అమరావతి.
సెప్టెంబర్ 02
సమయం ప్రవహించే కొద్దీ కాలచక్రంలో ఎన్నో జ్ఞాపకాలు కరిగిపోతాయి, ఎందరో నాయకుల పేర్లు చరిత్ర పుస్తకాల పుటలకే పరిమితమవుతాయి. కానీ పదిహేడేళ్లు గడిచినా, తెలుగు నేల గుండె చప్పుడులో ఇంకా చెరగని ముద్రగా నిలిచిపోయిన పేరు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. 2009 సెప్టెంబర్ 2 ఉదయం బెగంపేట విమానాశ్రయం నుంచి చిత్తూరు జిల్లా రచ్చబండకు ఎగిరిన ఆ హెలికాప్టర్, తెలుగు ప్రజల గుండెల్లో ఇంతటి తీరని విషాదాన్ని మిగుల్చుతుందని ఎవరూ ఊహించలేదు. కార్మొబ్బులు కమ్మేసిన నల్లమల అడవులు, రుద్రకొండ సాక్షిగా సాగిన ఆ 24 గంటల మహా ఉత్కంఠ, తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యంత చీకటి రోజుగా మిగిలిపోయింది. మరుసటి రోజు తెల్లవారేసరికి వచ్చిన ఆ ఒక్క చేదు వార్త కోట్లాది ఇళ్లలో కన్నీటి వరద పారించింది, ఎందరో గుండెలను ఆపివేసింది.
వైఎస్సార్ అంటే కేవలం ఒక ముఖ్యమంత్రో లేక ఓ రాజకీయ నాయకుడో మాత్రమే కాదు, కోట్లాది మంది సామాన్యులు తమ ఇంట్లో పెద్ద దిక్కుగా భావించిన ఒక నిలువెత్తు భరోసా. చేతులు జోడించి నమస్కరిస్తూ ఆయన ముఖంపై వెలిగే ఆ చెరగని చిరునవ్వు, లక్షలాది పేదల కష్టాలను దూరం చేసే సంజీవనిలా కనిపించేది. ఉచిత విద్యుత్ కోసం ఎదురుచూసిన రైతు కన్నీటిని తుడిచినా, రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ ఆసుపత్రిలో పేదవాడికి ప్రాణం పోసిన ఆరోగ్యశ్రీ పథకం తెచ్చినా, రెక్కల కష్టం తప్ప చదువుకునే స్తోమత లేని పేద బిడ్డలను ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఇంజనీర్లు, డాక్టర్లుగా తీర్చిదిద్దినా.. అది వైఎస్సార్ ఆలోచనలకే సాధ్యమైంది. జలయజ్ఞం ప్రాజెక్టులతో బీడు భూములకు జీవం పోయాలని తపించిన ఆ మనసు ఎప్పుడూ ప్రజా సంక్షేమం చుట్టూనే పరిభ్రమించింది.
ఆయన శరీరం భౌతికంగా కాలగర్భంలో కలిసిపోయి పదిహేడేళ్లు కావస్తున్నా, ఆయన ఆలోచనలు మాత్రం తెలుగు ప్రజల నిత్య జీవితంలో ఇంకా సజీవంగానే ఊపిరి పీల్చుకుంటున్నాయి. పచ్చని పొలాల గట్ల మీద రైతు మురిపెంలో, ఉచిత వైద్యంతో ప్రాణం నిలుపుకున్న వృద్ధురాలి ఆశీర్వాదంలో, పెద్ద చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న నిరుపేద యువకుల విజయాల్లో వైఎస్సార్ నిరంతరం జీవిస్తూనే ఉన్నారు. అధికారాలు మారొచ్చు, తరాలు మారొచ్చు, రాజకీయ సమీకరణాలు మారొచ్చు.. కానీ ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న 'జననేత' జ్ఞాపకాలను ఏ కాలమూ చెరిపివేయలేదు. భౌతికంగా మన మధ్య లేకపోయినా, తెలుగు నేల ఉన్నంత వరకు 'రాజన్న' తెచ్చిన సంక్షేమ విప్లవం చిరస్థాయిగా నిలుస్తూనే ఉంటుంది.
Be the first to share your thoughts on this story!