Tuesday, 20 October 2026
Header1
BREAKING

పేదల గృహ నిర్మాణంలో నూతన అధ్యాయం .....కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 04 Oct 2026, 05:05 PM
👁️ 0 views

బుర్రిపాలెం /గుంటూరు, అక్టోబర్ 4:

కూటమి ప్రభుత్వంలో పేదల గృహ రంగానికి సరికొత్త భరోసా దక్కిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో రాష్ట్రంలో గృహ నిర్మాణాలు వేగవంతమవుతున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.

తెనాలి రూరల్ బుర్రిపాలెం లో జరిగిన భారీ బహిరంగ సభలో డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ పేదలు, రైతుల సేవకే అంకితమైన చంద్రబాబు నాయుడు, శివరాజ్ సింగ్ చౌహాన్ ఒకే వేదికపైకి రావడం ప్రజాసేవకు నిదర్శనమని కొనియాడారు.

భరోసానిచ్చే ఇళ్ల నిర్మాణం
రాష్ట్రం లో రూపుదిద్దుకుంటున్న 3 లక్షల గృహ నిర్మాణాల పునాది కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి స్వంత ఇంటి కల నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టిడ్కో (TIDCO) ఇళ్ల నిర్మాణ పనులను పునఃప్రారంభించి, నిర్ణీత గడువులోగా లబ్ధిదారులకు అందించడానికి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని వివరించారు.

దేశంలోనే తొలిసారిగా త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్లు

సాంకేతికతను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చేందుకు రోబోటిక్ 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికత ద్వారా ప్రయోగాత్మకంగా బుర్రిపాలెంలో 100 ఇళ్లు, దివ్యాంగులకు మరో 77 ఇళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ సాంకేతికత విజయవంతమైతే తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్లను నిర్మించే దిశగా భారతదేశానికే ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ పథకాల పరిధిలో ఆర్థిక సహాయంతో పాటు ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్, మహిళా స్వయం సహాయక సంఘాల రుణాల ద్వారా ప్రతి లబ్ధిదారునికి సుమారు రూ. 2.30 లక్షల ఆర్థిక ఊరట లభిస్తుందని వివరించారు.

పేదల ఆత్మగౌరవం, భద్రత, ఆనందమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

➖పేదల సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యం

..సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు నిర్మించి ఇవ్వడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రానికి 3 లక్షల ఇళ్లను సాధించామని, పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని చెప్పారు. 3డీ టెక్నాలజీ ద్వారా వేగవంతంగా, నాణ్యతతో, తక్కువ వ్యయంతో గృహ నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, CSIR-CBRI తదితర సంస్థలతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం గర్వకారణమన్నారు.

2029 నాటికి రాష్ట్రంలో అర్హత ఉన్న ఏ పేద కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకూడదన్నది ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి యూనిట్ వ్యయాన్ని రూ.2.39 లక్షలుగా, పట్టణ ప్రాంతాల్లో PMAY-2.0 కింద రూ.2.50 లక్షలుగా నిర్ణయించామని చెప్పారు.

రాష్ట్రంలో ఇంకా 6 లక్షల ఇళ్ల అవసరం ఉందని, వాటిని కూడా 2029లోగా కేటాయించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ముఖ్యమంత్రి కోరారని, దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడం సంతోషకరమన్నారు.

అదేవిధంగా యువతకు 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే రాజకీయాల కంటే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

➖పేదల ఇళ్ల నిర్మాణంలో అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేయాలి

.....రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్

గత ప్రభుత్వ హయాంలో హౌసింగ్‌ పథకంలో జరిగిన అవకతవకలు, పేదలకు జరిగిన నష్టంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కోరారు.

తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో హౌసింగ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ అనేక ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకునే అవకాశం లేకుండా దూర ప్రాంతాల్లో స్థలాలు కేటాయించారని అన్నారు. పేదల ఇళ్ల విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారించి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం హౌసింగ్‌ వ్యవస్థను పునరుద్ధరించి పేదలకు ఇళ్లు అందించేందుకు కృషి చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. భారతదేశంలో తొలిసారిగా 3డీ ప్రింటింగ్‌ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి ఆలోచన చేసిన ఎంపీ డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌‌ను మంత్రి అభినందించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమన్వయం చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తున్న సహకారం, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ నాయకత్వంతో పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, నజీర్ అహ్మద్, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X