కళాశాలను ఏర్పాటు చేసింది టీడీపీ.. నిర్వీర్యం చేసింది వైసీపీ
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వచ్చిన సమస్యకు కూటమి ప్రభుత్వాన్ని ఎలా నిందిస్తారు?
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
2024 ఆగస్టు నాటికి పూర్తికావాల్సిన నిర్మాణ పనులు గత ప్రభుత్వ హయాంలో పూర్తి కాలేదని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు కూడా ముందుకు సాగలేదని తెలిపారు. పెండింగ్ బిల్లులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరించిందని స్పష్టం చేశారు. గరివిడి వెటర్నరీ కళాశాలలో మౌలిక వసతుల విషయంలో ఎలాంటి ప్రధాన లోపాలు లేవని తాజా వీసీఐ పరిశీలన స్పష్టం చేసిందని అచ్చెన్నాయుడు తెలిపారు. వీసీఐ జూలై 27, 28 తేదీల్లో కళాశాలను తనిఖీ చేసిందని, భవనాలు, ప్రయోగశాలలు, ఇతర మౌలిక వసతులు సంతృప్తికరంగా ఉన్నాయని నివేదికలో పేర్కొన్నట్లు తెలిపారు. ఒక వెటర్నరీ కళాశాలకు వీసీఐ అనుమతులు రావాలంటే ఎలాంటి ప్రమాణాలు పాటించాలో మీకు తెలుసా? ఐదేళ్లలో కళాశాలకు అవసరమైన ల్యాబ్ పరికరాలు సమకూర్చారా? మౌలిక సదుపాయాలు కల్పించారా? అవసరమైన భవనాలు నిర్మించారా? కనీసం ఒక్క బోధనా పోస్టునైనా భర్తీ చేశారా? కేవలం 4 ప్రొఫెసర్లు, 8మంది అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత కారణంగానే అనుమతి నిరాకరించబడిందని తెలిపింది. ఇది కూడా వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఏర్పడిన సమస్య కాదా? అని మంత్రి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైన ప్రయోగశాల పరికరాలు సమకూర్చడంతో పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, క్లినికల్ కాంప్లెక్స్, బాలురు, బాలికల వసతిగృహాల నిర్మాణ పనులను పూర్తి చేసిందన్నారు. వీసీఐ ప్రమాణాలకు అనుగుణంగా దాదాపు 99 శాతం మౌలిక వసతుల పనులు పూర్తయ్యాయని తెలిపారు.
కళాశాలలో సిబ్బంది కొరతను పూర్తిగా పరిష్కరించేందుకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కలిపి మొత్తం 253 బోధనా పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి పొందామని మంత్రి తెలిపారు. ఇప్పటికే వీసీఐ సూచనల మేరకు కాంట్రాక్ట్ అధ్యాపకులను నియమించి మొత్తం బోధనా సిబ్బంది సంఖ్యను 77కు పెంచామని చెప్పారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల రెగ్యులర్ నియామక ప్రక్రియలో ఆలస్యం జరిగిందని, అయితే ఆరు నెలల్లో నియామక ప్రక్రియను పూర్తి చేసి వీసీఐ అనుమతులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటం గత ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మంత్రి మండిపడ్డారు. గత పాలనలో వదిలివేసిన సమస్యలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోందన్నారు. తాము చేసిన తప్పులకు కూడా కూటమి ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తే ప్రజలు నమ్ముతారని వైసీపీ నేతలు భావించవద్దని హెచ్చరించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, ఎవరు ఏం చేశారో ప్రజలకు తెలుసన్నారు. గరివిడి వెటర్నరీ కళాశాలకు వీసీఐ అనుమతుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అవసరమైన బోధనా సిబ్బంది నియామకాలను పూర్తి చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. ఇకనైనా వైసీపీ నేతలు విమర్శలు చేసే ముందు తమ ఐదేళ్ల పాలనను ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు.
Be the first to share your thoughts on this story!