మాచర్ల అక్టోబర్ 02 రాజధాని వాయిస్ :
మాచర్ల పట్టణ ప్రజలకు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకుడు యాగంటి మల్లికార్జునరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఒక వ్యక్తి మాత్రమే కాదని, సత్యం, అహింస అనే సిద్ధాంతాలతో దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి మార్గనిర్దేశం చేసిన మహనీయుడని పేర్కొన్నారు.
గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలు నేటి సమాజానికి కూడా ఆదర్శప్రాయమని అన్నారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాలు అభివృద్ధి చెందడం, పేదలకు సంక్షేమం అందడం, సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరడమేనని తెలిపారు.
గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని యాగంటి మల్లికార్జునరావు పేర్కొన్నారు. మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వరికపూడిశెల ప్రాజెక్టు, అమృత్ పథకం, జల్ జీవన్ మిషన్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మౌలిక వసతులు, తాగునీటి సదుపాయాలు మెరుగుపడే అవకాశం ఉందన్నారు.
గాంధీజీ పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని మాచర్ల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ఉండి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
గాంధీ జయంతి సందర్భంగా ప్రజలంతా సత్యం, అహింస, పరిశుభ్రత, సామాజిక ఐక్యత వంటి విలువలను ఆచరిస్తూ మాచర్లను అభివృద్ధికి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేయాలని యాగంటి మల్లికార్జునరావు పిలుపునిచ్చారు.
Be the first to share your thoughts on this story!