“పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, ధైర్యం, మానవత్వం ఎంతో కీలకం. పోలీసు యూనిఫాం ప్రజలకు భరోసా కల్పించేలా పనిచేయాలి. పోలీసు- అంటే భయం కాదు.. ప్రజలకు భరోసా అనే భావన ప్రజల్లో కలిగేలా ప్రతి ఒక్కరూ విధులు నిర్వర్తించాలి” అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, వైఎస్సార్ కడప జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్. సవిత నూతన పోలీసు కానిస్టేబుళ్లకు పిలుపునిచ్చారు. బాకరాపేటలోని ఏపీఎస్పీ 11వ బెటాలియన్ పోలీసు పరేడ్ మైదానంలో శనివారం 521 మంది నూతనంగా శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత హాజరుకాగా, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జి మంత్రి సవిత మాట్లాడుతూ, పోలీసు వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక అని అన్నారు. దీక్షాంత్ పరేడ్ కేవలం ఒక పరేడ్ మాత్రమే కాదని, శిక్షణార్థి నుంచి బాధ్యతాయుతమైన పోలీసు సిబ్బందిగా మారే కీలక ఘట్టమని అన్నారు. క్రమశిక్షణ, సమన్వయం, ఆత్మవిశ్వాసం, విధి పట్ల అంకితభావాన్ని చాటిన నూతన కానిస్టేబుళ్లు ఇకపై ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని దిశా నిర్దేశం చేశారు. 6,100 కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీలో అనేక అడ్డంకులను అధిగమించి నియామకాలు చేపట్టామని మంత్రి సవిత తెలిపారు. శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు ఇచ్చే నెలవారీ స్టైపెండ్‌ను రూ.4,500 నుంచి రూ.12 వేలకు పెంచామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 21 శిక్షణా కేంద్రాల్లో సుమారు 5,800 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోండి
ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలు, సాంకేతిక ఆధారిత నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వంటి కొత్త సవాళ్లు పోలీసుల ముందున్నాయని జిల్లా ఇన్చార్జి మంత్రిసవిత అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతోపాటు కొత్త చట్టాలపై నిరంతరం అవగాహన పెంచుకోవాలని సూచించారు. కాలానుగుణంగా.. పరిణతి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అలవర్చుకోవాలన్నారు. పోలీసు యూనిఫారంలో తన బిడ్డను చూడాలని, సమాజాన్ని రక్షించడంలో తమబిడ్డ కూడా ఒక బృహత్తర బాధ్యతను నిర్వహించేలా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. పౌరుషాలకు, ప్రేమాభిమానాలకు, ప్రాణాలకు ప్రాణాలు ఫణంగా పెట్టె స్వభావం ఉన్న ఈ రాయలసీమ గడ్డపై.. 11వ బెటాలియన్ లో ఉన్నతమైన ఆశయాలతో, ప్రజల్లో రక్షణపై విశ్వాసాన్ని నపుతున్న సమగ్రమైన దీక్షణను అందిస్తున్న పోలీసు అధికారులకు సగర్వంగా అభినందనలు తెలుపుకుంటున్నామన్నారు.

పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యం
పోలీసు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు రక్షణ రంగం పటిష్టత కోసం రూ.9.165 కోట్లు బడ్జెట్ ను కేటాయించిందన్నారు. సమాజంలో నిరంగతర రక్షణ కల్పన దిశగా ఈగల్ వింగ్, ప్రత్యేకంగా మహిళలు, చిన్నారుల ఆత్మ రక్షణ కోసం శక్తి యాప్ ని సమర్థవంతంగా నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత దృఢతరం చేసే ఉద్దేశ్యంతో, సమాజ శ్రేయస్సు కోసం రక్షణ రంగంలో అడుగిడాలనుకునే యువతకు ఉద్యోగ అవకశాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. త్వరలో మరో రెండువేల ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్థులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. పోలీసు కుటుంబాల శ్రేయస్సు కోసం బీమా సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
పోలీసులు చట్టాన్ని గౌరవిస్తూ, ప్రతి ఒక్కరినీ సమానంగా చూస్తూ విధులు నిర్వర్తించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత సూచించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, బలహీన వర్గాల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, వారిలో భరోసా కల్పించాలని అన్నారు. పోలీసు సిబ్బంది ప్రజల సమస్యలను ఓపికగా విని, మానవీయ దృక్పథంతో స్పందించాలన్నారు. ఉపాధ్యాయులపై కొందరు దుష్ప్రచారం చేయడం, వారి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ అవమానకరంగా మాట్లాడటం వల్ల వారు తీవ్రంగా బాధపడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడడంతోపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ... నేడు ప్రజాసేవలోకి అడుగుపెడుతున్న ప్రతి కానిస్టేబుల్ తన విధి పట్ల అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దారుఢ్యం, విధి నిర్వహణ నైపుణ్యాలను సేవలో కొనసాగించాలని సూచించారు.
కానిస్టేబుళ్లకు పురస్కారాలు..
అంతకుముందు శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. ఈ దీక్షాంత్ పరేడ్ కార్యక్రమంలో తొమ్మిది నెలల ప్రాథమిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 521 మంది కానిస్టేబుళ్లు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. వారిలో కడప పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన 194 మంది సివిల్ ఎస్‌సీటీపీసీలు, 11వ బెటాలియన్‌కు చెందిన 327 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ఉన్నారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు మంత్రి సవిత, కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పురస్కారాలు అందజేసి అభినందించారు. అనంతరం నూతన కానిస్టేబుళ్లకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో 11వ బెటాలియన్ కమాండెంట్ ఆనంద్ రెడ్డి, కడప డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం, బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రాజశేఖర్, పోలీసు అధికారులు, జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నత అధికారులు, వివిధ కేటగిరీలకు చెందిన పోలీసు, బెటాలియన్ సిబ్బంది, శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ పిఆర్వో వెంకట్ యాదవ్ వ్యాఖ్యాతగా వ్యవహరించి కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా సాగించారు.
Be the first to share your thoughts on this story!