ప్రొద్దుటూరు/కడప : అక్టోబర్ 03 రాజధాని వాయిస్ :
ప్రొద్దుటూరులో రూ.30 వేల కోట్ల జల జీవన్ మిషన్ నిధులతో తాగునీటి కల్పన ప్రాజెక్టును ఈ నెల 5వ తేదీన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ కార్యక్రమానికి కడప జిల్లాలో ఉన్న అన్ని నియోజక వర్గాల నుంచి లక్ష మందికిపైగా ప్రజలు తరలొస్తున్నారన్నారన్నారు. సీఎం,డిప్యూట సీఎం రాక నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రజలు తరలొస్తుండడడంతో పటిష్ట బందోబస్తు చేపడుతున్నామన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రొద్దుటూరులో జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ సహా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను సీఎంచంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం విస్తృతంగా చేపడుతోందన్నారు. రాయలసీమలో పెద్ద ఎత్తున సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. రెండ్రోజుల కిందట రూ.లక్ష కోట్లతో హార్టీకల్చర్ హబ్ కు శ్రీకారం చుట్టామని మంత్రి సవిత గుర్తిచేశారు. పల్లెపండుగ 3.0 పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రహదారులు నిర్మిస్తున్నామన్నారు. ప్రొద్దుటూరులో తాగునీటి కల్పనకు రూ.30 వేల కోట్ల జలజీవన్ మిషన్ నిధులు వెచ్చించనున్నామన్నారు. ఈ ప్రాజెక్టుకు ఈ నెల 5వ తేదీన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, పలువురు మంత్రులు పాల్గొనబోతున్నట్లు మంత్రి సవిత తెలిపారు.
అధికారులతో సమీక్ష..

అంతకుముందు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత నేతృత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏర్పాట్లను మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి,కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, లక్షకు పైగా ప్రజల వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో మార్గమధ్యంలో తాగునీటి ట్యాంకులు, టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. సభా ప్రాంగణంలో చల్లని గాలి వీచేలా కూలర్లు ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు మంత్రి సవిత సూచించారు. అనంతరం సభా ప్రాంగణంలో ఏర్పాట్లను మంత్రులు నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డితో కలిసి మంత్రి సవిత పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!