బాపట్ల: సెప్టెంబర్ 23 రాజధాని వాయిస్:
ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ అభివృద్ధి పనుల ప్రగతిపై అనుబంధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెండింగ్ పనులను పూర్తి చేయడానికి అధికారులు అంకితభావంతో పనిచేయాలని, ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే అభివృద్ధి కార్యక్రమాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లినప్పుడే ఆశించిన ఫలితాలు సాధించగలమని పేర్కొంటూ, ఏపీఈడబ్ల్యూఐడీసీ ద్వారా చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
విద్యాశాఖ, సమగ్ర శిక్షా అభియాన్ కింద మంజూరైన పనులను అక్టోబర్ 30 నాటికి, బీసీ సంక్షేమ వసతి గృహాల నిర్మాణం మరియు మరమ్మతులను అక్టోబర్ 15 లోగా పూర్తి చేయాలని గడువు విధించారు. అలాగే ఎస్సీ సంక్షేమ బాలుర వసతి గృహాల పనులను కూడా వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డీఈవో శ్రీనివాస్ సింగ్, పీఆర్ ఎస్ఈ సత్యనారాయణ, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!