మాచర్ల: అక్టోబర్ 01 రాజధాని వాయిస్ :
ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మాచర్ల మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో, మాచర్ల స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామి వివేకానంద సేవాశ్రమంలో వృద్ధుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
జిల్లా జడ్జి ఆదేశాల మేరకు, మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస కళ్యాణ్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రశాంత్ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మాచర్ల మండల న్యాయ సేవా కమిటీ సభ్యులు, పల్నాడు జిల్లా దిశ కమిటీ సభ్యులు, శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ.. వృద్ధులు ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ల సహకారంతో కొంతవరకు ఆర్థిక భరోసాతో జీవిస్తున్నప్పటికీ, కొందరు ఆర్థిక ఇబ్బందులతో పాటు తమకు అండగా నిలిచే వారు లేక, ప్రేమగా ఆప్యాయంగా పలకరించే వారు లేక ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు.
వృద్ధులు ఇటువంటి సమస్యలను అధిగమించేందుకు ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకోవడంతో పాటు మంచి పుస్తకాలను చదవడం, ధ్యానం చేయడం, ఈర్ష్య, అసూయలకు దూరంగా ప్రశాంతమైన జీవనం సాగించడం ఎంతో అవసరమని సూచించారు. పిల్లలు తమను పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా ప్రతి ఒక్కరినీ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లుగా భావిస్తూ సోదరభావంతో, కుటుంబ సభ్యుల మాదిరిగా మెలగాలని కోరారు.
ప్రేమ, ఆప్యాయత, సోదరభావంతో జీవనం సాగించినప్పుడే వృద్ధాప్య జీవితం సార్థకమవుతుందని, భగవంతుని ఆశీస్సులు లభిస్తాయని మెట్టు గోవిందరెడ్డి పేర్కొన్నారు.
కార్యక్రమం అనంతరం సేవాశ్రమంలోని వృద్ధులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవా కమిటీ సభ్యులు, సేవాశ్రమ నిర్వాహకులు, సిబ్బంది, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!