విజయవాడ. సెప్టెంబర్ 05 రాజధాని వాయిస్ :
భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని విజయవాడ ఏ-కన్వెన్షన్ లో మానవ వనరులు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఆద్యంతం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉపాధ్యాయులు, అధ్యాపకుల అభిప్రాయాలతో ఏర్పాటుచేసిన వాల్ బోర్డులను సీఎం, మంత్రి ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన మహనీయుడు డా.సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఉత్తమ ఉపాధ్యాయులు 175 మందికి ఘనంగా సత్కారం:
ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో తూర్పుగోదావరి జిల్లా రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టీచర్ రమ్యసుధ, కడప జిల్లా పోరుమామిళ్లలో ఏపీఎస్ఎస్ డీసీ స్కిల్ హబ్ కోఆర్డినేటర్ పనిచేస్తున్న కే.వెంకట్రావులకు వేదికపై సీఎం చంద్రబాబునాయుడు పక్కనే కూర్చొనే అవకాశం కల్పించి సమున్నతంగా గౌరవించారు. అనంతరం 175 మందికి సీఎం, మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ప్రదానం చేశారు. వారిని శాలువాతో సత్కరించి ప్రశంసాపత్రం, మెడల్, జ్ఞాపికతో పాటు రూ.20వేల నగదు బహుమతిని అందజేశారు. పాఠశాల విద్యాశాఖ నుంచి 79 మంది, ఇంటర్మీడియట్ నుంచి 24, సాంకేతిక విద్య నుంచి 14, విశ్వవిద్యాలయాల నుంచి 35, కళాశాల విద్య నుంచి 17 మంది, ఇంజనీరింగ్, ఫార్మసీల నుంచి ఆరుగురికి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు బహూకరించారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
Be the first to share your thoughts on this story!