దుర్గి, సెప్టెంబర్ 04
శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన మరియు నేరాల నియంత్రణే ధ్యేయంగా దుర్గి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడిగొప్పల గ్రామంలో పోలీసులు శుక్రవారం ఉదయం విస్తృతంగా ‘కార్డెన్ & సెర్చ్’ ఆపరేషన్ నిర్వహించారు. పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ ఆదేశాల మేరకు, గురజాల డీఎస్పీ మహేశ్వరావు పర్యవేక్షణలో ఉదయం 6 గంటల నుంచే గ్రామంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. పోలీసు అధికారులను, సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా విభజించి గ్రామంలోని వీధులు, అనుమానాస్పద ప్రాంతాలను జల్లెడ పట్టారు. ముఖ్యంగా రౌడీషీటర్లు, గతంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, పాత కేసుల్లోని నిందితుల ఇళ్లలో విస్తృత సోదాలు జరిపారు. ఈ తనిఖీలలో సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం గ్రామంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన అధికారులు, స్థానిక ప్రజలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రజలకు భరోసా కల్పించేందుకే ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ తనిఖీలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. గ్రామంలో అకారణంగా గొడవలు సృష్టిస్తే సహించేది లేదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాత కేసుల నిందితులను పిలిపించి, పాత పంథా వీడి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా లేదా అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కారంపూడి రూరల్ సీఐ భాస్కర్, మాచర్ల రూరల్ సీఐ వేణు, దుర్గి ఎస్సై బి. గోపాల్, మాచర్ల రూరల్ ఎస్సై వెంకట్రావు, టౌన్ ఎస్సై స్వర్ణలతలతో పాటు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!