తాడేపల్లి.
రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వైఎస్సార్సీపీ లేఖ రాసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో అధికార యంత్రాంగం దుర్వినియోగం అయిందని, అధికార పార్టీ వ్యక్తుల జోక్యం, బెదిరింపులు చోటుచేసుకున్నాయని లేఖలో ఆరోపిస్తూ, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర బలగాల భద్రత తప్పనిసరి అని పేర్కొన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో గతంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ వ్యక్తులు పోలింగ్ ప్రక్రియలో జోక్యం చేసుకున్నారని, పోలింగ్ కేంద్రాల్లోకి అనధికారికంగా ప్రవేశించి ఏజెంట్లు, ఓటర్లను బెదిరించి ఆటంకం కలిగించారని ఆరోపించారు. చిన్న కొట్టపల్లి పోలింగ్ బూత్‌లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించారని, మంత్రి సమక్షంలోనే వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్‌పై భౌతిక దాడి చేసి కేంద్రం నుంచి బయటకు పంపించారని లేఖలో పేర్కొన్నారు. అలాగే నాగులదిన్నెవారిపల్లె గ్రామంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, నేత వెలుపుల రామలింగారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని, వాహనాలను ఇనుపరాడ్లతో ధ్వంసం చేసి ఓ ఇంటికి నిప్పుపెట్టే ప్రయత్నం చేశారని ప్రస్తావించారు. పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లోని సుమారు 15 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను బెదిరించి, రిగ్గింగ్ చేస్తూ ఏజెంట్లను బయటకు పంపించారని ఆరోపిస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట బందోబస్తు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ ఆరోపణలపై అధికార పార్టీ వర్గాల వివరణ తెలియాల్సి ఉంది.
Be the first to share your thoughts on this story!