూరు, నవంబర్ 2:
మురసు తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ తెలిపారు.
సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో తుపాను పరిస్థితులు, జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలను వివరించారు.
తుపాను ప్రభావంతో ఈరోజు(సోమవారం) జిల్లాలో సుమారు 2.5 సెం.మీ., రేపు(మంగళవారం) 3.5 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఈరోజు మధ్యాహ్నం నుంచి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో, రేపు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. తుపాను కావలి, ఒంగోలు మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
వర్షపు నీటి నిల్వకు వీలుగా కాలువల డిశ్చార్జిని తగ్గించడంతో పాటు పూడికతీత పనులు పూర్తి చేశామని తెలిపారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాలు, ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్న తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదని సూచించారు.
లోతట్టు ప్రాంతాల్లోని 17 గ్రామాలను గుర్తించి 64 గ్రామీణ సహాయ పునరావాస కేంద్రాలను, పట్టణ ప్రాంతాల్లో 21 కాలనీలకు సంబంధించి 19 సహాయ కేంద్రాలను సిద్ధం చేశామని తెలిపారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరిచి, క్లోరినేషన్ చేయడంతో పాటు విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే వినియోగించేందుకు జనరేటర్లు, డీజిల్, సిబ్బందిని సిద్ధంగా ఉంచామని వివరించారు.
ప్రజలు చెరువులు, కాలువలు, నదులు, ఇతర నీటి వనరుల వద్దకు వెళ్లరాదని, పిల్లలను బయటకు పంపకుండా ఇళ్లలోనే సురక్షితంగా ఉంచాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడల సమీపంలో ఉండరాదని తెలిపారు. రైతులు, ఉద్యానవన రైతులు సంబంధిత శాఖల అధికారులు జారీ చేసిన సూచనలు పాటించాలని, పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో కట్టరాదని కోరారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు మండల, ఆర్డీఓ స్థాయి కంట్రోల్ రూమ్‌లు, పోలీస్ కంట్రోల్ రూమ్ లేదా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించి సహాయం పొందవచ్చని తెలిపారు.
తుపాను పరిస్థితులు పూర్తిగా చక్కబడే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా యంత్రాంగానికి సహకరించి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశం లో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్ ఎస్ కె ఖాజావలి పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!