మాచర్ల: సెప్టెంబర్ 09 రాజధాని వాయిస్ :
పాత్రికేయ రంగంలోకి అనుభవం, అర్హతలు లేని కొందరు ప్రవేశించి మీడియా రంగానికి మచ్చ తెస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్టు అసోసియేషన్ (APIJA) అధ్యక్షులు, ఎం.ఆర్.ఆర్. న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ యం.రాజా ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని ఎం.ఆర్.ఆర్. న్యూస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నిత్యం ఎండా వానలను లెక్కచేయకుండా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ కష్టపడుతున్న వర్కింగ్ జర్నలిస్టులకు తగిన గౌరవం, గుర్తింపు దక్కడం లేదని రాజా పేర్కొన్నారు. మీడియా రంగానికి సంబంధించి కొన్ని నియమనిబంధనలు ఉన్నప్పటికీ, కొన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందన్నారు. చిన్న, పెద్ద పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్ ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా నెట్వర్క్ల ద్వారా ప్రసారమయ్యే వార్తా సమాచారంలో వాస్తవాలకు ప్రాధాన్యం ఇచ్చి, అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
నిజాయితీగా పనిచేస్తున్న జర్నలిస్టులకు గుర్తింపు, గౌరవం కల్పించకపోవడం పాత్రికేయ రంగానికి తీరని మచ్చగా మిగిలిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులకు అందాల్సిన వివిధ సంక్షేమ, ప్రయోజనాల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
జర్నలిస్టులకు బస్ పాస్, స్టేట్ బస్ పాస్, సెంట్రల్ రైల్వే పాస్, అసెంబ్లీ ఎంట్రీ పాస్, మీడియా గ్యాలరీ పాస్, టోల్గేట్ పాస్ వంటి సౌకర్యాలను అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టులకు అందించాలని డిమాండ్ చేశారు. మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు, వారి పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో 50 శాతం రాయితీ కల్పించే విధానం ఎన్ని జిల్లాల్లో అమలవుతోందో ప్రభుత్వం వెల్లడించాలని ప్రశ్నించారు.
అదేవిధంగా జర్నలిస్టు కుటుంబాల ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డుల మంజూరుపై స్పష్టమైన వివరాలు ఇవ్వాలని కోరారు. జర్నలిస్టుల ఇన్సూరెన్స్ పాలసీ గడువును ఐదేళ్లకు పెంచాలని, ప్రమాదవశాత్తు జర్నలిస్టు మృతి చెందితే రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టుల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని 50 సంవత్సరాలు దాటిన అర్హత కలిగిన జర్నలిస్టులకు నెలకు రూ.25 వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. జర్నలిస్టులు వృత్తిపరమైన అవసరాల కోసం వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు 50 శాతం సబ్సిడీ, వీడియో కెమెరాల కొనుగోలుపై కూడా 50 శాతం సబ్సిడీ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రతి అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేయాలని, కేవలం వెరిఫికేషన్లోని లోపాల కారణంగా నిజమైన జర్నలిస్టులకు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో పనిచేస్తున్న విలేకరులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాజా విజ్ఞప్తి చేశారు.
ఈ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించి, వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని APIJA అధ్యక్షుడు యం.రాజా కోరారు.
Be the first to share your thoughts on this story!