పిడుగురాళ్ల.
శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన, నేర నియంత్రణే ధ్యేయంగా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనంకి గ్రామంలో పోలీసులు మంగళవారం వేకువజామున ముమ్మరంగా ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ నిర్వహించారు. పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆదేశాల మేరకు గురజాల డీఎస్పీ ఎం. మహేశ్వరరావు పర్యవేక్షణలో ఉదయం 6 గంటలకే గ్రామాన్ని చుట్టుముట్టిన పోలీసు బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. సంఘ వ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపుతూ, ప్రజలకు భద్రతా భరోసా కల్పించడమే లక్ష్యంగా పోలీస్ అధికారులు, సిబ్బంది పలు బృందాలుగా ఏర్పడి ఇళ్లు, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను అధికారులు సీజ్ చేశారు.రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రౌడీషీటర్లు, పాత కేసుల్లోని నిందితులు, అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచామని, గతంలో నేర చరిత్ర ఉన్న వ్యక్తులు తమ పద్ధతి మార్చుకుని సత్ప్రవర్తనతో మెలగాలని హెచ్చరించారు. అనంతరం గ్రామంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి స్థానిక ప్రజలతో ముఖాముఖి సమావేశమయ్యారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచిస్తూనే, మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో అపరిచిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అల్లర్లు, గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల సీఐ వెంకటరావు, గురజాల సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు, భారీ సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!