మాచర్ల. అక్టోబర్ 17 రాజధాని వాయిస్ :
ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ నేతలు ఇతర రాష్ట్రాల నుంచి అసాంఘిక శక్తులను రప్పించి రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో ఘర్షణలకు పాల్పడి, ఆ నెపాన్ని ప్రత్యర్థులపైకి నెట్టే సంస్కృతి ఆ పార్టీకి మొదటినుంచీ అలవాటేనని ఆయన విమర్శించారు. గతంలో జరిగిన ఘటనల తరహాలోనే ప్రస్తుతం కూడా రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని ఆరోపించారు. బెంగళూరు వేదికగా కుట్రలు పన్నుతూ తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి రాష్ట్రంలో అలజడులు రేపే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు పక్క రాష్ట్రాల నుంచి మారణాయుధాలతో వ్యక్తులను మోహరిస్తున్నారని, ఆ క్రమంలోనే పంజాబ్‌కు చెందిన కొందరిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. కూటమి కార్యకర్తలపై దాడులు చేయడం, వాహనాలు ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడి, తిరిగి ప్రభుత్వంపై బురదజల్లే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే పద్ధతి ఇకపై సాగదని, అటువంటి చర్యలను ప్రజలు తిప్పికొడతారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Be the first to share your thoughts on this story!