- మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలి- మండపాల వద్ద లౌడ్ స్పీకర్లు మరియు డీజేలపై ఆంక్షలు- పండుగను ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణంలో జరుపుకోవడానికి చర్యలు- జేసి సంజనా సింహా
నరసరావుపేట , 09 సెప్టెంబర్ 2026: రాజధాని వాయిస్ :
జిల్లా వ్యాప్తంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినాయక చవితి పండుగను నిర్వహించుకోవడానికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ సంజనా సింహా పేర్కొన్నారు.
బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో సమావేశ మందిరంలో దీపావళి , వినాయక చవితి పండుగ సందర్భంగా క్రాకర్స్ (టపాసులు) వినియోగంపై సంయుక్త కలెక్టర్ సంజనా సింహా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి , డిఆర్ఓ అద్దయ్య తో కలసి జిల్లాలోని రెవిన్యూ డివిజనల్ అధికారులు, తాసిల్దారులు, మున్సిపల్ కమిషనర్లు, విద్యుత్ ,ఫైర్ , ఇరిగేషన్, ఫిషరీస్, పోలీస్ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ సంజనా సింహా మాట్లాడుతూ రానున్న వినాయక చవితి , దీపావళి పండుగలకు క్రాకర్స్ వినియోగంపై ప్రభుత్వం నుండి వచ్చిన నిబంధనలు తెలియజేయవలసిందిగా అగ్నిమాపక శాఖాదికారిని కోరారు. ఇందుకు సమాధానంగా ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి టపాసుల వినియోగంపై ఎటువంటి మార్గదర్శకాలు అందలేదని , వారం రోజుల్లో గైడ్లైన్స్ వస్తాయని తెలిపుతూ కమిటీని నియమించడం జరిగిందన్నారు. దీనిపై సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్ని లైసెన్స్ గల రిటైల్ షాపులు, హోల్సేల్ షాపులు, గోడౌన్స్ ఉన్నాయో రిపోర్ట్ ఇవ్వాలని, అలాగే క్రాకర్స్ తయారీ కేంద్రాలు ఎన్ని ఉన్నాయో తెలపాలని , ఎన్ని లైసెన్సులు ఇచ్చారో తెలియజేయాల్సిందిగా కోరారు. అన్ని మండలాల తాహసీల్దార్లు , ఆర్డీవోలు, మున్సిపల్ అధికారులు క్రాకర్స్ లైసెన్సులు, షాపులు ప్రాపర్ గా ఉన్నాయా లేదో చెక్ చేసి రిపోర్టు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అలాగే వినాయక సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసేందుకు పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని , మండపాలు ఏర్పాటు చేసిన ఏరియాలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. హాస్పిటల్స్ ఉండే ఏరియాలో డీజే సౌండ్ తగ్గించాలని కాలువలలో నీళ్లు లేనందున నిమజ్జనం ఎక్కడ చేస్తున్నారో ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని , చెరువుల వద్ద నిమజ్జనాలు చేస్తున్నట్లయితే క్రేన్లు, లైఫ్ జాకెట్లు , సిమ్మర్లను అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు. సోషల్ మీడియా ద్వారా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినవి కాకుండా పర్యావరణ పరిరక్షణకు మట్టితో చేసిన విగ్రహాలను వాడాలని కలెక్టర్ సూచించారు.
అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి మాట్లాడుతూ మండపాలు ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని, ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అగ్నిమాపక శాఖ ఫైర్ ఎక్విప్మెంట్ తో సిద్ధంగా ఉండాలని, నిమజ్జనం చేసే దగ్గర ఫిషరీస్ డిపార్ట్మెంట్ సిమ్మర్లను ఏర్పాటు చేయాలని, మెడకల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ , అంబులెన్స్ లను సిద్ధం చేసుకుని ఉండాలని, ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ బారికేట్స్ నిర్మించాలని ,మున్సిపల్ , పంచాయతీ అధికారులు శానిటేషన్ సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలన్నారు. ప్రజలు పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేటట్లు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కోరారు.
గణేష్ మండపాల్లో విద్యుత్ అలంకరణలు, తాత్కాలిక విద్యుత్ వినియోగం విషయంలో నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని ఎస్సీ ఏపీ సీపీడీసీఎల్ టి.విజయ్ కుమార్ పల్నాడు అన్నారు. .గణేష్ మండపాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా 500 వాట్ ల కు వెయ్యి రూపాయలు, వెయ్యి వాట్లకు 2250 రూపాయలు చెల్లించి విద్యుత్ సరఫరా పొందవలసిందిగా కోరారు. గణేష్ మండపాలను విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండపాలపై నుంచి విద్యుత్ తీగలు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గణేష్ ఉత్సవాన్ని పురస్కరించుకుని 14వ తేదీ నుండి 26వ తేదీ వరకు తాత్కాలిక విద్యుత్ సరఫరా అందించనున్నట్లు తెలిపారు. మండప నిర్వాహకులు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్ట విరుద్ధంగా విద్యుత్తును వినియోగించరాదని, అక్రమంగా విద్యుత్ వినియోగించడం గుర్తిస్తే నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
డిప్యూటీ ఇంజనీర్ ఎన్ ఎస్ పి లింగంగుంట్ల నాగబాబు మాట్లాడుతూ కాలువల్లో నీళ్ళు నాలుగు రోజుల వరకే వస్తాయని , ఆ నీళ్ళను కుడా గ్రామాల్లోని చెరువులకు త్రాగునీటి అవసరాలకు నింపడం జరుగుతుందన్నారు. నీరు త్రాగడానికి విడుదల చేస్తున్నందున కాలువల్లో విగ్రహాలను నిమజ్జనం చేయరాదని తెలుపుతూ గ్రామాల్లో టాం.. టాం వేయించాలన్నారు. దైదా , అమరావతి చుట్టుపక్కల కృష్ణా నదిలో నిమజ్జనం చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని , లైఫ్ బోట్లు , స్వీమ్మర్లను సిద్దంగావుంచుకోవాలన్నారు.సమావేశంలో ఆర్డిఓ లు , డి ఎస్పీ లు , తహసీల్దార్లు, మున్సిపల్ కమీషనర్లు , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!