నరసరావుపేట. సెప్టెంబర్ 04
పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆదేశాల మేరకు నరసరావుపేట ఆరండల్ పేటలోని భావన జూనియర్ కళాశాలలో విద్యార్థినుల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, ర్యాగింగ్ నిరోధంపై శుక్రవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మహిళా పోలీస్ స్టేషన్ సీఐ తాళ్లూరి అశోక్ బాబు మాట్లాడుతూ,విద్యాసంస్థల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమన్నారు. యువత మాదకద్రవ్యాల బారిన పడి తమ అమూల్యమైన భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని, గంజాయి వంటి వ్యసనాలు మానసిక నియంత్రణను కోల్పోయేలా చేసి నేర ప్రవృత్తి వైపు నెడతాయని హెచ్చరించారు. విద్యార్థుల ప్రవర్తనను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం గమనిస్తూ సరైన మార్గదర్శనం చేయాలని, పరిసరాల్లో మాదకద్రవ్యాల విక్రయాలు జరిగితే వెంటనే పోలీసులకు లేదా 1972 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.
ట్రాఫిక్ నిబంధనల గురించి వివరిస్తూ, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం తప్పనిసరి అని, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రాణాంతకమని పేర్కొన్నారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పడం, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం వంటివి చేయవద్దని స్పష్టం చేశారు. ఎవరైనా సైబర్ మోసాల బారిన పడితే వెంటనే 193 టోల్ ఫ్రీ నెంబర్‌కు లేదా అధికారిక సైబర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'శక్తి యాప్' ఆపద సమయాల్లో ఎంతగానో దోహదపడుతుందని, విద్యార్థినులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళాశాలల్లో ర్యాగింగ్ చట్టరీత్యా నేరమని, కొత్తగా చేరిన విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ, యాజమాన్యాలు నిరోధక కమిటీల ద్వారా సురక్షిత వాతావరణాన్ని కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శేషయ్య నాయుడు, భావన జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గుంటు రామచంద్రారెడ్డి, డైరెక్టర్ ఎం. శ్రీనివాసరావు, ఏవో వెంకట్రావు, కళాశాల అధ్యాపకులు, పోలీస్ సిబ్బందితో పాటు సుమారు 100 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో సీఐ అశోక్ బాబును కళాశాల ప్రిన్సిపల్ శాలువా కప్పి, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.
Be the first to share your thoughts on this story!