అమరావతి. సెప్టెంబర్ 24 రాజధాని వాయిస్ :
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీతో పాటు సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఆయన ప్రస్తుత పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
ఈ తీవ్ర వాయుగుండం మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం–కవిటి మధ్య తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో తీరం వెంబడి గంటకు 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. రానున్న 24, 25 తేదీల్లోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగే సూచనలు ఉన్నాయని స్పష్టం చేశారు.
వాతావరణ శాఖ నివేదికల ప్రకారం మొత్తం 261 మండలాల పరిధిలో పరిస్థితులను పరిశీలిస్తే.. 129 మండలాల్లో భారీ వర్షం, 121 మండలాల్లో సాధారణ వర్షం, 9 మండలాల్లో అతి భారీ వర్షం, మరో 2 మండలాల్లో తీవ్ర వర్షం కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి ఆకస్మిక వరద ప్రవాహాలు ఏర్పడే ముప్పు ఉందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఆకస్మిక వరదలు, భారీ వర్షాల ముప్పు ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు. నదులు, వాగుల్లో వరద ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, రిజర్వాయర్లలో నీటి నిల్వలను సమర్థంగా నిర్వహించేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం నిర్దేశించారు.
Be the first to share your thoughts on this story!