అధికారం ప్రజలకు సేవ చేసేందుకు దక్కిన అవకాశం.. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి
పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకత్వం సమష్టిగా పనిచేయాలి
ప్రజలను ఇబ్బంది పెడితే భవిష్యత్‌లో గెలుపు కష్టమే: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి.
ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ గ్రామస్థాయి నుంచి అత్యంత బలమైన క్యాడర్, కార్యకర్తలు, నాయకత్వ వ్యవస్థ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఇంత బలమైన కార్యకర్తల వ్యవస్థ కలిగిన తెలుగుదేశం పార్టీలో పనిచేసే అవకాశం లభించడం ప్రతి ఒక్కరి అదృష్టమని పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన తెలుగుదేశం లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. రాజకీయాల్లో లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. భగవంతుడు ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక రంగంలో అవకాశం కల్పిస్తారని మంత్రి అన్నారు.
ఐదు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో కేవలం 175 మందికి మాత్రమే ఎమ్మెల్యేలుగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభిస్తుందని, అలాంటి అరుదైన అవకాశాన్ని పొందిన ప్రతి ఒక్కరూ దాని విలువను గుర్తించాలని సూచించారు. పదవి రావడం ఎంత ముఖ్యమో.. వచ్చిన పదవిని నిలబెట్టుకోవడం అంతకంటే ముఖ్యమని అన్నారు. మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవకాశం శాశ్వతం కాదు. ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుని, దాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలి. అలా పనిచేస్తే తప్పకుండా విజయాన్ని సాధించగలం అని మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలు, ప్రజలతో ఎమ్మెల్యేలు నిరంతరం మమేకమై ఉండాలని అచ్చెన్నాయుడు సూచించారు. ప్రతి సమస్యను పరిష్కరించగలగడం సాధ్యం కాకపోయినా, కనీసం ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అండగా నిలవాలని అన్నారు. ప్రజలకు ఏమీ చేయలేకపోయినా ఫర్వాలేదు.. కానీ వారిని ఇబ్బంది పెట్టడం, వేధించడం మాత్రం చేయకూడదని స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే నాయకులకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదని మంత్రి హెచ్చరించారు. ప్రజలే రాజకీయ నాయకులకు అధికారం ఇస్తారని, అదే ప్రజల విశ్వాసాన్ని కోల్పోతే ఎలాంటి పదవిలో ఉన్నా తిరిగి గెలవడం కష్టమవుతుందని అన్నారు.
ప్రజలకు ఒక నమ్మకం కల్పించాలి
ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఫలానా సమయంలో ఎమ్మెల్యే గారిని కలవచ్చు.. ఆయన అందుబాటులో ఉంటారు అనే విశ్వాసం ప్రజల్లో ఏర్పడితే చాలా వరకు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయని చెప్పారు. ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండటం వల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని, చిన్నచిన్న సమస్యల కోసం ప్రజలు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుందని అన్నారు. ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. టీడీపీకి గ్రామస్థాయి నుంచి బలమైన కార్యకర్తల బలం ఉందని, ఆ బలాన్ని ప్రజా సేవకు ఉపయోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. పార్టీ నాయకత్వం, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల నమ్మకాన్ని మరింత పెంచుకోవాలని అన్నారు. పదవులు ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన అవకాశాలే తప్ప.. అధికారాన్ని చెలాయించడానికి కాదనే విషయాన్ని ప్రతి ప్రజాప్రతినిధి గుర్తుంచుకోవాలి అని అచ్చెన్నాయుడు సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండటం, కార్యకర్తలను గౌరవించడం, ప్రజల సమస్యలను పరిష్కరించడమే నాయకత్వానికి అసలైన కొలమానమని పేర్కొన్నారు.
Be the first to share your thoughts on this story!