తెలుగు సాహిత్య చరిత్రలో బాల సాహిత్యానికి విశిష్ట స్థానం ఉంది. “నేటి బాలలే రేపటి పౌరులు” అనే నానుడి ప్రకారం పిల్లలలో ఉత్తమ విలువలు పెంపొందించడానికి, వారి మనోవికాసానికి మరియు ఉన్నతమైన సమాజాన్ని నిర్మించడానికి బాల సాహిత్యం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. విజ్ఞాన, నీతి మరియు విలువలను పెంపొందించడానికి, సృజనాత్మకతను పిల్లలకు నింపడానికి, వారి జీవితానికి బలమైన పునాదులు వేయడానికి కథలు, గేయాలు, పద్యాలు మరియు పాటల రూపంలో, సరళమైన భాషలో వారి ఆలోచన స్థాయికి తగినట్టుగా సాహితీ కారులు బాల సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు.
“మొక్కై వంగనిది మానై వంగునా” అన్నట్టు బాల్యం నుండే క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడే వారు సఫలీకృతులు అవుతారని, అలాంటి క్రమశిక్షణాయతమైన జీవితాన్ని గడుపుటకు బాల సాహిత్యం ఆవశ్యకత ఎంతైనా ఉంది. భాష పై పట్టు సాధించడానికి, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసానికి, మన సంస్కృతి, సాంప్రదాయాలు మరియు వారసత్వo గురించి తెలుసుకోవడానికి, మానసిక వికాసానికి బాల సాహిత్యం తోడ్పడుతుంది.
*ప్రముఖ బాల సాహితీకారులు*
తెలుగు సాహిత్యంలో చిన్నయ సూరి, కందుకూరి వీరేశలింగం, చింతా దీక్షితులు, మరియు గిడుగు సీతాపతి, కరుణ శ్రీ, ముళ్ళపూడి వెంకటరమణ వంటి ఎందరో మహానుభావులు బాల సాహిత్య వికాసానికి ఎంతో కృషి చేశారు. ఉపాధ్యాయ, అధ్యాపక, ఆచార్యులుగా పనిచేస్తున్న వారు విద్యార్థులకు పాఠాలు మాత్రమే కాకుండా జీవిత పాఠాలను పాటలు, పద్యాలు, గేయాలు మరియు కథల రూపంలో అందించారు.
*కథా సాహిత్యం*
బాల సాహిత్యంలో కథా సాహిత్యం ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అనాది నుండి ఆధునిక కాలం వరకు నీతిని, విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతూ తెలుగు బాల సాహిత్యంలో కథా సాహిత్యం కీలక పాత్ర పోషిస్తుంది. పంచతంత్ర కథలు, హితోపదేశ కథలు, ఈసఫ్ కథలు తరతరాలుగా పిల్లలకు మంచి నడవడికను, లోకజ్ఞానాన్ని ప్రబోధిస్తున్నాయి. తెనాలి రామకృష్ణుని కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, అక్బర్ బీర్బల్ కథలు, మర్యాద రామన్న కథలు పిల్లల్లో ఆలోచనా శక్తిని, సమయస్ఫూర్తిని, హాస్యాన్ని పెంపొందిస్తుంటాయి. కాశీ మజిలీ కథలు, భట్టి విక్రమార్కుని కథలు, కథలు పిల్లల్లో ధైర్యాన్ని, ఊహాశక్తిని నింపుతాయి. చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు వంటి కథలు ఆధునిక కాలానికి తగినట్టుగా మరియు మానవీయ విలువలను బోధించేవిగా రచించబడ్డాయి.
మారుతున్న కాలానికి అనుగుణంగా బాల కథా సాహిత్యంలో అనేక మార్పులు వచ్చాయి. విభిన్న వృత్తాంతాలను కథా వస్తువులుగా మలచి కథా సాహిత్యాన్ని అందిస్తున్న వారిలో డాక్టర్ మైలవరపు లలిత కుమారి ముఖ్యులు. బండ్లమూడి హనుమాయమ్మ హిందూ మహిళ డిగ్రీ కళాశాల నందు తెలుగు అధ్యాపకురాలుగా పని చేసి ఉద్యోగ విరమణ చేసిన వీరు అనేక రేడియో ప్రసంగాలు, టెలివిజన్ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. రాష్ట్ర, జాతీయ సదస్సులలో 50 పత్ర సమర్పణలు చేశారు. కళాశాలలో జాతీయ సదస్సులు నిర్వహించారు. కవితలు, వ్యాసాలు, చిన్న కథలు మరియు బాల సాహిత్యాన్ని రచించారు. 26 కథలను లలిత బాల కథలు అను పేరుతో కథా సంపుటిని ప్రచురించారు. ఈ సంపుటంలోని కథలు 2021 నుండి 2026 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రంగా ఆలోచనాలోచనo అను కార్యక్రమం ద్వారా ప్రసారం చేయబడింది. బాల సాహిత్యానికి విశేషమైన కృషి చేసిన డాక్టర్ రావి రంగారావు స్థాపించిన *అమరావతి సాహితీ మిత్రులు* అను సంస్థ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఆవిష్కరించిన ఈ కథల సంపుటి చదువుల తల్లి వాగ్దేవికి అంకితం ఇచ్చారు.
అహంకారంతో గురువుని విస్మరించి ఎంతటి పుణ్య కార్యాలు చేసినప్పటికీ పతనం తప్పదని, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదని పురాణాలలోని దేవేంద్రుడు మరియు బృహస్పతుల వృత్తాంతాన్ని *గురువు దీవెన* గా మలచి నీతిని, నైతిక విలువలను బోధించారు రచయిత్రి. మహాభారతంలోని సక్తుప్రస్తుని వృత్తాంతాన్ని తీసుకొని అన్ని దానాలలో కెల్లా అన్నదానమే గొప్పదని, అంతేగాక మనం చేసేటువంటి దానం ఆత్మశుద్ధితో చేయాలని *అన్నదాన మహిమ* కథలో తెలియపరిచారు. ఎదుటివారు శత్రువైనా ప్రమాదంలో ఉన్నట్లు తెలిస్తే తప్పకుండా సహాయం చేయాలి అనే ధర్మాన్ని మహాభారతం నుండి సంగ్రహించి *అపకారికైనా ఉపకారం చెయ్యాలి* అను కథలో చక్కగా వివరించారు రచయిత్రి. పురాణాలలోని నహుశుడి అహంకారపు బుద్ధిని, పర్యవసానాన్ని మరియు అతనికి కలిగిన శాప విముక్తిని ఉదాహరణగా *అహంకారం పతనానికి హేతువు* కథలో వివరిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనైనా పెద్దలను మరియు గురువులను అవమానించరాదని హితవు పలికారు. తల్లిదండ్రులకు సేవ చేయుట కంటే మించిన మరొక ధర్మం లేదని ధర్మ వ్యాధుని ద్వారా కౌశికునికి హితబోధను *ధర్మ వర్తన* అను కథలో ప్రబోధించారు రచయిత్రి. ప్రేమ దయ ఉన్నవాళ్లకి ఎప్పుడు గౌరవం దక్కుతుందని గౌతమునిలో దయా గుణాన్ని, దేవ దత్తునిలో చెడ్డ స్వభావాన్ని *హంస తీర్పు* అను కథలో ఆవిష్కరించారు. రాయలసీమ జానపద సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన బలిరాముడు, ఇలవతంసుని వృత్తాంతాన్ని చక్కగా వివరించారు.
పిల్లలను ర్యాంకులు సంపాదించే యంత్రాల్లా కాకుండా వారికి స్వేచ్ఛని ఇవ్వాలని, వారి అభిరుచికి తగిన విద్యను చెప్పించాలని *బామ్మ మాట* కథలో విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు కర్తవ్య బోధ చేశారు. నీతి మరియు నిస్వార్థాల ఆవశ్యకతలను మరియు ఆస్తి అంతస్తులు తో కాకుండా వ్యక్తుల ప్రవర్తనను బట్టి విలువ ఉంటుందని *విలువ* కథలో ఉద్బోధించారు రచయిత్రి. ప్రమాదం చెప్పి రాదని, ముందుగానే పరిస్థితులను ఊహించి జాగ్రత్త పడాలని *ముందుచూపు* అను కథలో వివరించారు. మనం చేసే మంచి పనులు మరియు ఇతరులకు సహాయం చేయడంలోనే సంతృప్తి మరియు సంతోషం ఉంది అని *ఆనందం అంటే?* అను కథలో ఆనందాన్ని నిర్వచించారు. స్వేచ్ఛగా తిరిగే పక్షులను, మూగజీవులను బలవంతంగా బంధించరాదని దానివలన ఇబ్బందులు పడతామని *స్వేచ్ఛ* అనే కథలో చక్కని సామ్యంతో హితబోధ చేశారు రచయిత్రి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఎటువంటి ప్రమాదం నుండైనా తప్పించుకోవచ్చునని జిత్తులమారి నక్క, తెలివైన తాబేలులను సృష్టించి *సమయస్ఫూర్తి* అను కథలో అక్షరీకరించారు రచయిత్రి. తన తల్లికి ఇచ్చిన మాట కోసం దొంగల నాయకుడితో నిజాన్ని పలికి అతనిలో పరివర్తన తెచ్చిన విధానాన్ని *సత్యమునే పలుకుము* అను కథలో కళ్ళకు కట్టినట్లుగా కథ చెప్పారు రచయిత్రి. మనిషి చనిపోయిన తర్వాత శరీరం కుళ్లిపోతుందని లేదా కాల్చితే బూడిదవుతుందని అలా కాకుండా అవయవ దానం చేస్తే ఇతరులకు ప్రాణం పోసినట్లు అవుతుందని *పరోపకారమే జీవితం* అను కథలో అవయవ దానం ఆవశ్యకతను చిన్నపిల్లలకు అర్థమయ్యే విధంగా తెలియజేశారు.
కలలు కనండి సాకారం చేసుకోండి అని పలికిన ఆదర్శ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి జీవితాన్ని గురించి తెలియజేస్తూ కష్టపడితే ఫలితం లభిస్తుందని *విజయం నీదే* అనే కథలో స్పష్టంగా పలికారు రచయిత్రి. గట్టి నమ్మకంతో కార్యాన్ని ప్రారంభించి పనిచేస్తే ఫలితం దక్కుతుందని *దృఢ సంకల్పం* అను కథలో తెలియజేశారు. మన సంప్రదాయాలు, సంస్కృతిలను ప్రతిబింబించే పండుగలను గురించి *పెద్ద పండుగ సంక్రాంతి* అను కథలో సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు. దేశ నాయకులు గురించి పిల్లలకు తెలిపితే దేశభక్తి పెరుగుతుందని అంత మాత్రమే కాదు పిల్లలకు అర్థమయ్యే రీతిలో స్వాతంత్ర్య దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి తేడాను *దేశభక్తి* అను కథలో చక్కగా వివరించారు రచయిత్రి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయవలసిన ఆవశ్యకతను *మంచి మనసు* అను కథలో వివరించారు. పాత రోజుల్లో వాడే బోషాణానికి, ఇనప పెట్టకి తేడాను మరియు ఉపయోగాన్ని తెలుపుతూనే ఉమ్మడి కుటుంబ ఆవశ్యకతను *బోషాణం* అను కథలో చక్కగా వివరించారు. నాటి నేటి మానవ సంబంధాలను *జనారణ్యం* అను కథలో ప్రస్ఫుటపరిచారు. అల్పబుద్ధి కలిగిన వారు అవమానించినా మంచివారు సత్ప్రవర్తనతో వారికి సహాయం చేస్తారని *హంసకాకోపాఖ్యానం* కథలో తెలియపరిచారు. ఇప్పటి పిల్లల ఆటల అభిరుచికి తగ్గట్టు *ఏకాగ్రత* అంటే ఏమిటో క్రికెట్ ద్వారా వివరించారు. ఆపద కలిగినా, ఆకలి అయ్యినా కాకులు కలిసి పంచుకుంటాయని *ఐకమత్యం* కథలో తెలిపారు. తృప్తికి మించిన సంపద మరొకటి లేదని *ఆత్మానందం* అను కథలో ఉద్భోదించారు రచయిత్రి.
*ముగింపు*
పురాణ ఇతిహాసాలలోని ఇతివృత్తాలను, చినయసూరి నీతి చంద్రికను పోలిన పశుపక్ష్యాదులను పాత్రలుగా చేసి, సామాజిక అంశాలను కథలుగా మలచి లలిత బాల కథలుగా నీతిని, మన సంస్కృతి, సాంప్రదాయాలను, విలువలను కథల రూపంలో అందించిన పూర్వ అధికార భాషా సభ్యురాలు మరియు విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ మైలవరపు లలిత కుమారి కలం నుండి మరింత బాల సాహిత్యము మరియు విభిన్న రచనలు వెలువడాలని, ఈ పుస్తకము బాల సాహితీ ప్రియులకు మరియు విద్యార్థులకు మరింత చేరువ కావాలని కోరుకుంటూ......
*అనిల్ కుమార్ దారివేముల*
*మాచర్ల, పల్నాడు జిల్లా*
*9951244718.*
Be the first to share your thoughts on this story!