పెనుకొండ/
శ్రీ సత్యసాయి జిల్లా : రాజధాని వాయిస్
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలియడంతోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైకాపా నాయకులు దాడులకు తెగబడుతున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత-జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత విమర్శించారు. శనివారం పెనుకొండలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే వైకాపా నేతలు పక్క రాష్ట్రాల నుంచి అసాంఘిక శక్తులను రప్పించి తెదేపా నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగారని ఆమె ఆరోపించారు. తిరుపతి, రాయచోటి, పుంగనూరు, ధర్మవరం తదితర ప్రాంతాల్లో వైకాపా శ్రేణులు తీవ్ర భయాందోళనలు సృష్టించాయని మండిపడ్డారు. ఎంపీ మిథున్ రెడ్డి ప్రజాప్రతినిధి అనే విషయాన్ని విస్మరించి, వీధి రౌడీలా ప్రవర్తిస్తూ నామినేషన్ కేంద్రాల వద్ద దాడులకు ఉసిగొల్పారని ఆరోపించారు. ఈ అరాచకాలపై ఇప్పటికే తాము ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు ఎలాంటి పక్షపాతం లేకుండా పూర్తి స్వేచ్ఛతో తమ విధులు నిర్వర్తిస్తున్నారని స్పష్టం చేశారు.
త్వరలోనే వైకాపా దుకాణం బంద్..
ఒకవైపు ఈడీ దాడులు, మరోవైపు దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వేళ్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తుండడంతో వైఎస్ జగన్‌లో తీవ్ర ఆందోళన మొదలైందని మంత్రి సవిత ఎద్దేవా చేశారు. ఏం చేయాలో పాలుపోకనే రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాల ఫలితంగా త్వరలోనే ఆ పార్టీ ఉనికి కోల్పోవడం ఖాయమన్నారు.
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం కావాలి
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో నామినేషన్ పత్రాలు చించివేసి, దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేసుకున్న చరిత్ర ప్రజలకు ఇంకా గుర్తేనన్నారు. పులివెందులతో సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కూటమిలోని అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు విభేదాలు వీడి ఐక్యంగా పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
Be the first to share your thoughts on this story!